తెదేపా పతనం.. తమ్మినేని చేతుల్లో

45

తెలుగు రాజకీయ విశ్లేషకులు చాన్నాళ్ల కిందట ‘ఆగస్టు సంక్షోభం’ అనే ఒక పదాన్ని సృష్టించారు. చాలా సందర్భాల్లో ఆ పదం తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఈ ఏడాది, అదే తెలుగుదేశానికి సంబంధించి…  మరో కొత్త పదసృష్టి అవసరమయ్యేలా ఉంది. అదే ‘జూన్ సంక్షోభం’! అయితే ఈ కొత్త సంక్షోభం మరింత ఉధృతంగా తెలుగుదేశాన్ని కుదిపేసే ప్రమాదం కనిపిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో అనేకానేక పరిణామాలు చురుగ్గా చోటుచేసుకో నున్నాయి. అయితే.. తమాషా ఏంటంటే… తెలుగుదేశం పార్టీ ఇప్పటికిప్పుడు పూర్తిగా పతనం కానున్నదా? సర్వభ్రష్టత్వం చెందనున్నదా? అనే విషయం… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుతం శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం చేతుల్లో ఉంది. అవును ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

రాజ్యసభలో తెదేపాకు ఉన్న ఆరుగురు సభ్యుల్లో ఫ్లోర్ లీడర్ సహా మూడింట రెండొంతుల మంది (అంటే నలుగురు) తీర్మానం చేసి.. పార్టీని భాజపాలో కలిపేశారు. ఆంధ్రప్రదేశ్ లో సమీప భవిష్యత్తులో రెండో ప్రత్యామ్నాయం కాగల పార్టీగా బలపడాలని చూస్తున్న కమలదళానికి ఇది శుభ సంకేతం. తెదేపా నుంచి ఫిరాయించిన సదరు నాయకులు… కేవలం ఎంపీలు మాత్రమే కాదు. పార్టీని రాష్ట్రంలో ‘బలంగా’ తీర్చిదిద్దడానికి అవసరమైన ఆర్థిక దన్నుగా కూడా నిలవగలవారు. అయితే భాజపా వీరి చేరికతో సంతృప్తి పడుతుందని అనుకోవడం భ్రమ. రాష్ట్రంలోని అనేక మంది తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు అంతా… కమలంవైపు కన్ను గీటుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు కమలతీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. 15 మంది మారితే అది ‘ఫిరాయింపు’ అవుతుంది. 16 మంది మారితే అది ‘విలీనం’ అవుతుంది! ఏది జరిగినా సరే.. దానికి స్పీకరు తమ్మినేని సీతారాం ఆమోద ముద్ర తప్పనిసరి!

ససేమిరా అంటున్న తమ్మినేని…

ఇప్పటికే తెలుగుదేశం నుంచి మూకుమ్మడి ఫిరాయింపులకు సూత్రధారి పాత్ర నిర్వర్తిస్తున్న నాయకులు తమ్మినేనిని కలిసి… తమ ఫిరాయింపు నిర్ణయం గురించి తెలియజేసినట్లుగా అమరావతి వర్గాల సమాచారం. అయితే ఎవరు, ఏ పార్టీలోకి ఫిరాయించినా సరే.. అనర్హత వేటు వేస్తానని తమ్మినేని హెచ్చరించినట్లుగా సమాచారం.

తెదేపాలోని సుమారు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి తనతో టచ్ లో ఉన్నారని, సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్, శాసనసభలోనే ప్రకటించారు. వారి పేర్లు కూడా చెప్పమంటారా? అంటూ సవాలు విసిరారు. అయితే గతంలో అనుచిత ఫిరాయింపుల దెబ్బకు గురైన, ఆక్రోశాన్ని వ్యక్తం చేసినా వైకాపా, ఈ దఫా అలాంటి చెడు సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశంతో లేదు. పైగా వారికి అవసరం కూడా లేదు. నా పార్టీలోకి ఎవరు రాదలచుకున్నా.. ముందు రాజీనామా చేసి వస్తే.. తర్వాత ఆలోచిస్తానని జగన్ పలుమార్లు వెల్లడించారు. అందుకు బహుశా.. తెలుగుదేశాన్ని వీడదలచుకుంటున్న వారిలో ఎవ్వరూ సంసిద్ధంగా లేరు!

అందుకే వారంతా కమలదళం వైపు కదులుతున్నారు. భాజపాకు ఎవ్వరొచ్చినా… ఓకే! రాష్ట్రంలో పార్టీ బలపడితే అంతే చాలు. గెలిచిన ఎమ్మెల్యేలు వస్తే ఇంకా హాయి. 15 మంది సిద్ధంగా ఉన్నప్పటికీ- భాజపాలో చేరినా సరే అనర్హత వేటు వేస్తానని తమ్మినేని చెప్పారట. ఫిరాయింపులను ప్రోత్సహించరాదని జగన్ స్పష్టంగా సూచించినట్లు ఆయన పేర్కొన్నారని సమాచారం. దీనికి తెదేపా నాయకులకు ఒక ప్రత్యమ్నాయ మార్గం ఉంది. మూడింట రెండొంతులు అంటే కనీసం 16 మంది తీర్మానించి.. పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించవచ్చు. అయితే భాజపాకు ప్రస్తుతం ఒక్క సభ్యుడు కూడా లేని నేపథ్యంలో… ఇలాంటి వక్రమార్గం కూడా స్పీకరు విచక్షణకు లోబడి ఉంటుంది. అప్పుడు తమ్మినేని నిక్కచ్చిగా స్పందించినా.. వారంతా అనర్హులు అవుతారు!

నైతికతా? ముందుజాగ్రత్తా?

ఫిరాయింపుదార్లను తమ్మినేని స్పష్టంగా హెచ్చరించిన మాట నిజమే! కానీ అదంతా నైతిక విలువలను పాటించడమేనా? లేదా ముందుజాగ్రత్త చర్యలా? అనే మీమాంస రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పైకి వారు నైతికవిలువలను ప్రవచిస్తున్నారు. కానీ లోలోన తమ పార్టీకి ముప్పు రాకుండా జాగ్రత్త పడుతున్నారని అనిపిస్తోంది. 23 సీట్ల తెదేపా 16 భాజపా, 7 తెదేపా.. అనే రెండు ముక్కలుగా మారితే… భారతీయ జనతా పార్టీనే శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇక్కడ ప్రతిపక్షంగా వైకాపాను ఓ ఆటాడునుకునే ప్రమాదం ఉంటుంది. ఈలోగా.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులందరికీ కమలదళం వల విసురుతున్న నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల నాటికి.. పాలకపక్షానికి, తెదేపా కంటె బలమైన ప్రత్యర్థిగా భాజపా ఎదురుపడినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే వైకాపా చెమటోడ్చాల్సి వస్తుంది. తెదేపా వారి ఫిరాయింపుల ద్వారా భాజపా బలపడేందుకు తామే సహకరిస్తే.. కొరివితో తలగోక్కున్నట్లు అవుతుందనే భావనలో వైకాపా ఉంది. అందుకే తమ్మినేని మొండిగా కాదంటున్నారు!

మరో ప్రత్యామ్నాయమూ ఉంది

తెదేపా నుంచి 16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసి, (భాజపాలో చేరకుండా) తమను చీలిక వర్గంగా గుర్తించాలని అడగవచ్చు. అప్పుడు ఫిరాయింపు చట్టం వారికి వర్తించకపోవచ్చు. అలా వారు విడిగా ఉంటూ.. బయట భాజపా అనుబంధంతో ఆ పార్టీ నాయకులుగా చెలామణీ కావొచ్చు. చీలిక వర్గం గుర్తింపు వచ్చిన తర్వాత… వారు కాషాయ కండువాలు కప్పుకుని తిరిగినా… పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటూ తెదేపా ఫిర్యాదు చేయడానికి వీలుండదు.

ఒక్క ఓటమితో అంతా అయిపోయిందా…

రాజకీయాల్లో గెలుపోటములు సహజం! ఇవాళ ఓడిన పార్టీ మళ్లీ రేపు గెలవవచ్చు. కానీ తెదేపా ఇప్పుడు ఓడిపోగానే.. అందరూ ఆ పార్టీని వీడి పారిపోవాలని చూస్తున్నారెందుకు? భవిష్యత్తు మీద వారిలో ఆశ మిగలడం లేదెందుకు? అనే ప్రశ్న సహజం! అయితే చంద్రబాబునాయుడు పుత్ర ప్రేమే ఈ పతనావస్థకు కారణం అని తెలుస్తోంది. ప్రస్తుతం 69 ఏళ్ల వయసున్న చంద్రబాబు, ‘తన తర్వాత తన కొడుకు లోకేష్ పార్టీకి దిక్కు’ అనే సంకేతాలిస్తూ పార్టీని నడిపారు. లోకేష్ తన వంతుగా తన బలహీనతల్ని, మూర్ఖత్వాల్ని బహిరంగంగా చాటుకుంటూ పార్టీ నాయకుల్లో భయం పుట్టించాడు. ఆ రకంగా ‘చంద్రబాబు తర్వాత ఎవరు?’ అనే ప్రశ్నకు ఆ పార్టీలో జవాబు లేకుండాపోయింది! అక్కడ శూన్యత ఉంది. ఆ శూన్యత అందరినీ భయపెడుతోంది. పార్టీ ఇప్పుడు ఓడిపోయినందుకు కాదు గానీ.. ఆ శూన్యత గురించిన భయంతో.. భవిష్యత్తు భయవిహ్వలంగా గోచరించి… ప్రతి ఒక్కరూ పారిపోయే మార్గాలు వెతుక్కుంటున్నారని అనిపిస్తోంది.

Facebook Comments