ప్రత్యేకహోదాపై ప్రతి మాటా మోసమే!

53

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనేది సంజీవని అన్నది నిజమే. కానీ.. ఆ హోదాను పొందగల అవకాశాలు మాత్రం పూర్తిగా హరించుకుపోయాయి. 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు, జైట్లీ తదితర భాజపా నాయకులు మనకు ప్రత్యేకహోదా గురించి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ… పాలనలోకి వచ్చిన తర్వాత.. కాషాయ సర్కారు హోదా ఇవ్వదలచుకోలేదు. పై స్థాయిలో నేతలందరికీ ఈ విషయం స్పష్టంగా తెలుసు. అయితే ఇదివరకు, ఇప్పుడు కూడా.. ప్రతి నాయకుడూ తమ తమ రాజకీయ అవసరాలు ప్రేరేపించే తీవ్రతను బట్టి.. ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నట్లుగా కల్లబొల్లి మాటలు వల్లిస్తూ వస్తున్నారు. పార్టీలు ఏవైనా నేతలు ఎవరైనా.. హోదా గురించి ఏ మాట చెప్పినా అది అబద్ధమేనని, మోసమేనని ప్రజలు ఒక నిర్ణయానికి వస్తే వారికి కనీసం నిశ్చింత దక్కుతుంది.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ ఆదాయవనరుల గణాంకాలను చూసిన తొలిరోజుల్లో ఏపీలోని ప్రతి ఒక్కరికీ కడుపు మండిపోయింది. ఆ వెనుకబాటునుంచి త్వరగా బయటపడే మార్గం ప్రత్యేకహోదా మాత్రమే అని అందరూ నమ్మారు. అందుకోసం రోడ్డెక్కారు కూడా. కానీ… ప్రజల్లో ఉండే ప్రత్యేకహోదా స్ఫూర్తిని సమూలంగా చంపేయడంలో కొత్త ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి పాలన పగ్గాలు చేపట్టిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా సఫలమైంది. ప్రత్యేకహోదా కోసం ప్రజలు ఉద్యమిస్తే వారిమీద కేసులు పెట్టారు. అవంతా వైకాపా ప్రేరేపిత ఉద్యమాలుగా ముద్ర వేశారు. ప్రజల బలీయమైన ఆకాంక్ష మీద బురద చల్లారు. హోదా అనేది జిందా తిలిస్మాత్ కాదన్నారు. నెమ్మదిగా ఆ ఊసు మేధావుల చర్చావేదికల్లో తప్ప రాష్ట్రంలో ఎక్కడా వినపడకుండా చేసేశారు. హోదాను ఉపేక్షించి… ప్రత్యేకప్యాకేజీకి ఒప్పుకోవడమే దుర్మార్గం. తద్వారా బాబు సర్కారు ఆశించిన వక్ర ప్రయోజనాలు వేరు. అనుకున్న రీతిగా, అవి దక్కకపోయే సరికి.. ప్యాకేజీ వద్దని అడ్డం తిరిగారు. కేంద్రంతో సున్నం పెట్టుకున్నారు.
ప్రజల్లో తామే అంతరింపజేసిన హోదా కాంక్షను తిరిగి రాజేయడానికి చంద్రబాబు విఫలయత్నం చేశారు. ధర్మపోరాటాలనే పడికట్టు సభల ముసుగులో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. చంద్రబాబు రెండు మార్గాలు అనుసరించారు. 1) మోదీ అడ్డం పడ్డారంటూ… బురద చల్లారు. 2) ధర్మ పోరాటాలనే దీక్షలు రాజకీయంగా మైలేజీ ఇస్తాయనుకున్నారు. ఆ విషయంలో ప్రజలు హంసనీతిని అనుసరించారు. హంస.. పాలు- నీళ్లను వేర్వేరుగా సేవించినట్లే ఒకటో మార్గాన్ని నమ్మారు. రెండో వ్యూహాన్ని ఈసడించారు. ఫలితం.. రాష్ట్రవ్యాప్తంగా చరిత్రలో లేనంత దారుణమైన పరాజయం దక్కింది. ఇప్పుడిక లోక్‌సభలో జయదేవ్ మాటల రూపేణా.. ‘హోదా బాధ్యత వైకాపాదే’ అంటూ కాడి పక్కన పారేశారు.
ఇటు జగన్మోహన రెడ్డి కూడా ప్రత్యేకహోదా విషయంలో ప్రజలకు నిజం చెప్పలేదు. గతంలో పోరాటరూపంగా ప్రకటించిన ఎంపీల రాజీనామాలను చాలా ఆలస్యంగా చేయించి.. రాజకీయ లబ్ధి కోరుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన కేంద్రంతో సుహృద్భావ సంబంధాలతోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. కాకపోతే.. ప్రజలు తనను కూడా ఈసడించకుండా.. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ హోదా అడుగుతూనే ఉంటానంటూ ఓ మాట చెప్పి ఊరుకున్నారు.
‘హోదా రాదు’, ‘వచ్చే అవకాశం లేదు’ అనే సత్యాన్ని ప్రజలకు చెప్పడానికి అటు తెలుగుదేశం, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని అనుకుంటే పొరబాటు. వారికి భయం లేదు. సత్యం చెప్పకపోవడం కేవలం వారి వ్యూహం మాత్రమే. కేంద్రంలో చాలా విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తున్న భాజపాతో ఎంత మంచిగా కొనసాగినా… సంబంధాలు బెడిసికొట్టగల ఏదో ఒక తరుణంలో తమ అమ్ముల పొదిలోంచి బయటకు తీయడానికి ఒక అస్త్రంగా వారు దీనిని చూస్తున్నారు.
“సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్య మప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ స్సనాతన:!!”
…అని మనుస్మృతి చెబుతుంది. ‘‘నిజమే చెప్పు.. అందరూ ఇష్టపడేదే చెప్పు… ఎదుటివారు ఇష్టపడకపోతే నిజాన్ని కూడా చెప్పకు’’అన్నంత వరకు మొదటి పాదంలోని భావాన్ని మాత్రమే నాయకులంతా పాటిస్తున్నారు. అయితే ‘‘ఇష్టపడుతున్నారు గనుక అసత్యం చెప్పకు’’ అనే రెండో పాదంలోని సనాతన ధర్మం నిర్వచించే అర్థాన్ని నాయకులు విస్మరిస్తున్నారు. అందుకే నాయకుల మాటలను పట్టించుకోకుండా… హోదా గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్పష్టతకలిగి ఉండడం మంచిది. నాయకుల మాటలు మోసాలే తప్ప మరొకటి కాదని తెలుసుకుంటే మంచిది.

Facebook Comments