ఆత్మాభిమానం లేనిది మనకు మాత్రమేనా?

204

దక్షిణాది రాష్ట్రాల్లో ఆత్మాభిమానం లేనిది తెలుగు వారికి మాత్రమేనా? మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మనం అవమానాలను సహించుకుంటూ, తుడిచేసుకుని వెళ్లిపోయే తత్వంతో బతుకుతున్నామా? అనే అభిప్రాయం కలుగుతోంది. ‘కంపల్సరీ’గా హిందీ భాషను విద్యార్థులపై రుద్దడం అనే అంశం తెరమీదకు వచ్చినప్పుడు… తెలుగు రాష్ట్రాల నుంచి నామమాత్రంగా కూడా దానిని ఖండించిన వారు లేకపోవడం గమనించాల్సిన విషయం. తెలుగు మినహా అన్ని దక్షిణాది భాషా రాష్ట్రాలనుంచి ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమైంది.

జాతీయ భాషగా హిందీ ని దేశం మొత్తం నేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించడం తప్పు కాదు. అలాగని దానిని ‘కంపల్సరీ’ పేరుతో బలవంతంగా రుద్దదలచుకోవడం మాత్రం తప్పు. అలాంటి ఆలోచన కేంద్రం చేయగానే… తమిళ, మళయాళ, కన్నడ రాష్ట్రాల నుంచి నాయకులు దానిని ఖండించారు. కానీ తెలుగురాష్ట్రాల్లో మాత్రం ఎవ్వరూ చప్పుడు చేయడం లేదు. అందువల్లనే ఆ మాత్రం వీసమెత్తు ఆత్మాభిమానం లేనిది తెలుగు వారికి మాత్రమేనా? అనే అనుమానం- భయం కలుగుతోంది.

తమిళులు హిందీని వ్యతిరేకించడం కొత్తకాదు. డెబ్భయి ఎనభయ్యేళ్లుగా ఈ వివాదం సాగుతూనే ఉంది. ‘హిందీ ఒళిగ- తమిళ్ వాళ్ల’ అనేది వారి నినాదం. తమిళం వర్ధిల్లాలని వారు కోరుకుంటారు. తమిళులకు భాషాభిమానం అమితం. చెట్టూ చేమా రాయీ రప్పా పుట్టకముందే తమిళ భాష పుట్టింది.. మా భాష అంత ప్రాచీనమైనది అని చెప్పుకునే సామెతలు కూడా తమిళ భాషలో ఉన్నాయి.  ఆధునిక తరంలో కూడా పూర్తిగా తమిళ పదాలనే వారు వ్యవహారంలో వాడుతుంటారు. కొత్తగా ఆవిష్కృతమయ్యే వాటికి తమిళ పదాలను తయారు చేసుకుంటూ ఉంటారు. స్వభాషాభిమానం విషయంలో వారిని చూసి మనం అసూయపడాలి.

అసూయ పడితే మంచిదే… అది మనల్ని మనం వృద్ధి చేసుకోవడానికి ఉపకరించినప్పుడు! కానీ ప్రస్తుత వ్యవహారంలో… ‘బలవంతంగా హిందీని రుద్దే’ ప్రయత్నాలను ఖండించకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. త్రిభాషా సిద్ధాంతం అమలు చేయదలచుకున్నప్పుడు… యావద్దేశంలో ఒక దక్షిణాదిభాషను కూడా విధిగా నేర్చుకునేలా నిబంధనలు పెడితే బాగుంటుంది. చివరికి శశిథరూర్ లాంటి ఎంపీ… ‘ఇక్కడ హిందీ నేర్చుకోవాలంటున్నారు. కానీ ఉత్తరాదిలో మాత్రం తమిళ మళయాళాలను ఎవరూ నేర్చుకోరు’ అంటూ… దక్షిణాది రాష్ట్రాలు అంటేనే తమిళులు, మళయాళీలు మాత్రమే అని ఉండే అభిప్రాయాలకు మరింత ఊతమిస్తున్నారు. తెలుగు వారి అభిమానాన్ని కాపాడడానికి నాయకులు స్పందించేది ఎప్పుడు?

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. ఓ కంటితుడుపు ప్రకటన చేసేశారు. తమాషా ఏంటంటే.. ఆ కంటితుడుపు కేవలం తమిళులకు మాత్రమే. కేంద్రం తమిళానికి తగిన ప్రాధాన్యం ఇస్తుం’దని ఆమె అంటున్నారు. అంటే నిరసన వ్యక్తం చేసిన వారి భాషకు మాత్రమే గౌరవం కల్పిస్తారా? మౌనంగా ఉంటే అలాగే తొక్కేస్తారా? అనిపిస్తోంది. తెలుగు నేల కూడా స్పందించాలి. దక్షిణాది రాష్ట్రాలకు హిందీని ‘కంపల్సరీ’ చేసినప్పుడు…. తతిమ్మా యావత్ రాష్ట్రాలకు ‘ఏదో ఒక దక్షిణాది భాష’ ఆప్షనల్ గా ఉండేందుకు పోరాడాలి. తమిళనేల పుట్టినల్లు, తెలుగు నేల మెట్టినిల్లు అయిన నిర్మలా సీతారామన్ ప్రకటించినట్లుగా- కేవలం తమిళానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం కాదు. నాలుగు దక్షిణాది భాషలకు సమాన ప్రాధాన్యం ఇచ్చేలా ప్రయత్నించాలి.

Facebook Comments