తెలంగాణ భాజపా సీఎం పరిపూర్ణానంద!

154

ఇటీవల హైదరాబాదు నగర బహిష్కరణకు గురై, తర్వాత న్యాయస్థానం ద్వారా బహిష్కరణ ఆదేశాలను రద్దు చేయించుకుని, తిరిగి నగరంలో అడుగుపెట్టిన ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద తెలంగాణ రాష్ట్రానికి భాజపా తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి కాబోతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ఆయన భాజపాలో చేరబోతున్నట్లు సమాచారం. ఆయనను అమిత్ షా ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించారు. అక్కడ పార్టీలో చేరుతారని స్థానిక నాయకులు అంటున్నారు.
పరిపూర్ణానందను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల సమరాంగణంలోకి దించుతారని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో భాజపా ఓడిపోతే గనుక.. ఆయనను తిరిగి ఎంపీగా పార్లమెంటుకు పంపేలా హామీ ఇస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పరిపూర్ణానందను హిందూత్వ అనుకూల ప్రసంగాలలో కాస్త తీవ్ర స్థాయి వ్యాఖ్యల ద్వారా ప్రాముఖ్యత సంపాదించుకున్నారు. కత్తి మహేష్ రాముడిపై వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో ఆయన ప్రతిసవాళ్లు విసురుతూ.. ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆయనను కూడా నగర బహిష్కరణ చేశారు.
అయితే ఆయన ప్రచారం లాభిస్తుందని భాజపా ప్రస్తుతం భావిస్తున్నట్లుంది. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ లాగా, మరో స్వామీజీని రాజకీయాల్లోకి తేవడానికి భాజపా చూస్తోంది.
అయితే ఇక్కడ ఓ సంగతి గమనించాలి. యూపీలో పార్టీ గెలిచిన తర్వాత.. యోగి ఆదిత్యనాధ్ ను సీఎం చేశారు. ఇక్కడ తెలంగాణలో పార్టీ గెలిచే పరిస్థితే లేదు. మరి.. సీఎం అభ్యర్థిగా ప్రకటించినంత మాత్రాన స్వామి పరిపూర్ణానంద , పరువు పోగొట్టుకోవడం తప్ప మరోటి జరగదు. గత ఎన్నికల్లో తెదేపా సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పాపానికి ఆర్.కృష్ణయ్య బకరా అయ్యారు. ఇప్పుడు కూడా పరిపూర్ణానంద పరిస్థితి అంతే అవుతుందని అంచనాలు సాగుతున్నాయి.

Facebook Comments