రాహుల్ ఎవరిని బెదిరించదలచుకున్నారు?

139

ఓడిపోయిన తర్వాత… తాను పార్టీ సారథ్యానికి రాజీనామా చేసేస్తా అని రాహుల్ నిర్ణయం తీసుకోవడమూ… తతిమ్మా పార్టీ సీనియర్లు అందరూ.. బాబ్బాబూ అలా చేయొద్దు… నీవు తప్ప మాకు దిక్కులేదు… నువ్వు అధ్యక్షుడిగా ఉండాల్సిందే అంటూ బతిమాలడమూ ఈ వ్యవహారం అంతా పెద్ద కామెడీ ఎపిసోడ్ లాగా కనిపిస్తోంది. రాహుల్ కంటితుడుపుకోసం నాయకులు అలా మాట్లాడుతున్నారో.. లేదా, నూటయాభయ్యేళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే ఒక పార్టీ నిజంగానే… ఒక కుటుంబం తప్ప తమకు దిక్కులేదని భావిస్తున్నదో అర్థం కావడం లేదు.

ఇక్కడ కీలకంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటేనే ముసలివాళ్ల సమూహంలాగా మారిపోయింది. దాదాపుగా అందరూ శక్తి ఉడిగిపోయిన వారే అక్కడ మిగిలి ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులనే ముద్రతో.. శేష జీవితాన్ని వెళ్లదీయడమే తప్ప… చురుగ్గా కదిలే ఓపిక ఏ ఒక్కరికీ లేదు. అలాగని రాజకీయాలనుంచి తప్పుకుని.. కొత్త రక్తానికి చోటిచ్చేంత సహృదయత కూడా వారికి ఉన్నట్లు లేదు. అలాంటి వాళ్లు మాత్రమే.. రాహులే ఉండాలని కోరుకుంటున్నారు.

ఆయన నాయకత్వంలో తమ సీనియారిటీకి ఇబ్బంది లేని ఒక నిశ్చింత ఉంటుందనేది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ మీద మక్కువ ఉన్న యువ నాయకుల్ని రాహుల్ లేదా సోనియా ఎంచుకుంటే… వారు రాహుల్ కంటె బాగా సమర్థంగా పార్టీని నడపడానికి ఉద్యుక్తులు కావొచ్చు. కానీ.. అలాంటి పరిణామం చెట్టుపేరు చెప్పుకుంటూ కాయలమ్ముకుని బతికే చాలా మంది సీనియర్లకు రుచించకపోయినట్టే… పార్టీపై పట్టు తమ కుటుంబం గట్టు దాటిపోతుందని సోనియా కుటుంబానికి కూడా రుచించకపోవచ్చు.

అయినా పార్టీ ఇంత ఘోరంగా దెబ్బతిన్న తర్వాత.. ఇంకా రాహుల్ బెదిరిస్తే భయపడేవాళ్లెవరూ ఉండరు. రాజీనామా లాంటి కామెడీ బెదిరింపులు మానేసి… కొత్త రక్తాన్ని ముందు వరసలోకి తెస్తూ… పార్టీకి తిరిగి జవసత్వాలు కూర్చుకోవడం ఎలాగో రాహుల్ ఆలోచించాలి.

Facebook Comments