పొత్తు :: ఉంటే హాటు, లేకుంటే స్వీటు!

215

సాధారణంగా భావసారూప్యత ఉండే పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. తమ రాజకీయ పార్టీల భావాలు ఒకటే గనుక.. ఆ భావాలను ఇష్టపడే ప్రజల ఓట్లు చీలిపోకుండా ఉండడం కోసం పొత్తులు ఏర్పడతాయి. కానీ ఈ రోజుల్లో ఆ సిద్ధాంతాలు మంటగలిసిపోయాయి. ఇప్పుడు అంతా.. ఎవరి అవసరం కోసం వారు పొత్తులు పెట్టుకుంటున్నారు. ఎవరి గతిలేనితనం మేరకు వారు పొత్తులు పెట్టుకుంటున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల పర్వంలో మనకు ఇలాంటి పొత్తులే కనిపిస్తున్నాయి.

కాకపోతే మరింత లోతుగా చూసినప్పుడు.. ఇక్కడ  విచిత్రమైన వాతావరణం ఉంది. పొత్తు పెట్టుకున్న పార్టీలు లోలోన కొట్టుకు చస్తోంటే.. పొత్తుల్లేని పార్టీలు మాత్రం.. చాలా స్నేహపూర్వకంగా పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఆ పార్టీలు మరేవో కాదు.. తెరాస-ఎంఐఎం.

ఈ రెండు పార్టీల మద్య పొత్తు లేదు. కాకపోతే వీరు చాలా స్నేహాన్ని పంచుకుంటున్నారు. మజ్లిస్ స్థానాల్లో ఓడిపోయే అభ్యర్థులను బరిలోకి దించాలని కేసీఆర్ తపన. ఏడు మజ్లిస్ సీట్లలో రెండింటికి మాత్రమే అలాంటి వారిని బరిలోకి ఎంపిక చేశారు. మరో అయిదు స్థానాల్లో వారికి ఇంకా ఓడిపోగల సమర్థత ఉన్న కేండిడేట్లు దొరకలేదు.

ఈలోగా.. రాష్ట్రంలో మిగిలిన ముస్లిం ప్రాబల్యం ఉన్న సీట్లన్నిటిలో తెరాసను గెలిపించేందుకు ఎలాంటి సహకారం పంచుకోవాలో డిసైడ్ కావడానికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, శుక్రవారం కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య అనేక కోణాల్లోంచి చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీలు కలిసిపోటీచేయడం లేదు గానీ.. ఇరువురూ ఒకరికొకరు పూర్తిగా సహకరించుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లు గా తెలుస్తోంది.

అదే సమయంలో అసలు మహాకూటమి పొత్తుల్లో ఉన్న పార్టీలు కాంగ్రెస్, తెదేపా, సీపీఐ, తెజస మాత్రం కీచులాడుకుంటూ ఉన్నాయి. కాంగ్రెస్ అహంకారాన్ని ఆ పార్టీలు ఓర్వలేకపోతున్నాయి. సీట్ల పంపకాల వద్ద పేచీలు సా…గుతూనే ఉన్నాయి.

అందుకే తెలంగాణ ముందస్తు ఎన్నికల వాతావరణంలో పొత్తు పెట్టుకున్న పార్టీలు హాట్ హాట్ గా కొట్టుకుంటూ ఉండగా.. పొత్తులేని వారు మాత్రం స్వీట్ సహకారంతో ముందుకెళుతున్నారని జనం నవ్వుకుంటున్నారు.

Facebook Comments