మహాకూటమిని వెనక్కు లాగేదెవరు?

263

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నాలుగూ చిన్నా చితకా పార్టీలు ఎంతమాత్రమూ కాదు. 2014 తర్వాతి పరిణామాల్లో తెలుగుదేశం  బలం కాస్త సన్నిగిల్లినా, కేడర్ మీద నమ్మకంతో బరిలో ఉంది. కాంగ్రెస్ విషయానికొస్తే.. తెరాసకు ప్రత్యామ్నాయం తామొక్కరే అని వారి ధీమా. సీపీఐ తొలినుంచి  కూడా చిన్న పార్టీనే. ఇక కోదండరాం నేతృత్వంలోని తెజస.. తెరాసకు సమానంగా ఉద్యమ ప్రజాదరణ ఉన్న పార్టీ తమదే అని నమ్ముతోంది. ఈ నాలుగు పార్టీలు.. తెరాస వ్యతిరేకత, కేసీఆర్ ను గద్దె దించడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో జట్టు కట్టాయి. అయితే చెప్పుకోడానికి ఓ  కూటమిగా ఏర్పడ్డాయే తప్ప.. ఆ తర్వాత ఇప్పటిదాకా ముందడుగు పడలేదు.

పొత్తుల్లో ఎవరికి ఎన్ని సీట్లో ఇప్పటిదాకా తేల్చుకోలేదు. కనీసం నాలుగు పార్టీలు కలిసి ఒక్క ప్రచార సభ కూడా నిర్వహించలేదు. ఇంతకంటె సూటిగా చెప్పాలంటే.. ఈ నాలుగు పార్టీలు కలిసే ఉండబోతున్నాయి అనే సూచన కూడా వారు ప్రజలకు అందించలేకపోతున్నారు. ఈ కూటమి ఎప్పుడు కుప్ప కూలిపోతుందో అనే అభిప్రాయమే ప్రజలందరికీ కలుగుతోంది.

ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎన్నికల ప్రచార పర్వంలో విపరీతంగా ముందుకు దూసుకెళ్లిపోతోంది. ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే అన్నిచోట్లా ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఈ  కూటమిలోని నాలుగు పార్టీలు మాత్రం.. ఇప్పటిదాకా సీట్లు కూడా పంచుకోలేక కుమ్ములాడుకుంటూ ఉణ్నాయి.

ఈ నేపథ్యంలో కూటమి తరఫున ముందడుగు పడకుండా వెనక్కు లాగుతున్న దెవరు? అని ఆలోచిస్తే.. అందరికీ కాంగ్రెస్ మీదనే వ్యతిరేక అభిప్రాయం ఏర్పడుతుంది. నిజానికి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి- సీట్ల కేటాయింపుల విషయంలో  ఇప్పటికే చాలా రాజీపడింది. పుట్టుకనుంచి వ్యతిరేకిస్తున్న పార్టీతో పొత్తు పెట్టుకోవడమే వారి తొలి దిగజారుడుతనం. సీట్లు కూడా ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే 30 సీట్లు అడుగుతున్నారు. ఎంత నీచంగా లెక్కవేసినా గతంలో గెలిచిన 15 సీట్లు అయినా దక్కుతాయనే ఆశ ఉంది. అందుకే.. కోదండరాం లాంటి వాళ్లు అలుగుతున్నా.. తామే వెళ్లి వారితో సంప్రదింపులు చేస్తున్నారు.

ఇకపోతే.. కోదండరాం మాత్రం తమకు చాలా బలం ఉన్నదనే నమ్మకంతో తెలుగుదేశానికంటె ఎక్కువ సీట్లకు పట్టుపడుతుండడం ఒక సమస్య. అదే సమయంలో.. కాంగ్రెస్ తాము 90 సీట్లకంటె ఏ మాత్రమూ తగ్గరాదని పంతం పడుతుండడం అంతకంటె పెద్ద సమస్య. ఈ రెండు పార్టీల వైఖరితో కూటమిలో పీటముడి బిగిసిపోతోంది. ఆ రకంగా ముందడుగు పడకుండా.. కూటమి ప్రస్థానం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఈసురోమంటోంది.

Facebook Comments