ఒబ్బు దేవీప్రసాద్ కథ : ఊరిని కన్న నాన్న!

100

“హలో సురేష్!  మీ ప్రాంతంలో ఏదైనా సమస్యగురించిగానీ, లేదా సమాజానికి మేలు చేసే వ్యక్తి గురించిగానీ ప్రత్యేక కథనం వ్రాయమని హెడ్ ఆఫీసు నుంచి ఇప్పుడే ఎమ్.డి గారు ఫోన్ చేశారు. నీవైతే బాగా రాస్తావని నీకు చెబుతున్నాను. వీలైనంతవరకు వారంలో నాకు పంపించు. జిల్లాల నుంచి వచ్చిన వాటిలో ఉత్తమమైనది సెలక్ట్ చేసి ఆదివారం అనుబంధం పుస్తకంలో ప్రచురిస్తారట. ఈ అవకాశాన్ని వదులుకోకు.” మా డెస్క్ ఇన్చార్జ్ దినేష్ కుమార్ ఫోన్ చేశారు.

నేను ఈ ప్రాంత రిపోర్టర్ గా జాయిన్ అయ్యి  ఇంకా వారం కూడా కాలేదు. ఇక్కడ మనుషులు, పరిస్థితులు గురించి నాకు పూర్తిగా అవగాహన లేదు. ఏది రాస్తే… బాగుంటుందని ఆలోచిస్తుండగా… మళ్లీ ఫోను మోగింది.

“నమస్తే సార్! మాది నెమళ్ళ పురం. టవున్ నుంచి ఏడు కిలోమీటర్లుంటుంది. రేపు మా మా ఊరిలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. మీరు తప్పకుండా రావాలి. ఇంతకు మునుపు ఉన్న రిపోర్టరు సార్ కి ఫోన్ చేస్తే, నేనిప్పుడు అక్కడ లేనని, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు. అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను. దయచేసి తప్పకుండా రండి సార్!” అన్నాడు అవతలి వ్యక్తి.

‘‘గొప్ప ఉత్సవం అంటే.. ఏదైనా జాతరా..’’ విషయాలమీద అలవాటైపోయిన అనాసక్తితో అడిగాను. ఆ మాత్రం దానికి మనంతటి వాడు వెళ్లడం ఎందుకని!

‘‘మీరెటూ కొత్తగా వచ్చారు కదా సర్. ఓసారి రండి. మా పల్లె బతుకుల్లో లోతు తెలుస్తుంది…’’ వినయంగానే చెప్పేసి, ఫోన్ పెట్టేశాడు.

అక్కడ ఏ ఉత్సవం జరుగుతుంది? దానికి ప్రత్యేక అతిథిగా ఎవరు వస్తున్నారు? కనీసం మంత్రి రేంజి వాడైనా రాకపోతే.. నా అంతటి వాడు వెళ్లడం ఎందుకు? అనిపించింది. ఆ వివరాలేమీ చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు. ఎటూ ఇంకా ఈ ప్రాంతానికి అలవాటు పడలేదు. ఓసారి వెళ్తేసరి. ఉత్సవం మొక్కుబడిగా ఉన్నా.. కనీసం ఈ ఏరియా మీద నాలెడ్జీ వస్తుంది అనుకుంటూ ఇవాళ్టి వార్తలను ఎడిషన్ ఆఫీసుకు పంపడానికి కంప్యూటర్ ఆన్ చేశాను.

*   *   *

మరుసటిరోజు నేను బైక్ మీద ఆ ఊరికి చేరుకునేసరికి ఎండ వాయించేస్తోంది. ఊరి ముఖద్వారం వద్ద పూలతో అలంకరించిన పెద్ద ఆర్చి. అక్కడి నుంచీ రెండుపక్కలా ఉన్న చెట్లు దారిపొడుగునా పచ్చటి గొడుగుపట్టినట్టున్నాయి….  చెట్లను మాలలాగా కట్టినట్లున్న దారాలకు, స్వాతంత్ర్య దినోత్సవానికి కలర్ పేపర్స్ కట్టినట్లుగా వీధులలో ఎక్కడ చూసినా పూల తోరణాలు. ప్రతి ఇంటి గుమ్మానికి మామిడితోరణాలు. అందరి వాకిళ్ళల్లో రంగులతో తీర్చిదిద్దిన అందమైన ముగ్గులు. ఊర్లో జాతర ఏమైనా జరుగుతోందా? అనుకుంటూ బండిని ఓ పక్కగా ఆపాను.

“ఇక్కడ జాతర ఏమైనా జరుగుతోందా?” అని తోరణాలు కట్టే పనిలో ఉన్న ఓ యువకుడిని అడిగాను.

“దాని కంటే ఎక్కువేకదా?.” సమాధానాన్నే ప్రశ్నగా వేసి అతను వెళ్ళిపోయాడు.

అతను ఏమిచెప్పాడో! నాకర్థం కాలేదు. ఇంకాస్త దూరం ఊర్లోకి వెళుతుండగా…

“సార్! మీరు రిపొర్టరా!” అంటూ ఒకతను ఎదురొచ్చాడు.

బండిమీద ‘ప్రెస్’ అనే అక్షరాలు చూశాడో ఏమో.. నావైపు వచ్చి పలకరించాడు.. ‘‘చానా సంతోషం సార్. కొత్తసారు వస్తారో రారో అనుకున్నా..’’ అంటూ!

“అవును నేనే.” అన్నట్లు తలూపుతూ…

“ఫోన్ చేసింది నువ్వేనా?” అని అడిగాను.

“అవును సార్! రండి! గుడి దగ్గరకువెళదాం.” అని నా బైక్ వెనకెక్కాడు. దారిలో కనబడిన వ్యక్తేమో జాతర కాదన్నట్లు చెప్పాడు. ఇతనేమో గుడి అంటున్నాడని ఆలోచిస్తూ…

‘‘ఏంటివాళ స్పెషల్’’ అడిగాను.

‘‘నాన్నగారి పుట్టినరోజు కదా సార్’’ అన్నాడు తన్మయంగా.

నాన్నగారి పుట్టినరోజును ఇంత ఘనంగా చేస్తారా? అన్నాను. నాన్నలకు గుడికట్టిన కొదరి గురించి చదివాను. ఇక్కడ ఉత్సవం కూడా చేస్తున్నారని ఆశ్చర్యం అనిపించింది.

అంతలో అతను గుడి చూపించగానే… నేను ఆ గుడి ముందు బైక్ ఆపాను. ఆ గుడి చుట్టూ పెద్ద ప్రహరీగోడ ఉంది. గుడి లోపలి ఆవరణంలో పెద్ద చలువపందిరి వేసుంది. గుడి బయట జనం గుంపులు గుంపులుగా  ఉన్నారు. నా వెనుక కుర్చున్న వ్యక్తి నన్ను లోపలికి తీసుకెళ్ళాడు. గుడి ఆవరణం చాలా విశాలంగా ఉంది. ఆ ఆవరణంలో ఓ పక్కగా పెద్ద స్టేజి కట్టుంది. ఆ స్టేజిని చక్కగా అలంకరించున్నారు. స్టేజిలో పెద్ద టేబుల్స్, కుర్చీలు వేసున్నారు. స్టేజికి ముందు భాగంలో దాదాపు మూడువందల కుర్చీలున్నాయి. గర్భగుడిలోపలికి, బయటకు ఇసుకేస్తే రాలనంత జనం వస్తూపోతూ ఉండడం వల్ల గర్భగుడిలో విగ్రహం సరిగా కనపడటం లేదు. ఇంతలో…

“పురప్రజలందరూ స్టేజీ ముందున్న కుర్చీలలో కూర్చోవలసినదిగా మనవి. కాసేపటిలో కార్యక్రమం ప్రారంభమవుతుంది” అని మైక్ అనౌన్స్మెంట్.

“సార్! స్టేజీ దగ్గరకు వెళదాం రండి! కాస్త రద్దీ తగ్గాక మళ్ళీ గుడిలోకి తీసుకెళ్తాను” అంటూ నన్ను స్టేజీ ముందున్న వేసున్న ముందు వరుస కుర్చీలో కూర్చోపెట్టాడు అతను. ఇద్దరు యువకులు లామినేషన్ ప్రేమ్ చేసిన పెద్ద పటాన్ని స్టేజ్ వెనుక వైపు ఉన్న గోడకున్న  మేకులకు తగిలించారు. ఆ పటంలో తెల్లని దుస్తులు ధరించిన ఓ పెద్దాయన కుర్చీలో కూర్చుని, చిరునవ్వుతో చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. ఆ పటం నుంచి చూపు మరల్చలేనంత ప్రశాంతంగా ఉంది ఆయన ముఖం. ఇంతలో స్టేజీ పైన ఒక యువకుడు చేతికి మైక్ తీసుకుని…

“ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసినదిగా మన గ్రామ సర్పంచ్ మురళి గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మనందరి జీవితాలలో వెలుగునింపిన ఆశాజ్యోతి, మన ఊరి దేవుడు అయిన బలరామయ్య గారి మనమరాలు సుజనను వేదికమీదకు రావలసినదిగా ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడకు విచ్చేసిన ప్రజలకు, అతిథులకు, పత్రికా విలేకరులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడు సర్పంచ్ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.” అంటూ మైక్ ను సర్పంచ్ చేతికిచ్చి… స్టేజి దిగేశాడు. తరువాత సర్పంచ్ పెద్దాయన పటానికి పూలమాల వేసి నమస్కరించగా… బలరామయ్య మనుమరాలు సుజన జ్యోతి ప్రజ్వలన చేసింది. తరువాత…

“మన అందరి జీవితాలలో వెలుగు నింపిన మహామనిషి. మన ఊరి దేవుడు కీర్తి శేషులు బలరామయ్యగారి పాదపద్మములకు నమస్సుమాంజలి. తాత అడుగు జాడల్లోనే నడుస్తున్న వారి మనువరాలు సుజన గారికి ధన్యవాదములు. మనకు, మన ఊరికి ఎంతో మేలు చేసిన ఆ మహనీయుణ్ణి స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఎన్ని జన్మలెత్తినా ఆయన ఋణం మనం తీర్చలేనిది. ఆయన మధ్యలేకపోయినా ఆయన రూపాన్ని రోజూ చూసి తరించాలని ఉద్దేశ్యంతో మన ఊరి నడిబొడ్డులో ఆయన గుడి కట్టుకోవడం మన అదృష్టం.  అలాంటి గొప్పమనిషి జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా ఆయన మనుమరాలు సుజనగారు మన ఊరిలోని మహిళందరికీ చీరలు, పిల్లలకు నోట్ పుస్తకాలు, రెండు జతల బట్టలు, మగవాళ్ళకు పంచె, కండువా పదేళ్ళుగా ఇవ్వడం ఆమె మంచి మనస్సుకు నిదర్శనం. ఇప్పుడు సుజనగారు మాట్లాడుతారు.” అని సర్పంచ్ మురళి మైక్ ను ఆమె చేతికిచ్చి తన ప్రసంగాన్ని ముగించాడు.

“అందరికీ నమస్కారం. మా తాతగారు ఈ లోకం విడచి పాతికేళ్ళైనా ప్రతి ఏటా మా తాతగారి జయంతిని, వర్థంతిని ఓ పండుగలా నిర్వహించడమే కాకుండా, వేలమందికి అన్నదానం చేస్తున్న మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అలాంటి గొప్పమనిషికి మనమరాలిగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం.” అని తన ప్రసంగాన్ని ముగించిన తరువాత ఊరిలోని అందరికీ వస్త్రాలు పంపిణీ చేసి వెళ్ళిపోయింది. తరువాత అందరూ భోజనాలు చేసి ఇండ్లకు వెళ్ళిపోతున్నారు… కాసేపటి తర్వాత గుడిలో జనం పలుచబడినారు.

వాళ్ల ప్రసంగాలు విన్నాను గానీ… ఆ తతంగం అంతా నాకింకా సస్పెన్సు సినిమా లాగానే ఉంది. ఎవరీ బలరామయ్య. ఆయనకు గుడేమిటి? స్పష్టత రాలేదు. గుడిలో విగ్రహం ఎలా ఉందో చూడటానికి లోపలికెళ్ళాను. ఆరడుగుల విగ్రహం అభయహస్తం చూపిస్తూ…సజీవంగా ఉంది. ఆ విగ్రహం కళ్ళల్లో కరుణ, దయ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఏదో ఖుష్బూ లాంటి హీరోయిన్లకు తప్ప… ఈరోజుల్లో ఒక మనిషికి గుడి కట్టడం అంటే సామాన్యమైన విషయంకాదు. ఇలాంటి సంఘటన అరుదుగా జరుగుతూ ఉంటుంది.

ఈ మనిషి ఈ ఊరికి అంత గొప్ప ఉపకారం ఏమి చేసుంటాడని ఆలోచిస్తూ… గుడి బయటకు వచ్చాను. ఆ ఆలయ ప్రాగణంలో ఎడమవైపు వేపచెట్టు చూట్టూ నిర్మించిన పెద్ద అరుగుమీద ఒక ముసలాయన తనకిచ్చిన పంచె, కండువా చూసుకుంటున్నాడు… అతనిని అడిగితే తెలుస్తుందని వేపచెట్టు దగ్గరకెళ్ళాను.

” పెద్దాయనా! ఈ బలరామయ్య ఎవరికి నాన్న? ఈ ఊరికి అంతగా ఏం ఉపకారం చేశాడు?” అడిగాను.

“కొత్తోడిలాగా కనిపిస్తండావు బాబూ… నీవెవరో తెలియదుగానీ మంచి ప్రశ్నే వేశావు! ఆయన ఉపకారం చేయడం అనేది చిన్నమాట. మా ఊరికే ఆయన నాన్న… ఇదిగో నా దగ్గరినుంచీ.. ఆ బూర ఊదుకునే పిలగాడి దాకా అందరూ ఆయనకు పిల్లలే…’’ సస్పెన్సు పెంచుతూ చెప్పాడు.

‘‘కొంచెం అర్థమయ్యేలా చెప్తావా’’ చిరాకు కనిపించకుండా అడిగాను.

‘‘పెద్ద కథే. వినే ఓపిక ఉంటే చెప్తా.” మొదలెట్టాడు. “ఒకప్పుడు ఈ ఊరి పేరు కూలి పల్లె. సెంటు బూమి ఉండే మొనగాడు ఒకడూ లేడు. అందరివీ రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. కండలు కరిగినస్తే గానీ.. కడుపుకింత కవళం దొరకదు. యిట్టాంటి రోజుల్లో కాస్త వయసుకొచ్చిన మగపిలకాయిలంతా దుడ్లు దండిగా వొస్తాయని కొంపల్లో ఉండే గింజగింజ బంగారమూ పుస్తెలూ తెగనమ్మి.. కువైటుకు బొయినారు. నీకు దెలుసునా నాయినా… ఇదెప్పుడో ముప్పయ్యేళ్ల నాటి మాట. కువైటు బొయ్యే యిమానం సముద్రంలో కూలిపోయింది. మా  కూలిపల్లె గొల్లు మంది. మా కొంపల్నిండా చీకటి ముసురుకునింది. మా బతుకుల్ని దుఃఖం కాటేసింది. అట్టాంటి రోజుల్లో రోడ్డు పక్కన టౌనుకు పోతాపోతా… దాహానికి అదిగో ఆ గుడి పక్కన చెట్టు కింద కారు ఆపినాడు ఆ అయ్య.

అడిగినాడు గదాని ఓ యమ్మ దాహం దెచ్చి పోసింది. ఆ నీళ్లు తాగతానే.. ఆ యమ్మ మొహంలో సారికలు గట్టిన నీళ్లను ఆయన గమనించినాడు. ‘‘ఏవమ్మా.. పిల్లాపాపా అంతా సల్లంగుండారా’’ అనడిగినాడు. అంతే ఆ యమ్మ గొల్లు మనింది. ఏడ నాయినా.. మా బతుకులంతా కొరివిలేని కాష్టాలయిపాయెనా అని గోడంతా వెళ్లబోసుకునింది. అంతా యిన్నాడు. ఆనక యెళ్లిపోయినాడు.

వారం దినాల తర్వాత వొచ్చినాడు. యీ మద్దెలో ఏం జరిగిందో ఏం జేసినాడో తెలీదు. కారునిండా దుడ్లు దెచ్చినాడు. ఒక్కో కుటుంబానికి రెండెకరాల నేల గొనిచ్చినాడు. అందరి కయ్యలు తడిసేమాదిరిగా ఉమ్మడిగా బోర్లేయించినాడు. యిత్తనాలకి, ఎరువులకీ కాసింత దర్మం జేసినాడు.. అదిగో ఆ చెట్టు పక్కనే ఓ చిన్న గుడిసేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆయన పెండ్లాం కూడా వొచ్చి కూడా ఉండసాగింది. ఈనోటా ఆనోటా తెలిసిందేందంటే.. మదరాసులో ఆయన పెద్ద కామందు అంట. ఈ ఊరి కష్టం యిని, సగం ఆస్తులు అమ్ముకుని వచ్చేసినాడంట. అట్టా జెయ్యడానికి కుదరదని అడ్డం పడిన ఒక్కగానొక్క కొడుక్కి మిగిలిన సగం పంచేసి తెగతెంపులు చేసుకు వొచ్చినాడంట.

మాలో కొంచిం వయసు పైబడి, ఆ పెద్దాయనతో మాట చనువుండే వోళ్లం.. అడపాదడపా ‘సామీ… మా బతుకులు యెట్టాగైనా గడిసిపోతాయి.. మాకోసం మీరు కన్నబిడ్డను కాదనుకుని రాడం యేటికి’ అనేటోళ్లం. ‘ఒక బిడ్డ పోతే యేంట్రా.. మీరంతా నా బిడ్డలు గాదా’ అని నవ్వేటోడు. ఒక ట్రాక్టరు పెట్టుకోని ఆయనే సొయంగా అందరి కయ్యలకి దున్నతా ఉండేటోడు. అదే వ్యాపకం.. పొద్దన్లేసి పిలకాయిలకి కాసింత చదువూ… సందేళల్లో పెద్దోళ్లకి కాసిని మంచి మాటలు జెప్తా వుండేటోడు. అందరం ఆయన్ని ‘నాన్నగారూ’ అనే పిలిచేటోళ్లం.

అప్పటివరకు చెరువే లేని మా ఊరికి పెద్ద  చెరువు కట్టించాడు. పల్లెలో సిమెంటు రోడ్లు వేయించాడు. బడీ, ఆసుపత్రీ కట్టించి.. సర్కారుకు యిచ్చాడు. ఊరికి ఏమేం కావాల్నో అన్నీ చూస్కున్నాడు. నెమ్మదిగా మా కూలిపల్లె కి కాస్తా.. సిరిపల్లె అని కొత్త పేరు పెట్టినాడు. కండలే మా బొక్కసాలు. కస్టమే మా సిరి!!

‘‘మీరంతా సెటిలయ్యాక మళ్లీ మదరాసెళ్లిపోయాడా…’’

‘‘అది మనుసుల్లో దేవుళ్లు జేసే పని బాబూ. ఆయన అట్టా గాదు.. దేవుళ్లను మించిన మనిసి. ఓర్సుకోలేక దేవుళ్లు పట్టకపొయినారు…’’

ఆ పెద్దాయన, ఆ అమ్మాయి ఇచ్చిన కొత్త కండువాతో.. ధారగా కారుతున్న కన్నీళ్లను అద్దుకుంటున్నాడు. గొంతు బొంగురు పోయింది. కాసేపట్లో సర్దుకుని మళ్లీ అన్నాడు…

‘‘కాలమైపోయినాడు బాబూ… కాలమైపోయినాడు. యావదాస్తిని తనకివ్వకుండా మా యెదాన గొట్టినాడన్న కోపంతో కొరివిపెట్టడానికి రానన్నాడు కన్న కొడుకు. పొద్దు గుంకి యేళకి.. సావు కబురు మదరాసుకు మోసుకెళ్లిన మా ఊరి పిలగాడు, అంతకంటె పెద్ద సావుకబురుతో తిరిగి ఊరికొచ్చినాడు.

యేడిసినాం బాబూ.. మా ఊరి పిలకాయిలందర్నీ ముదనష్టపు సముద్రం మింగేసినప్పుడు గూడా అంత యేడవలా… అట్టా యేడిసినాం. మా బిడ్డలు దూరమైపోయినారని.. మాకు నాన్నయినాడు.. అందుకోసం ఆయన బిడ్డనే దూరం జేసుకున్నాడు. కాయం కాష్టం మీదికి జేర్చి ఊరు ఊరంతా తలా ఒక మండే కట్టె బట్టుకోని కొరివిబెట్టినాం బాబూ… మా అందరికీ నువ్వే నాయినవంటూ… మొక్కుదీర్చుకున్నాం.’’ పెద్దాయన వెక్కుతున్నాడు. యిక మాట రావడం లేదు.

నాకు మనసంతా దేవేసినట్లు అయిపోయింది. భుజం మీద చేయేసి.. ఊరుకోమన్నట్లుగా అంటున్నాను. అక్కడికి ఎప్పుడొచ్చి పక్కనే కూర్చున్నాడో ఏమో.. నన్ను పిలిచిన కుర్రాడు… ఆ తర్వాతి కథ తానందుకున్నాడు.

‘‘అది సార్ మా నాన్నగారి కథ! నాన్న గారంటే నాకు కాదు.. మా ఊరందరికీ’’ అని నవ్వాడు. ‘‘ఆ తర్వాత రెండేళ్లకు ఆయన కొడుకు కూడా చచ్చిపోయాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు.. నానమ్మ కోసం ఇక్కడికొచ్చింది. మా ఊరంతా ఆమెను అమ్మలాగా ఎలా చూసుకుంటోందో గమనించింది. మేమంతా తన కుటుంబమే అని తెలుసుకుంది. అప్పటినుంచి ఇదిగో నాన్నగారి పుట్టినరోజు నాడు మదరాసు నుంచి వచ్చి మా అందరికీ బట్టు పెడుతుంటంది…’’ సస్పెన్సులన్నీ తీరుస్తూ ముగించాడు.

ఇంకొక్కటి మిగిలిపోయింది.

‘‘మరి బలరామయ్య గారి భార్య..’’ ఆయన గురించి ప్రస్తావించడంలో ఇదివరకు నాలో ఉన్న ఏకవచనపు ప్రయోగం ఇప్పుడు మారిపోయింది. తేడా నాకే తెలుస్తోంది.

‘‘మా ఊళ్లోనే ఉండిపోయింది సార్…’’

‘‘మరి ఆమె జీవనం గడవడం…’’

‘‘మదరాసు మనవరాలినుంచి పైసా తీసుకోదు సార్. ఇయ్యాళ మాకిచ్చినట్లే ఊరందరికీ యిచ్చే చీర మాత్రం పుచ్చుకుంటుంది. మమ్మల్నందరినీ తన బిడ్డలనే అనుకున్న దొడ్డ యిల్లాలు. రోజూ ఒక్కో యింటినుంచి ఆమెకు భోజనవసతి మొత్తం చూస్తుంటాం. ఆమెకు భోజనం తీసుకెళ్లే రోజు మాకు పెద్ద పండగ. ఆ వంతు వచ్చిననాడు మా ఇంట్లో పరమాన్నం చేసుకుంటాం, గారెలు కాలుస్తాం.. బిడ్డలు సంతోషంగా, సుఖంగా ఉన్నారని మా అమ్మ తెలుసుకునేలాగా శుభ్రమైన దుస్తులు వేసుకుంటాం.. ఆ రోజు ఆమె ఇంటికెళ్లి.. రోజంతా ఆమెతో గడిపి వస్తాం… ప్రతిరోజూ ఓ బిడ్డ వచ్చి తనతో గడుపుతుంటాడని ఆమెకెంతో ఆనందం… అంతే… యిల్లు దాటి బయటకు రాకుండా… యింటికాడికొచ్చినోళ్లకు నాలుగు మంచిమాటలు చెప్పుకుంటూ బతికేస్తోంది…’’

మొత్తం క్లియర్ గా ఉంది.

‘‘చాలా చెప్పావు.. చాలా బాగా చెప్పావు..’’ అన్నాను యింకా వెక్కుతున్న ఆ పెద్దాయన చేతిని నా చేతుల్లోకి తీసుకుని.

“చెడు గురించి చెప్పకూడదుగానీ, మంచి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. నిజమా కాదా బాబూ” అన్నాడు.

* * *

నా తెలివితేటలు ప్రదర్శించి రాయవలసిన అవసరం పెద్దగా లేకపోయింది. ఊరిలో కన్నదీ, విన్నదీ యథాతథంగా రాసి పంపేశాను.

నెల తర్వాత… నేను పంపిన ఆర్టికల్ మా పత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. నాకు అభినందనలు వెల్లువలా రావడంలో వింతేం లేదు. ‘ఊరిని కన్న నాన్న’ గురించి తెలుసుకోడానికి, ఆయన అసలైన బిడ్డలను చూసి స్ఫూర్తి పొందడానికి.. ఏళ్లు గడిచిపోతున్నా.. అడపాదడపా ఇప్పటికీ.. అనేక ప్రాంతాల నుంచి కొందరు వచ్చి వెళుతుంటారంటే… మరుగున ఉన్న ఆయన కథ ప్రపంచానికి ఎంత నచ్చిందో విడిగా చెప్పక్కర్లేదు.

..దేవీప్రసాద్ ఒబ్బు

98662 51159.

Facebook Comments