సుఖశాంతులు పొందడం ఎలా?

339

దేహంలో అవయవాలు అనేకం ఉన్నాయి. ఇంద్రియాలు ఉన్నాయి. ఏ అవయం గానీ, ఇంద్రియం గానీ స్వస్థత కలిగి దాని స్థితి సుఖ భాజనమైతే ఆ సుఖాన్ని దేహమంతా అనుభవిస్తుంది. అలా కాక ఏదయినా అది చిన్నదే కానీ, స్వస్థత చెడి దుఃఖ భాజనమైనప్పుడు ఆ బాధను, దుఃఖాన్ని దేహమంతా అనుభవిస్తుంది. కలక పడింది కంటిలోనే కానీ, ముల్లు విరిగింది కాలిలోనే గానీ, ఆ బాధను దేహమంతా అనుభవించడం తెలిసిందే. కాబట్టి ఏ అవయవం యొక్క సుఖంగానీ, దుఃఖంగానీ దేహమందలి ఒక శక్తి చేత అణువణువుకు సమంగా పంచబడుతుంది. అనుభవానికి గురి చేస్తుంది.

ఒక కుటుంబంలో ఉన్నవారిలో ఏ ఒక్కరి సుఖంగానీ, దుఃఖంగానీ ఆ కుటుంబ సభ్యుల అందరిచేత అప్రయత్నంగానే అనుభవింపబడుతుంది. ఒక శిశువు జన్మించడం, ఒక వరుడుగానీ, ఒక వధువుగానీ వివాహితులు కావడం, ఒకనికి ఉద్యోగం రావడం, ఇటువంటి ఆనందప్రదమైన ఘట్టాలు జరిగినపుడు ఆ సంతోషాన్ని కుటుంబమంతా అనుభవిస్తుంది. అలా కాక ఒకరు వ్యాధిగ్రస్తుడైనా, మరణించినా, అట్టి బాధలను కుటుంబమంతా తమకు తెలియకనే అనుభవిస్తుంది. ప్రకృతిలో ఒక శక్తి కుటుంబంలోని అందరి సుఖాన్ని, దుఃఖాన్ని మొత్తం చేసి సరాసరి లెక్కన ఆ సుఖదుఃఖాలను అందరిచేత అనుభవింపచేస్తుంది.

ఆ అనిర్వచనమైన శక్తి ఒక గ్రామంలోని కుటుంబాల మొత్తం సుఖాన్ని మొత్తం దుఃఖాన్ని ఆ గ్రామంలోని అందరిచేత సమంగా అనుభవించేటట్లు చేస్తుంది.

ఒక దేశంలోని రాష్ట్రాల మొత్తం సుఖం, మొత్తం దుఃఖం ఆ దేశంలోని వారందరిచేత అనుభవింపచేస్తుంది.

ప్రపంచంలోని మొత్తం దేశాల సుఖానుభవాన్ని, దుఃఖానుభవాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరు సరాసరి లెక్కన పంచుకోవడం జరుగుతుంది. అనుభవించడం జరుగుతుంది.

చివరకు విశ్వాంతరాళంలోని మనకు తెలిసిన లేక తెలియని సమస్త చరాచరజీవుల సుఖానుభవం లేక దుఃఖానుభవం ప్రతి జీవిచేత సరాసరి లెక్కన అనుభవింపబడుతున్నది.

అందువల్ల తేలిందేమిటి? నీ సుఖం నీ శాంతి నీ ఒక్కని స్థితిపై ఆధారపడిలేదు. జగత్తు యొక్క మొత్తం దుఃఖంపైనా, అశాంతిపైన ఆధారపడి ఉంది.

Read these stories also :

త్రివిక్రమ్… గాయాలను గెల‌క్కండి!

బీఎస్సార్ :: గద్దరన్న..

ఒక ధనికుడైనా, ఒక దరిద్రుడైనా వారికి అనుభవానికి వచ్చే సుఖము, శాంతి సరాసరి విశ్వం యొక్క సుఖము, శాంతి మాత్రమే. ఇతరుల దృష్టిలో మాత్రమే ధనికులు సుఖులు, నిరుపేదలు దుఃఖితులు. కాని ప్రకృతిలోని ఆ మహాశక్తి సరాసరి పంచి పెట్టినదే ఎవ్వరికైనా, ఏదైనా అనుభవములోకి వచ్చేది. అంతకు మించి వచ్చేది కల్ల.

దేహం స్వస్థత అన్ని అవయవాల స్వస్థతపైనా, కుటుంబ స్వస్థత అందరి కుటుంబ సభ్యుల స్వస్థతపైనా, గ్రామం స్వస్థత అన్ని కుటుంబముల స్వస్థతపైన, రాష్ట్రం స్వస్థత అన్ని గ్రామముల స్వస్థతపైన, ప్రపంచ స్వస్థత అన్ని దేశముల స్వస్థతపైనా, జగత్తు స్వస్థత సకల చరాచరముల స్వస్థతపైనా ఆధారపడి ఉన్నది.

ప్రతిజీవి, ప్రతి ఒక్కరు పరితపించేది సుఖం కొరకు. యోగిగానీ, భోగిగానీ చేసే సకల ప్రయత్నమూ ఆ సుఖము, శాంతికొరకే. అందుకు ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా అనుభవింపగలిగేది విశ్వశాంతి, విశ్వసుఖములోని సరాసరి భాగంగా వచ్చిన శాంతి, సుఖములను మాత్రమే.

“నాకు అన్నీ ఉన్నాయి. కానీ మనశ్శాంతి లేదు.” అన్న సంపన్నుల ఆరాటానికి కారణం ప్రకృతిలోని ఈ సరాసరి లెక్కయే.

‘లోకా సమస్తాన్ సుఖినోభవంతు సమస్త సన్మంగళానిభవంతు’ అన్న ఋషుల వాక్కులలోగానీ, నీవలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న ప్రవక్తుల వాక్కులలోగానీ అంతరార్థమిదే.

నీ కొఱకు, నీ శాంతి కొఱకు, నీ సుఖం కొఱకు నీ క్షేమం కొఱకు నీ అవసరం కాబట్టి విశ్వశాంతి, విశ్వసుఖం, విశ్వక్షేమం కోరమన్నారేగానీ విశ్వం కొఱకు కాదు.

నానా విధములా నీవు పొందాలని ప్రయత్నించే సుఖశాంతులకు ఇదే మార్గము. అన్యథా శరణంనాస్తి( ఇక వేరే గతి లేదు)

” నా సుఖంపైన విశ్వం యొక్క సుఖం ఆధారపడి ఉన్నది. నా శాంతిపైన విశ్వశాంతి ఆధారపడి ఉన్నది.” అన్న భ్రాంతియే నీ దుఃఖానికి, నీ అశాంతికి కారణమౌతున్నది.

‘ఇతరుల, ఇతర జీవుల శాంతిపైన నా శాంతి, ఇతరుల, ఇతర జీవుల క్షేమంపైన నా క్షేమం ఆధారపడి ఉన్నది.’ అన్న సత్యము నీ శాంతికి, నీ సుఖానికి, నీ క్షేమానికి కారణమౌతున్నది.

అందుకు ఏమి చేయాలన్నది నిర్ణయించుకోవాల్సింది నీవే. నీ పరిమితులు. నీ శక్తి సామర్ధ్యాలు, నీ అవకాశాలను బట్టి నీ సుఖశాంతులకు నీవే ప్రయత్నించు. అవసరం నీది. ఏం చేస్తాం?…

-దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.

Facebook Comments