వార్థక్యం పడగనీడలో…టీడీపీ 

68

‘‘శ్రీ’’పలుకు

తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌ ఏమిటి..!? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం, ఆ పార్టీ ఎదుర్కొంటున్న సవాల్‌ ఇది. అదేమిటి…! దాదాపు 40ఏళ్ల చరిత్ర గల పార్టీ… అందులో 24ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ… రెండు విడతల్లో 15ఏళ్లు ప్రతిపక్షంలో ఉండీ ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డ పార్టీ… సుదీర్ఘ అనుభవజ్ఞుడు చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ… రాజధాని నుంచి గ్రామస్థాయివరకు నేతలు, కార్యకర్తలతో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న పార్టీ… అంతటి టీడీపీ భవిష్యత్‌పై సందేహాలేమిన్నదే కదా మీ సందేహం. నిజమే… టీడీపీకి తిరుగులేనిరీతిలో  కార్యకర్తల బలం, వ్యవస్థాగత సామర్థ్యం, ఆర్థిక వనరులు ఉన్నాయన్నది వాస్తవం. కానీ వాటిన్నింటికంటే కాలం కఠినమైనది. టీడీపీ ప్రస్తుతం ఈ కాల పరీక్షను ఎదుర్కొంటోంది. ఎన్నో సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డ మర్రిమాను వంటి అధినేత చంద్రబాబుకు వార్థక్యం కమ్ముకుంటోందన్నది కాదనలేని వాస్తవం. ఇక తన వారసుడిగా చంద్రబాబు తీర్చిదిద్దాలనుకున్న చినబాబు లోకేశ్‌.. అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడన్నది కూడా అంతకుమించిన చేదు నిజం.  ప్రస్తుతం టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఆందోళనకలిగిస్తున్న అంశం అదే. టీడీపీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుంటోందీ అందుకే.

గతంలో సంక్షోభాలను ఎదురొడ్డిన టీడీపీ 
‘టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదు… గతంలో ఎన్నో సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డాం’ అని ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్నారు.  కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో ఉన్న వ్యత్యాసం ఏమిటంటే అధినేత వయసే. 1982లో ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది.  ఏడాదిన్నరకే తొలి సంక్షోభాన్ని ఎదుర్కొంది.   ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కరరావు సీఎం అయ్యారు. అశేష ప్రజాదారణ ఉన్న ఎన్టీఆర్‌ నేరుగా ప్రజల్లోకి వెళ్లిపోయి ఆ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొని మళ్లీ సీఎం అయ్యారు. 1989లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. రెండు చోట్ల పోటీ చేసిన ఎన్టీఆర్‌ స్వయానా ఓ స్థానంలో ఓడిపోయారు. అనంతరం ఆరుగురు టీడీపీ ఎంపీలు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంక్షోభాన్ని తట్టుకుని  ఎన్టీఆర్‌ నేలకు కొట్టిన బంతిలా పైకి లేచారు. 1994లో రాష్ట్రంలో రికార్డు మెజార్టీతో పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఏడాదిలోనే మరో సంక్షోభం.  చంద్రబాబు ఎన్టీఆర్‌ను కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. పార్టీ రెండుగా చీలిపోయింది. కాగా 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఎన్టీఆర్‌ దివంగతులు కావడం చంద్రబాబుకు కలసివచ్చింది. దాంతో లోక్‌సభ ఎన్నికల అనంతరం అనివార్యంగా టీడీపీలోని రెండువర్గాలు మళ్లీ ఒక్కటవడంతో చంద్రబాబుకు ఎదురులేకపోయింది.
2004లో ఓటమి తరువాత టీడీపీ మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొంది.  చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుతో అప్పటి ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా దెబ్బతింది. పార్టీలో సీనియర్‌ నేతలు పలువురు పీఆర్పీలో చేరారు. పార్టీని గెలిపించేందుకు చంద్రబాబు ‘మీ కోసం’ పేరిట రాష్ట్రంలో  బస్సు యాత్ర చేసినా ఫలితం దక్కలేదు.  వైఎస్‌ అనుకూల ఓటుతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికతో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకుంది. వరుసగా రెండోసారి కూడా ఓటమిపాలైన టీడీపీ మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమాన్ని ఎలా డీల్‌ చేయాలన్నది చంద్రబాబుకు కత్తిమీద సాముగా మారింది. మరోవైపు వైఎస్సార్‌ హఠాన్మరణానంతం పరిణామాల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాదయాత్ర చేశారు. 60ఏళ్లు పైబడ్డ వయసులో ఆయన పాదయాత్ర సాహసోపేతమే. రాష్ట్ర విభజన జరగడంతో చంద్రబాబు తన అనుభవాన్ని అంతా రంగరించి  రాజకీయ వ్యూహాలు అమలు చేశారు. నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని గుర్తించి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, జనసేన పార్టీ పోటీ చేయకుండా పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఇచ్చేలా చూడటం, టీడీపీని వీడినవారితోపాటు కాంగ్రెస్‌ నేతలను పెద్దసంఖ్యలో పార్టీలోచేర్చుకోవడం  టీడీపీకి కలసివచ్చింది. ఫోకస్ మొత్తం ఏపీ మీదనే ఉన్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీ పతనమైనా.. పదేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ లో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

ఇది పెను సంక్షోభం
ఇటీవల ఎన్నికల్లో ఘోరపరాజయంతో టీడీపీ మరోసారి సంక్షోభంలోకి కూరుకుపోయింది. గతంలో పార్టీ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులకు ప్రస్తుత సంక్షోభానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ దాదాపుగా తుడుచుకుపెట్టుకుపోయింది. 175 నియోజకవర్గాల్లో కేవలం 23 స్థానాల్లోనే గెలిచింది. పార్టీకి కంచుకోటలైన నియోజకవర్గాల్లో కూడా పరాజయం పాలైంది. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోడానికి వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలరోజుల్లోనే నలుగురు రాజ్యసభ్యులు బీజేపీలో చేరడమన్నది  తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఇక 23మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది పార్టీలో కొనసాగుతారన్నది సందేహాస్పదమే. ఇప్పటికే ఓ మాజీ మంత్రి నేతృత్వంలో 12మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నది ఢిల్లీ వర్గాల సమాచారం. మరోవైపు పార్టీలో కాపు సామాజిక వర్గ నేతలు ప్రత్యేకంగా సమావేశమవడం కలకలం రేపుతోంది. అందుకే
గత అనుభావాలకు భిన్నంగా పెను సంక్షోభం టీడీపీని కుదిపేస్తోంది. ఎన్నికల్లో ఓటమి చెందిన  నెలరోజుల్లోనే టీడీపీ ఎందుకు అంత బేలగా మారింది?… ఎన్నికల ముందు వరకు ఎంతో బలీయంగా కనిపించిన పార్టీ ఒక్కసారిగా ఇంతగా ఎందుకు  బలహీనమైందన్నది ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే…

చంద్రబాబును కమ్ముకుంటున్న వార్థక్యం

చంద్రబాబు వార్థక్యమే టీడీపీకి ప్రధాన ప్రతికూలాంశం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొడ్డగల చంద్రబాబు సమర్థత, సమయానుకూలంగా రాజకీయ వ్యూహ రచన నైపుణ్యం మీద ఎవరికీ సందేహాలు లేవు. కానీ ఆయన వయసు ఇప్పుడు దాదాపు 70ఏళ్లు. 1983 నుంచి రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ప్రతిపక్ష నేత జనంలోకి దూసుకుపోయినప్పుడే విజయం దక్కింది. 1983లో చైతన్యరథంపై ఎన్టీఆర్‌ రాష్ట్ర పర్యటన… 2002లో వైఎస్సార్‌ పాదయాత్ర… 2013లో చంద్రబాబు పాదయాత్ర… తాజాగా 14నెలలపాటు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర అదే వాదనను బలపరుస్తున్నాయి. వాటితోపాటు వివిధ అంశాలపై ధర్నాలు, ఆందోళనలు, రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో పార్టీ శ్రేణులను ఉరకలెత్తించాలి.  మరి 2024లో టీడీపీ అధికారంలోకి రావాలంటే చంద్రబాబు ఆస్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకుపోగలరా? ఇప్పటికే ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారన్నది విశ్వసనీయ సమాచారం. అధికారంలో ఉండటంతో అవి బయటపడకుండా మేనేజ్‌ చేయగలిగారు.  కానీ ప్రతిపక్ష నేతకు అలా కుదరదు. రాష్ట్రంలో తరచూ పర్యటిస్తూ ఉండాలి. వివిధ అంశాలపై ప్రజల్లోకి చొచ్చుకుపోగలగాలి. దూకుడుగా ఉండాలి.  పదునైన ప్రసంగాలతో ప్రజలను ఉద్వేగానికి గురిచేయాలి… ఆలోపించజేయగలగాలి. చంద్రబాబు స్వాభావికంగానే మంచి వక్త కాదు. మరి 70ఏళ్లపైబడ్డ వయసులో ఆయన అవన్నీ చేయగలరా? కేవలం అమరావతిలో పార్టీ ప్రధాన కార్యాలయానికి పరిమితమై కార్యక్రమాలు నిర్వహిస్తే… వీడియో కాన్ఫరెన్సులు, టెలీ కాన్ఫరెన్సులతో సమయం నెట్టుకొస్తే… ప్రెస్‌మీట్లు, సోషల్‌ మీడియాలో పోస్టులతో కాలం వెళ్లదీస్తే సరిపోదు. 2004–09 మధ్య టీడీపీని కాపాడుకోగలిగారు. కానీ అధికారంలోకి తేలేకపోయారన్నది గుర్తుంచుకోవాలి. ఇక 2024 ఎన్నికలనాటికి ఆయనకు 75ఏళ్లు వస్తాయి. మరోవైపు సీఎం వైఎస్‌ జగన్‌కు 50ఏళ్లు వస్తాయి. 75ఏళ్ల సీఎం కావాలా… 50ఏళ్ల సీఎం కావాలా అనే చర్చ తెరపైకి వస్తుంది. అది టీడీపీకి ప్రతికూలాంశమే. దేశ చరిత్ర చూసినా సరే 75ఏళ్లు తరువాత సీఎంలు అయినవారు చాలా తక్కువమందే ఉన్నారు.

లోకేశ్‌ సమర్థతపై సందేహాలు
ఏ ప్రాంతీయ పార్టీకి అయినా సరైన సమయంలో సరైన వారసుడు రంగ ప్రవేశం చేయాలి. సహజంగానే ఆ వారసుడు కుటుంబసభ్యుడే అవుతారు. లేకపోతే పార్టీ ఉనికే ప్రమాదం. యూపీలో ములాయం సింగ్‌ యాదవ్‌ తనయుడు అఖిలేష్, తమిళనాడులో కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ సరైన సమయంలో తమను తాము నిరూపించుకుని పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. జయలలిత అనంతరం ఏఐఏడీఎంకేకు ఆ స్థాయి వారసుడు లేకపోవడంతోనే అధికారంలో ఉన్నప్పటికీ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.  మరి టీడీపీకి సమర్థుడైన వారసుడు దొరికాడా అంటే… అవును అని చెప్పలేని గడ్డు పరిస్థితి ఉంది. ‘చంద్రబాబుకు వయసుపైబడితేనేం మా భావి నాయకుడు చినబాబు లోకేశ్‌ ఉన్నారు కదా’అని టీడీపీ నేతలు ధీమాగా చెప్పలేకపోతున్నారు.
2009 తరువాత ఐదేళ్లపాటు పరోక్షంగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న లోకేశ్‌ గత ఐదేళ్లలో ప్రత్యక్షంగా తెరపైకి వచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలు చూశారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రిగా చేశారు. కానీ అటు పార్టీ నేతగా ఇటు మంత్రిగా ఆయన తన సమర్థతను నిరూపించుకోలేకపోయారు.  అసలు లోకేశ్‌ను మంత్రిగా చేయడం ఆయనకు ఏమాత్రం ఇష్టంలేదు. మంత్రిని చేస్తే అంచనాలు పెరుగుతాయని … నిరూపించుకోలేకపోతే అసలుకే ముప్పొస్తుందని చంద్రబాబు ఊహించారు. అందుకే ఏడాదిపాటు ఆయన్ని మంత్రిని చేయకుండా పార్టీ వ్యవహారాలకే పరిమితం చేశారు.  కానీ భార్య భువనేశ్వరి, లోకేశ్‌ అందుకు ఏమాత్రం సమ్మతించ లేదు. ‘తెలంగాణలో సీఎం కేసీఆర్‌ తన కుమారుడు కేటీఆర్‌ను మంత్రిని చేశారు. మీరు మాత్రం ఎందుకు అలా చేయరు’అని ఆయన్ని కుటుంబసభ్యులు దాదాపుగా నిలదీశారు. ‘ఇప్పుడు మంత్రిని చేస్తేనే భావి సీఎంగా గుర్తింపు దక్కుతుంది’అని ఒత్తిడి చేశారు. దాంతో చంద్రబాబు లోకేశ్‌ను మంత్రిని చేశారు. పోనీ ఆయన్ని ఎమ్మెల్యేగా పోటీచేయించి ప్రజా నాయకుడు అన్న ఇమేజ్‌తో వచ్చేలా చేశారా అంటే అదీ లేదు. భావి సీఎం అని చెబుతున్న నేత ఎమ్మెల్సీగా తొలిసారి చట్టసభలోకి ప్రవేశించడం ప్రజలను మెప్పించలేకపోయింది. అనంతరం కూడా లోకేశ్‌ సమర్థుడేనని చాటడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆయన ప్రసంగాల కోసం భారీ జీతం ఇచ్చి పెద్ది రామారావు అనే శిక్షకుడిని నియమించారు. ఆయన తరుపున సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కోచ్ ఎంత గొప్పవాడైనా గ్రౌండ్‌లో దిగి బ్యాటింగ్‌  చేయాల్సింది బ్యాట్స్‌ మన్‌ అన్నది చంద్రబాబు మరచిపోయారు. అందుకే ప్రజాక్షేత్రంలో లోకేశ్‌ పూర్తిగా తేలిపోయారు.  విషయ పరిజ్ఞానం ఏమాత్రం లేకపోవడం, అజ్ఞానం బయటపెట్టే ప్రసంగాలతో ఆయన సమర్థతపై టీడీపీ నేతలే  నమ్మకం వదిలేశారు. ఇక లోకేశ్‌ బాడీ లాంగ్వేజ్, ప్రసంగాల్లో పొరపాట్లు సోషల్‌ మీడియాలో సెటైర్లకు మెటీరియల్‌గా మారాయి. ప్రజా నాయకుడిగా ఆయన ఏమాత్రం ఇమేజ్‌ సాధించలేకపోయారు. 2019 ఎన్నికల్లో లోకేశ్‌తో పోటీ చేయించాలా వద్దా అన్నదాన్ని చంద్రబాబు విపరీతంగా సాగదీశారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఇమేజ్‌ ఎన్నికల్లో పోటీ చేయకపోతే పూర్తిగా తుడుచిపెట్టుకుపోతుందని భయపడ్డారు. దాదాపు 10 నియోజకవర్గాల్లో సర్వేల మీద సర్వేలు నిర్వహించి చివరికి మంగళగిరి నుంచి పోటీ చేయించారు. కానీ ఆ ప్రయోగం బెడిసికొట్టింది. తనను నమ్మి రాజధాని నిర్మాణం కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు గొప్పగా చెప్పుకోగా… అదే రాజధానిలో ఆయన కుమారుడు లోకేశ్‌ పోటీ చేసి ఓడిపోవడంతో టీడీపీకి శరాఘాతమే. ప్రస్తుతానికి లోకేశ్‌ను ప్రజలు ఆదరించలేదని …నాయకుడిగా గుర్తించలేదని నిర్ధారణ కావడంతో టీడీపీ పూర్తిగా డీలాపడిపోయింది. ప్రాంతీయ పార్టీ నేతకు అత్యంత ఆవశ్యకమైన ప్రజాకర్షక శక్తి లోకేశ్ కు లేదు. ప్రజలను ఉత్తేజితుల్ని చేసే ప్రసంగాలు చేయలేరు. కనీసం తాను సభ్యుడిగా ఉన్న శాసనమండలిలోనైనా  ధాటిగా మాట్లాడ లేరు. ధర్నాలు, ఆందోళనలు వంటివి చేసి దూకుడు శూన్యం. మరోవైపు జనాదరణ, సమ్మోహనశక్తి ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆయన్ని ఏ అంశంలో కూడా ఢీ కొట్టడం కాదు కదా కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో లోకేశ్‌ లేరన్నది అందరూ అంగీకరించే వాస్తవం. కేవలం ట్విట్టర్‌లో తన తరపున ఎవరో పోస్టులు పెడితే ప్రజల్లో ఇమేజ్‌ రాదన్నది లోకేశ్‌ గుర్తించడం లేదు. అందరూ బోయీలుగా తన పల్లకీ మోస్తూ… సీఎం పీఠంపై కూర్చోబెట్టాలి అనే రీతిలో ఆయన అలోచన సరళి ఉంది. కానీ రాజకీయాల్లో అది అసాధ్యం. వారసత్వం ఒక దశ వరకే తోడ్పడుతుంది. ప్రజా నాయకుడిగా సీఎం స్థానానికి చేరుకోవాలి అంటే దీక్షాదక్షతలు, కఠిన పరిశ్రమ తప్పదని వైఎస్‌జగన్‌ రాజకీయ ప్రస్థానం నిరూపించింది. ఈ నేపథ్యంలో లోకేశ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ టీడీపీ అధికారంలోకి రాగలదన్న నమ్మకం ఎవరికీ పెద్దగా లేదు. లోకేశ్‌ తన సమర్థతనునిరూపించుకోలేకపోవడం టీడీపీకి తీవ్రమైన ప్రతికూలాంశం.

తమ్ముళ్ల అంతర్మథనం
ఓ వైపు చంద్రబాబు వార్థక్యం.. మరోవైపు లోకేశ్‌ అసమర్థత.. పార్టీకి రెండు శాపాలు. ఇక టీడీపీలో అగ్రనేతలు, సీనియర్ల రాజకీయ జీవితం దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. 1983–1999 మధ్యలో టీడీపీలోకి వచ్చి కీలకంగా ఉన్న మెజార్టీ నేతల వయసు దాదాపు 60 ఏళ్లకు చేరుకుంది. బుచ్చయ్యచౌదరి వంటివారు 70వపడిలో ఉన్నారు కూడా. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో అత్యధికులు 50ఏళ్లు పైబడ్డవారే.  వారందరూ మరో 5ఏళ్ల నుంచి పదేళ్ల వరకే రాజకీయాల్లో కొనసాగగలరు. ప్రస్తుత పరిస్థితుల్లో 2024లో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామన్న నమ్మకం పెద్దగా లేదు. రానున్న
ఐదేళ్లు ఎంతో కష్టపడితే అసెంబ్లీలో పార్టీ బలం 23 స్థానాల నుంచి 50స్థానాల నుంచి 60 స్థానాలకు పెరగొచ్చు. కానీ దాంతో అధికారం దక్కదు. ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాలి. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ 47 సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్షంలో కూర్చుంది. ప్రజాదారణ ఉన్న  వైఎస్సార్‌ను ఎదురొడ్డుతూ ఐదేళ్లు కష్టపడితే 2009లో 93 సీట్లు సాధించింది కానీ అధికారం దక్కలేదు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి పునరావృతం కావచ్చు. అంటే 2024లో అధికారం దక్కకపోయినా 2029వరకు నిరీక్షించేందుకు సిద్ధపడాలి. కానీ అప్పటికి టీడీపీ నేతల వయసు 70ఏళ్లకు చేరుకుంటుంది. వారి రాజకీయ జీవితం ముగిసిపోతుంది. అంటే పార్టీలో కొనసాగడానికి తమ భవిష్యత్‌ వదులుకోవాలా అని నేతలు మధనపడుతున్నారు. తమ వారసులకోసం అని సర్దిచెప్పుకోలేకపోతున్నారు. 2029నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. కాబట్టి ప్రస్తుతానికి సరైన భావి నాయకుడు లేని టీడీపీలో ఎందుకు కొనసాగాలని ఆ పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రాష్ట్రంలో విస్తరించాలని బీజేపీ భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత సంక్షోభాన్ని టీడీపీ సమర్థంగా ఎదుర్కొంటోందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Facebook Comments