నోర్లు మూతలు పడుతున్నాయ్!

251

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఇప్పటిదాకా మంత్రి వర్గాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనేలేదు. ఈ ఒక్క అంశాన్ని పురస్కరించుకుని ఎన్నెన్ని రకాల ఊహాత్మక కథనాలు అల్లిక చేయడం సాధ్యం అవుతుందో… అన్నింటినీ.. అల్లేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రకరకాల ఉద్దేశ్యాలను ఆపాదించేశారు. పనిలో పనిగా పార్టీలో ముసలం పుట్టించడానికి నానా ప్రయత్నాలూ చేశారు. బడ్జెట్ సమావేశాల వేళ ముంచుకు వచ్చేస్తోన్న తరుణంలో… ‘చరిత్రలో ఎక్కడా లేని విధంగా’ అంటూ అర్థ సత్యాలను, అసత్యాలను, తమతమ మిడిమిడి జ్ఞానాన్ని ఒలకబోసుకుంటూ అనేక రకనాల కథనాలు వండి వార్చారు. పుకార్లను పుట్టించారు. ఇన్ని జరిగినా కేసీఆర్ పెదవి విప్పలేదు. ఇప్పుడు ఆ లాంఛనానికి కూడా ముహూర్తం ఖరారయ్యాక అందరినోర్లూ మూత పడుతున్నాయి.

డిసెంబరు 11న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 12న ముఖ్యమంత్రిగా కేసీఆర్, మరో మంత్రిగా మహమూద్ ఆలీ ప్రమాణం చేశారు. ఆలీ హోంశాఖ బాధ్యతలను కూడా అందిపుచ్చుకున్నారు. మరో 16 మందికి అమాత్యావకాశం ఉంది. తత్‌క్షణం వారికి ఆ పదవులు దక్కలేదు. ఆశావహులే మధనపడి, ఆ పాటులోంచి పుకార్లను పుట్టించారా… లేదా ఆ వ్యవధానాన్ని ఆధరవుగా చేసుకుని.. ఒక గందరగోళానికి తెరతీయడానికి.. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన స్తంభించి పోయి ఉన్నదంటూ.. సమాజాన్ని భయవిహ్మలుల్ని చేయడానికి అన్నట్లుగా అనేక వదంతులు వ్యాపింపజేశారు. ఇదిగో అదిగో.. ఇవాళే.. రేపే అంటూ… ఆశావహులను ఒత్తిడికి గురిచేయడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి.

కేసీఆర్ ఈ ప్రచారాలను, మాటలను పట్టించుకోలేదు. మధ్యమధ్యలో అవకాశం వచ్చినప్పుడు మీడియా వాళ్లు ఈ మాటెత్తినప్పుడు కూడా.. ‘నీకెందుకు టెన్షన్.. ఆళ్లు కదా పడేది’ అంటూ తేల్చిపారేశాడు. అయితే ఇప్పుడు ఈ మాటలన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది.

నిజానికి మంత్రివర్గ కూర్పు ఆలస్యం కావడానికి కేసీఆర్ వద్ద ఓ హేతుబద్ధమైన కారణం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత.. ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పరంగా 18మందిని మాత్రమే మంత్రులుగా కూర్చుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. నిజానికి ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. దరిమిలా.. ప్రతి మంత్రి మీద భారం ఎక్కువవుతోంది. ఈ అవ్యవస్థను గాడిలో పెట్టాలని కేసీఆర్ అనుకున్నారు.

రాష్ట్రంలో పరిపాలన ప్రజలకు మరింత చేరువగా అందడానికి జిల్లాల సంఖ్యను పెంచడం అవసరం అని ఎలా భావించారో.. అదే తరహాలో.. మంత్రిత్వ శాఖలను కుదించడం, ఏకరూపత ఉన్న విభాగాలను ఒకే మంత్రిత్వ శాఖగా రూపుదిద్దడం ఆయనకు అనివార్యంగా కనిపించాయి. ఇదంతా చిటికె వేస్తే పూర్తయిపోయే కసరత్తు కాదు. అలాగని.. ఎన్నికలకంటె ముందుగా చేయదగిన పని కూడా కాదు. అందుకే ఎన్నికల ఫలితాల్లో.. ప్రజలు తనకు పునరధికారం కట్టబెట్టిన తర్వాత.. కేసీఆర్ సావకాశంగా ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అనేక దఫాలుగా సమీక్షలు, మేధోమధనాలు పూర్తయిన తర్వాత.. ఒక నిర్దిష్ట రూపంతో మంత్రివర్గాన్ని కూర్చడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

ఈ రెండునెలల జాగు సమయంలో… కేసీఆర్ కు ముహూర్తాలు, ఆచారాల పిచ్చి మిక్కిలిగా ఉన్నదని విమర్శించని వారు లేరు. మంత్రి వర్గం కూర్పు ఆలస్యం అవుతున్న కొద్దీ.. ఆయన నమ్మకాలకు, ఈ జాప్యానికి కూడా ముడిపెడుతూ అనేక ప్రచారాలు చేశారు. నిజానికి కేసీఆర్.. ఆధ్యాత్మిక విశ్వాసాలను బలంగా కలిగి ఉంటారు. అలాగని ఆయన వాటిని దాచుకోడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. ‘నా నమ్మకాలు నాకుంటాయి.. మీకేంటి ఇబ్బంది’ అనే తరహాలోనే ఆయన ప్రవర్తిస్తూ వచ్చారు. ఆ మాటకొస్తే.. రాజకీయ నాయకుల్లో ఇలాంటి ముహూర్తాల, జాతకాల విశ్వాసాలు లేనిది ఎందరికి? వేళ్ల మీద కూడా లెక్కించలేం. పరమ నాస్తికులుగా ప్రచారంలో ఉన్న నాయకులు కూడా ముహూర్త బలం చూసుకుని నామినేషన్లు వేసే తార్కాణాలు కొల్లలు.

కేసీఆర్ మంత్రివర్గానికి ఈ ముహూర్త బలం ప్రచారం అమితంగా జరిగింది. జనవరి 15 వరకు శూన్య మాసం గనుక.. అప్పటిదాకా చేయరని… ఆ మధ్యలోనే ఒకటిరెండు శుభతిథులు రాగానే చేసేస్తున్నారని.. సంక్రాంతి తర్వాత.. దాదాపు ప్రతి సుముహూర్తానికి విస్తరణ అయిపోతున్నదని అనేక రకాల ప్రచారాలు సాగాయి. ఇదిగో విదియ, అదిగో పంచమి, కాదు కాదు ఏకాదశి అంటూ రకరకాల కథనాలు వచ్చాయి. తీరా.. అందరి నోర్లకు తాళాలు వేస్తూ అసలైన పౌర్ణమి ముహూర్తం రానే వచ్చింది.

ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ లాంఛనాన్ని పూర్తిచేయబోతున్నారు. మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కసరత్తు సాంతం పూర్తయినట్లుగా అధికార వర్గాలనుంచి సమాచారం తెలుస్తున్నది. ఈ అంశంపై ఇక చర్చోపచర్చలు ఉండకపోవచ్చు. తప్పనిసరిగా పాటించవలసిన కుల, ప్రాంత సమీకరణలను మన్నిస్తూనే… ప్రతిభకు పెద్దపీట వేయాలని.. నవతరానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నది.

ఎవ్వరు ఎన్ని రకాలుగా రభస చేసినప్పటికీ.. మంత్రివర్గం పూర్తిస్థాయిలో లేకపోయినప్పటికీ… ఇన్నాళ్లుగా కూడా తెలంగాణలో పరిపాలన స్తంభించడం అన్నది జరగనేలేదు. ప్రజలకు సంబంధించి ఏ ఒక్క సంక్షేమ పథకమూ ఆగిపోలేదు. ప్రజాజీవనం యావత్తూ యథాతథంగా నడుస్తూనే ఉన్నది. కాకపోతే.. దాన్ని గాభరాపరచడానికి సాగిన కొందరి ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. ఇప్పుడు మరింత పరిపూర్ణమైన మంత్రి వర్గం రూపేణా.. కొందరికి జరగనట్లుగా కనిపించిన పాలన కూడా ఇక సజావుగా జరుగతుతుందని.. ఆశించవచ్చు.

Facebook Comments