నిజాయితీ లేని గులాబీ కౌంటర్!

377

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ పార్టీని అన్ని రకాలుగానూ మిగిలిన వారికంటె ఎన్నికల సమర సన్నాహాల్లో ముందంజలో ఉంచడం లక్ష్యంగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను పాక్షికంగా ప్రకటించారు. నిజానికి ఇందులో చాలా హామీలే ఉన్నాయి. అన్నీ ప్రకటించినప్పటికీ.. దానికి పాక్షికంగ అని పేరు పెట్టారు. అంటే.. ఇంకా ఎన్నికల్లోగా మరికొన్ని వరాల్ని కూడా ప్రకటించడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. కాకపోతే.. ఈ పాక్షిక ప్రకటనలోనే చాలా వరకు కొత్త అంశాలు.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చాన్నాళ్లుగా ప్రకటిస్తున్న వాటికి కాపీ అనే విమర్శ ఒకటి ప్రధానంగా వెల్లువలా వినిపిస్తోంది.

Read this also :: ‘కండ’రగండడు గా నాగశౌర్య

అందులో సందేహం ఎంతమాత్రమూ లేదు. అయితే ఉన్నమాటంటే ఉలుకెక్కువ అన్న సామెత చందంగా ఈ మేనిఫెస్టోపై వెల్లువెత్తుతున్న విమర్శలకు తెరాస కౌంటర్లు ఇస్తోంది. కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించడం పూర్తి చేసిన కొంత సమయానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిపై నిశిత విమర్శలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కొంతకాలంగా ప్రకటిస్తున్న అంశాలనే మక్కీకి మక్కీ కాపీ కొట్టి మేనిఫెస్టో అనే పేరుతో తెరాస ప్రకటించిందని, ఈ ప్రకటనతో.. వారు కాంగ్రెస్ విజయాన్ని అంగీకరించినట్లేనని ఆయన అన్నారు.

ఈ మాట ప్రజల్లోకి వెళ్తే ప్రమాదం అని శంకించిన గులాబీ నేతలు తక్షణం రంగంలోకి దిగారు. ఒక్కబుధవారం నాడు తెరాస పార్టీ ఆఫీసులోనే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీ వినోద్, మరో ఎంపీ బాల్క సుమన్ విడివిడిగా విలేకర్ల సమావేశాలు ఏర్పాటు చేసి.. విరుచుకుపడ్డారు. తమ మేనిఫెస్టో కాపీ కానే కాదని సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా కేసార్ విజన్ ను కీర్తించడానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే వారి కౌంటర్ వాదనలను గమనించినప్పుడు అందులో నిజాయితీ రవ్వంతైనా లేదని అర్థమైపోతున్నది.

‘మమ్మల్ని కాపీ కొట్టారు’ అని కాంగ్రెస్ అంటోంటే.. ‘‘అసలు మీరు ఇప్పటిదాకా మేనిఫెస్టో ప్రకటించకుండానే.. కాపీ అంటారేమిటి? మీకసలు మేనిఫెస్టో అంటే అర్థం తెలుసా’’ లాంటి పసలేని విమర్శలతో వినోద్ ప్రశ్నించారు. మేనిఫెస్టో అనే పుస్తక రూపేణా ప్రకటించారా లేదా అనేది తర్వాతి సంగతి నిరుద్యోగ భృతి గానీ, పెన్షన్ల పెంపుగానీ.. కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్న అంశాలు కాగా, అచ్చంగా.. తెరాస వాటిని కాపీ కొట్టింది. అంటే.. మీరు ప్రకటిస్తున్న వరాలకే మేం మేనిఫెస్టో అనే ముసుగు వేస్తున్నాం అన్న చందంగా తెరాస వ్యవహారం సాగింది. అయితే గులాబీ దళపతులందరూ ఈ కాపీ క్యాట్ వ్యవహారాన్ని డిఫెండ్ చేసుకోడానికి నానా పాట్లు పడుతున్నారు. వంకర వంర పాయింట్లు లాగుతూ.. తమది కాపీ కానే కాదని.. ప్రచారం చేసుకోవడానికి అత్యుత్సాహ పడుతున్నారు.

Facebook Comments