డబ్బు సంచులు కొలమానం కానిదెవ్వరికి?

230

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు పొందడానికి కొలమానం ప్రజాసేవ కాదని… కేవలం డబ్బు సంచులు మాత్రమేనని చంద్రబాబునాయుడు ఒక మాట అన్నారు. ఈ మాట నూరుశాతమూ సబబే అయి ఉండవచ్చు. అయితే సామాన్యుడికి కలుగుతున్న సందేహం ఏంటంటే… డబ్బు సంచులు కొలమానం కానిదెవ్వరికి? డబ్బు సంచులు చూడకుండానే… తెలుగుదేశం పార్టీ ఎవ్వరికైనా టికెట్లు ఇస్తున్నదా? ఒక్క తెలుగుదేశాన్ని గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ ను గానీ నిందించడం ఎందుకు? డబ్బు సంచుల గురించి పట్టించుకెోకుండా టికెట్లు ఇచ్చే పార్టీలు వర్తమానంలో ఎన్ని ఉన్నాయి అన్నది పెద్ద ప్రశ్న.
చెప్పుకోడానికి ఒకటిరెండు పార్టీలు కనిపిస్తాయి. ఆపార్టీలు మాత్రం ఎంతమందికి డబ్బుతో నిమిత్తం లేకుండా టికెట్లు ఇస్తున్నాయనేది ప్రశ్న. చంద్రబాబునాయుడు కూడా తన పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో ఎందరు డబ్బులేని ప్రజాసేవకులు ఉన్నారో.. లెక్క చెప్పగల స్థితిలో ఉన్నారా?
వైఎస్సార్ సీపీ కావొచ్చు… మరొక పార్టీ కావొచ్చు.. టికెట్లకు ప్రాతిపదికగా డబ్బు సంచులను ఎంచుకుంటున్నాయని విమర్శించే అర్హత… బహుశా సమకాలీన రాజకీయాల్లో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క పార్టీకి కూడా లేదనే చెప్పాలి.
ఇది వరకు ఒక సంస్కృతి ఉండేది. రిజర్వుడు నియోజకవర్గాల్లో పార్టీలకు డబ్బున్న అభ్యర్థులు దొరికే వారు కాదు. అనివార్యంగా.. డబ్బుతో నిమిత్తం లేకుండా మనుషుల్ని ఎంచుకోవాల్సి వచ్చేది. కానీ.. ఎన్నికల సమరానికి వచ్చేసరికి ఓట్ల కొనుగోలు మాత్రం మామూలే. అలాంటి రిజర్వుడు నియోజకవర్గాలకు ధనవనరులు సమకూర్చే బాధ్యత ఇరుగు పొరుగున ఉన్న ఇతర నియోజకవర్గాల బాధ్యులపై పడేది.
రాజకీయం మొత్తం ఇంతగా ధనమయం అయిపోయి ఉన్నప్పుడు.. తన పార్టీ నుంచి నాయకులు జారిపోతున్న అసహనంలో.. వైకాపా మీద బురద చల్లడానికి ‘డబ్బు’ మాటెత్తడం మినహా మరో అంశం చంద్రబాబునాయుడుకు స్ఫురించకపోతే గనుక.. అది ఆయన వైఫల్యం కింద లెక్క.
వైకాపా డబ్బు సంచులున్న వారివైపు మాత్రమే చూస్తున్నదనే విషయం కొత్తగా చంద్రబాబునాయుడు చెప్పక్కర్లేదు. ఆ పార్టీలోనే ఇటీవలి కాలంలో టికెట్లు నిరాకరించబడిన చాలా మంది నాయకులు ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పుకున్నారు. పార్టీ కూడా ఆ మాటలను ఖండించదలచుకోలేదు. కానీ గత ఎన్నికల సమయానికి పదికోట్లుగా అందరూ పరిగణిస్తుండిన ఎమ్మెల్యే ఖర్చు ఈసారి ఎన్నికలకు 20 కోట్లు అనుకునే వరకు ఎందుకు పెరిగిపోయింది.. అనేది ఆలోచించాల్సిన విషయం.
మరొక విషయం ప్రస్తావించాలి… ఇలాంటి డబ్బు సంచుల ఆరోపణలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల వాదన ఎలా ఉన్నదంటే.. ‘అవును మేం ఖచ్చితంగా డబ్బున్న అభ్యర్థుల కోసం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు అభ్యర్థులందరికీ తానే సరఫరా చేసేంతగా డబ్బు సంపాదించి సంచులు కట్టి పెట్టాడు. మాకు పార్టీ వద్ద మూలుగుతున్న సంచులు లేవు.. అందుకే ఉన్న వాళ్లకోసం చూస్తున్నాం’ అని! ఇలాంటి మాటలు బహిరంగంగా అనగలుగుతున్నందుకు నాయకుల సంగతి తర్వాత.. అలా అనగల పరిస్థితి వచ్చినందుకు ప్రజలు సిగ్గుపడాలి. ఇక చంద్రబాబు ఎలాంటి సమాధానం చెబుతారో మరి!

Facebook Comments