‘మా ఊరికి రండి’.. వినతుల వెల్లువ

251

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి.. తెరాస పార్టీలోని ప్రతినాయకుడూ ఇప్పుడు అత్యుత్సాహం కనబరుస్తున్నారు. నామినేటెడ్ పదవులు ఆశించే సామాన్య కార్యకర్తల నుంచీ.. ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్ నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ కేటీఆర్ ప్రాపకం సంపాదించడానికి ఆశపడుతున్నారు. పార్టీకి కేటీఆరే ప్రస్తుతం అన్నీ.. అని నమ్ముతున్న వాళ్లు.. ఆయనను తమ నియోజకవర్గాలకు తీసుకువెళ్లి.. అక్కడి విజయోత్సవ సభలు నిర్వహించడానికి ఉత్సాహపడుతున్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర స్థాయి బాధ్యతలే అయినా.. నియోజకవర్గాల్లో… పట్టు మరింతగా పెరగడానికి కేటీఆర్.. ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఆదివారం కూకట్ పల్లి నియోజకవర్గ విజయోత్సవ సభకు ఆయన హాజరయ్యారు. అయితే ఇలాంటివి ఇక్కడితో ముగిసిపోయే అవకాశం లేదు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో విజయోత్సవ సభకు కేటీఆర్ రావాలని అక్కడి తెరాస ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఇంకా కేబినెట్ కూడా ఏర్పడక పోవడంతో.. సంక్రాంతి తర్వాత కేబినెట్ కూర్పు జరిగేలోగా.. కేటీఆర్ ను ప్రసన్నం చేసుకుంటే బెర్తు దక్కుతుందని ఆశిస్తున్న వారు అనేకులు.

కేవలం మంత్రి పదవి కోసమే కాకపోయినప్పటికీ.. కేటీఆర్ ను తమ నియోజకవర్గాలకు తీసుకువెళ్లి.. అక్కడ భారీ సభలు నిర్వహించడం ద్వారా.. తమ ప్రాభవం ప్రదర్శించుకుంటే.. ఆయన గుడ్ లుక్స్ లో ఉండడం ముందుముందు ఉపయోగపడుతుందని వారు అనుకుంటున్నారు. దీంతో కేటీఆర్ టూర్లకు ఇప్పుడు రాష్ట్రంలో తెరాస ఎమ్మెల్యేలు ఉన్నచోట డిమాండ్ బాగా పెరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Facebook Comments