‘బాక్సింగ్ డే’ విజయం మనదే!

188

మెల్ బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు ఆస్టేలియాపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి విజయానికి రెండు వికెట్ల దూరంలో ఆగిపోయిన భారత్, అయిదోరోజు… ఆ లాంఛనం పూర్తి చేయడానికి చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. ఏకంగా 137 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇది భారత్ కు టెస్టుల్లో 150 వ విజయం కావడం విశేషం. దీంతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
వర్షం కారణంగా చివరిరోజు మ్యాచ్ దాదాపు రెండు గంటల ఆలస్యంగా ప్రారంభం అయింది. 63 పరుగులు చేసిన కమ్మిన్స్ భారత్ ను విజయం కోసం ఎదురుచూసేలా చేశాడు. బుమ్రా, కమ్మిన్స్ వికెట్ తీయడంతో ఆసీస్ ఓటమి ఇక లాంఛనంగా మారింది. ఆ తర్వాత కొన్ని బంతులకే ఇషాంత్ లయన్ ను కూడా అవుట్ చేసి.. విజయాన్ని పూర్తి చేశాడు.
భారత్ ఇదే మ్యాజికల్ విజయాన్ని మళ్లీ చివరి టెస్టులోనూ రిపీట్ చేస్తుందో లేదో తెలియదు. కానీ… ఆసీస్ సిరీస్ విషయంలో భారత క్రీడాభిమానులకు టెన్షన్ లేకుండా చేసింది. తొలి టెస్టును నెగ్గిన భారత్… ఆ దూకుడుతో.. ఆసీస్ గడ్డపై అందని ద్రాక్షలా ఊరిస్తున్న సిరీస్ విజయం దక్కించుకుంటుందేమో అనే అభిప్రాయం పలువురికి కలిగింది. అయితే రెండో టెస్టులో చతికిల పడ్డారు. స్కోర్లు సమం కావడంతో పరిస్థితి ఎలా మారుతుందోనని అభిమానులు కంగారు పడ్డారు. చివరి రెండు టెస్టులు కీలకం అయ్యాయి. ఇప్పుడు మూడోటెస్టులో మన విజయంతో టెన్షన్ తొలగిపోయింది. నాలుగోటెస్టు ఫలితం తేడా కొట్టినా.. టెస్టు సిరీస్ డ్రా అవుతుంది. నాలుగోటెస్టు గనుక మనవాళ్లు నెగ్గితే.. ఆసీస్ గడ్డపై కొత్త చరిత్రను లిఖించినట్లు అవుతుంది.

Facebook Comments