రజనీ పలాయనవాదానికి నిదర్శనం!

170

సూపర్ స్టార్ రజినీకాంత్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. ఈ ఎన్నికలనుంచి పక్కకు తప్పుకున్నానని, కొన్నాళ్లుగా రాజకీయ హడావిడిచేస్తున్న సూపర్ స్టార్ ప్రకటించారు. ఎన్నికలలో ఎవరు కూడా తన ఫోటో గాని పేరు గాని వాడుకోవద్దని కూడా ఆయన ఒక ఫత్వా జారీ చేశారు. సూపర్ స్టార్ గా కొనసాగుతున్న కాలంలోనే రాజకీయాల వైపు దృష్టి సారించి కొంతకాలం పాటు సొంత పార్టీ పేరుతో హడావుడి చేసిన రజనీకాంత్ సరిగ్గా ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసరికి పోటీ నుంచి తప్పుకోవడం అనేది చిత్రంగా కనిపిస్తోంది. రజినీకాంత్ లోని పలాయనవాదానికి, పిరికితనానికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది.

ఎందుకంటే రజనీకాంత్ ఎన్నికల బరిలో నుంచి పక్కకు తప్పుకోవడం అనేది కేవలం ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన నిర్ణయం మాత్రం అనుకోడానికి వీల్లేదు. అది తమిళనాడు జాతి మొత్తానికి సంబంధించిన నిర్ణయం. జాతి మొత్తం కనీసం మొత్తం తమిళనాడు సమాజంలో నిర్దిష్టంగా కొంత శాతం మంది ప్రజలు పెంచుకున్న ఆశలతో ముడిపడిన నిర్ణయం. ఇలాంటి అనేక లక్షల మంది పెంచుకున్న ఆశలపై రజనీ ఒక్కసారిగా నీళ్లు చిలకరించేశారు.

కేవలం సినిమా హీరో గా అయితే ఆ రంగతంలో విజయాలు పరాజయాలు ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన విషయాలే అని సరిపెట్టుకోవచ్చు.  కానీ రాజకీయం అలా కాదు రాజకీయం చేయదలుచుకుంటే… అది సమాజానికి సంబంధించిన వ్యవహారం! సమాజంలో ఆశలు రేకెత్తించిన తర్వాత.. వాటిని నిలబెట్టుకోవడానికి ముందుకు వెళ్లగల ధైర్యం ఉన్నవాడే ఈ రంగం లోకి రావాలి. కానీ రజనీ పార్టీ పేరుతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వెనకడుగు వేశారు.

ఇప్పుడు పలాయన మంత్రం పఠించడం ఒక్కటే రజనీకాంత్ పిరికితనానికి నిదర్శనం అనుకోనవసరం లేదు. ఇదివరకు కూడా అది నిరూపణ అవుతూనే వచ్చింది. పురట్చి తలైవి జయలలితతో సున్నం పెట్టుకున్న తర్వాత రజనీ రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన పుకార్లు చాలానే వచ్చాయి. మరో రకంగా చెప్పాలంటే.. ఆమె బతికి ఉండగా రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఆయనకు ధైర్యం చాలలేదు. మరణించిన తర్వాత రజినీకాంత్ తో పాటు, ఆమెతో విభేదాలు ఉన్న మరో తమిళ హీరో కమల్ హాసన్ కూడా పార్టీని పెట్టడానికి సాహసించారు.

ఈ క్రమంలో రజనీ స్థాపించిన పార్టీ మాత్రం పురిట్లోనే సంధి కొట్టినట్టయింది. మొన్నటిదాకా రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తామని రకరకాల ప్రకటనలు ప్రకటనలతో ప్రజలను ఊరించిన రజనీ ఇప్పుడు సాంతం తేల్చేశారు. రజనీకాంత్ రాజకీయం అనేది ఆయన సినిమాలకు ఒక మార్కెటింగ్ ఎలిమెంట్ గా మాత్రమే మారింది. గతంలోనూ పలుచిత్రాల్లో ఇదిగో వస్తున్నా.. వచ్చేస్తున్నా.. అంటూ ఆయన పంచ్ డైలాగులు వేశారు. తీరా వచ్చిన తర్వాత మాత్రం తుస్సు మనిపించారు.

Facebook Comments