రంగు పులుముకున్న ‘సంతోషం’

37

సినిమారంగంలో వివిధ రంగాల్లో పనిచేసేవారు క్రమంగా నటులుగా మారడం కొత్త విషయం కాదు. నటనకోసమే ఇండస్ట్రీకి రాకపోయినప్పటికీ.. కాలక్రమంలో నటులుగానే వెలిగేవాళ్లుంటారు. తొలుత ఏదో ఆపద్ధర్మంగా రంగుపూసుకుని తెరమీదకు వచ్చినా, పాత్ర క్లిక్ అయితే.. నటననే కెరీర్ గా స్వీకరించిన వారున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు సంతోషం సురేష్ కూడా నటిస్తున్నారు. దేవినేని చిత్రంలో వంగవీటి రంగా పాత్రను పోషిస్తున్నారు.

బెజవాడ రాజకీయాలు.. రాష్ట్రంలో కక్షల రాజకీయాలకు ప్రతీకగా ఉంటాయని అంతా అంటూ ఉంటారు. బెజవాడ రాజకీయం అంటేనే… ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రబలిన శత్రుత్వం అనే ప్రచారం కూడా ఉంది. వీరు వంగవీటి రంగా- దేవినేని నెహ్రూ. ఈ ఇద్దరు నాయకుల్లో వంగవీటి రంగా పేరుతో ఇప్పటికే ఒక సినిమా తయారైంది. ఇప్పుడు దేవినేని పేరుతోనూ మరో చిత్రం రూపొందుతోంది.

`బెజవాడ సింహం` అనేది ఉప‌శీర్షిక‌. శివ‌నాగు ద‌ర్శక‌త్వంలో ఆర్‌టి‌ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తుండగా ..వంగవీటి రంగా పాత్రలో పత్రికాధిపతి, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి (సంతోషం సురేష్) నటిస్తున్నారు. వంగ‌వీటి రంగా 72వ జ‌యంతి సంద‌ర్భంగా రంగా పాత్రధారి ఫ‌స్ట్ లుక్ ని చిత్రయూనిట్ లాంచ్ చేసింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు శివ‌నాగు మాట్లాడుతూ.. బెజవాడలో జరిగిన ఇద్దరు నాయకుల మధ్య జరిగిన యదార్థ కథను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కిస్తున్నామ‌ని తెలిపారు. నిర్మాత రామూరాథోడ్ మాట్లాడుతూ .. “దేవినేని – రంగా పాత్రలు ఒక‌దానితో ఒక‌టి పోటాపోటీగా ఉంటాయి. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ చిత్రీకరిస్తున్న ఈ చిత్రం చాలా నేచురల్‌గా వుంటుంది. తాజాగా వంగ‌వీటి రంగా పాత్ర ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నాం. రంగా పాత్రలో సురేష్ కొండేటి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. దేవినేని పాత్రలో తార‌కర‌త్న అంతే అద్భుతంగా న‌టించారు“ అని తెలిపారు.

Facebook Comments