నింపాదిగా ఆడుతూ విజయతీరాలకు

48

మన జట్టు గనుక… నెమ్మదిగా సాగిన ఆటను కూడా పాజిటివ్ గానే తీసుకోవాలని మనకు అనిపిస్తుంది. ఆ రకంగా చూసినప్పుడు… ప్రపంచకప్ తొలి మ్యాచ్ లో భారత్ చాలా నింపాదిగా ఆడుతూ శుభారంభం చేసింది. ఎక్కడా దూకుడుగా ఆడకుండా.. అనవసరపు షాట్ల జోలికి పోకుండా.. చూస్తున్న వాళ్లలో ఒత్తిడి పెంచకుండా.. అలాగని మరీ ఆట మందగించకుండా… రిక్వైర్డ్ రన్ రేట్ భారీగా పెరిగిపోకుండా జాగ్రత్తగా ఆడుతూ… ఒక స్కెచ్ ప్రకారం భారత్ విజయం సాధించిందని అనుకోవాలి.

ఖచ్చితంగా గెలిచి తీరాలి… మంచి కూర్పుతో జట్టు ఉంది.. అనే ఆలోచనలతో ప్రపంచకప్ బరిలో దిగిన భారత్ కు మొదటి మ్యాచ్ కాన్ఫిడెన్స్ ను ఇచ్చింది. దక్షిణాఫ్రికా అంత తేలికపాటి జట్టు కాదు గానీ… ఈ సిరీస్ లో ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయి పేలవంగా కనిపిస్తున్న జట్టుతో భారత్ కు ఇబ్బంది ఎదురవుతుందని ఎవరూ అనుకోలేదు. దానికి తగినట్లుగానే భారత బౌలర్లు 227 పరుగులకే కట్టడి చేసేశారు.

భారత్ బ్యాటింగ్ ఆచిచూసి ఆడే ధోరణిలోనే సాగింది. ఆరంభంలోనే శిఖర్ ధవన్ అవుటైపోయినా… ఆ తర్వాత కొన్ని పరుగులకే కెప్టెన్ కోహ్లి కూడా పెవిలియన్ చేరినా… భారత అభిమానుల్లో ఆశలు సన్నగిల్లే పరిస్థితి ఎక్కడా రాలేదు. రోహిత్ శర్మ చివరిదాకా నాటౌట్ గా ఉండి సుదీర్ఘమైన ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించి… మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. అసలు ఆడుతున్నట్టే కనిపించకుండా.. అలాగని అనువుగా వచ్చిన ప్రతి బంతినీ బౌండరీ గా మలచుతూ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. వన్డే కెరీర్ లో అతినికిది 23వ సెంచరీ.

మొత్తానికి ఇది శుభారంభం. ఇదే ఊపుతో భారత్ ముందు ముందు మ్యాచ్ లలో కూడా మంచి విజయాలను నమోదు చేస్తుందని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

Facebook Comments