ఆత్మవిశ్వాసం పెంచిన విజయం!

52

భారత జట్టు ఖచ్చితంగా ఐసీసీ వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. ప్రత్యర్థి దేశాల నిపుణులు కూడా… భారత్ ను తేలికపాటి జట్టుగా పరిగణించడం లేదు. అయినా కూడా మనలో ఏదో కొద్దిగా సంకోచం, ఒత్తిడి. ప్రత్యేకించి కొన్ని దేశాలతో మ్యాచ్ అంటే.. అభిమానుల్లో కాస్త బెరుకు. అలాంటి సంకోచాలు భయాలు అన్నింటినీ పటాపంచలు చేసేస్తూ భారత్.. ఆదివారం నాడు ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది. వరల్డ్ కప్ గెలిచే దిశగా సాగనున్న ప్రస్థానంలో భారత జట్టులో అపరిమితమైన ఆత్మవిశ్వాసం నింపే మ్యాచ్ ఇది.

మొదటి మ్యాచ్ ను దక్షిణాఫ్రికాతో గెలుచుకోవడం సంతోషమే గానీ…  అందులో మరీ అంత పెద్ద మజా ఏమీ లేదు. అప్పటికే రెండు మ్యాచ్ లు ఓడి ఉన్న దక్షిణాఫ్రికాకు, మనం హ్యాట్రిక్ ఓటమిని ప్రసాదించాం అంతే. అయితే భారత్ కు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్ ను అంత తేలిగ్గా తీసుకోలేం. అసలే.. ఇటీవలే ఆస్ట్రేలియాతో స్వదేశీ పిచ్ లపై మనం వన్డే సిరీస్ ను దారుణంగా ఓడిపోయి ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లో తలపడేప్పుడు.. కాస్త ఒత్తిడికి లోను కావడం సహజం.

ఇన్నింగ్స్ ను ఛేదించవలసి వస్తే.. ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుందని అనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. సారథి కోహ్లి టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం ఫలితం మ్యాచ్ లో చాలా స్పష్టంగా కనిపించింది. ఐసీసీ మ్యాచ్ లకు స్పెషల్ ఫేవరెట్ అయిన శిఖర్ ధవన్ సరిగ్గా ఎప్పుడు ఫామ్ లోకి రావాలో.. అప్పుడే వచ్చాడు. తొలి మ్యాచ్ లో రోహిత్ సెంచరీ చేస్తే… ప్రపంచానికి ప్రమాదకర జట్టుగా కనిపించే ఆస్ట్రేలియా తో మ్యాచ్ లో ధవన్ అద్భుతమైన సెంచరీ చేశాడు. కోహ్లి 82 పరుగుల దాకా వచ్చిన తన ఇన్నింగ్స్ లో సెంచరీ కోసం చూసుకోకుండా.. దూకుడుగా ఆడుతున్న తన పార్టనర్ లకు మద్దతుగానే నిలవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.

ఇలాంటి సమష్టి పోరాటం అనేది జట్టుకు లాభించింది. ఆదినుంచి స్కోరు పరుగులు పెడుతూ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 352 పరుగులకు చేరుకుంది. ఎంతటి స్కోరునైనా తాము ఛేదించేయగలం అనే పొగరుతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆ పొగరు ఎంతో సేపు నిలవలేదు. ప్రారంభం నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్ తో స్కోరు పెరగకుండా నియంత్రించారు. క్రమంతప్పకుండా వికెట్లు పడుతూ వచ్చాయి. చిట్టచివరి బంతికి చిట్టచివరి వికెట్ ను తీయడంతో.. 317 పరుగుల వద్ద వారి పరాజయపర్వం సంపూర్ణమైంది.

భారత్ ఆసీస్ మీద ఆషామాషీగా ఏమీ గెలవలేదు. ఈ విజయం, మనవాళ్లు ప్రదర్శించిన పాటవం అన్నీ బరిలో ఉన్న తతిమ్మా దేశాలకు హెచ్చరికలు పంపేవే. ప్రత్యేకించి… తర్వాతి మ్యాచ్ లలో బలమైన న్యూజిలాండ్ ను, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో భారత్ జట్టుకు అనల్పమైన ఆత్మవిశ్వాసాన్ని అందించేవి. ఆ వరుస మ్యాచ్ లలో కూడా భారత్ విజయాలను నమోదు చేసి… జగజ్జేతలం కాబోయేది మేమే అనే సంకేతాలను మనవాళ్లు పంపాలని ఆశిద్దాం.

Facebook Comments