వ్యంగ్యబాణాలు : నవకవితాదర్శిని 2

181

అడుగడుగున బాబు గార్కి

అభిమానుల ఓదార్పు!

ప్రజల ప్రేమ నిజమైతే

తేడా కొట్టెనెలా తీర్పు?

ఏది సత్యం? ఏదసత్యం?

కలుగుతోంది సందేహం!

రాజకీయ నాయకులకు

జనాదరణ ఒక దాహం!!

చంద్రబాబునాయుడు సీఎం కాలేకపోయినందుకు ఇప్పటికీ ఆయన ప్రజలను కలుస్తున్నప్పుడు వెల్లువెత్తుతున్న విలాపాలు, దుఃఖాలు. చంద్రబాబు ఓడిపోయినందుకు ఉండవల్లిలో ఆయనను కలిసిన ప్రజలు భోరున విలపించారు. కొన్నిరోజుల గ్యాప్ వచ్చింది. ఫలితాలు వెలువడి సుమారు నెలరోజుల తర్వాత ఆయన సొంత నియోజకవర్గం కుప్పం వెళితే.. మళ్లీ అక్కడ కూడా ప్రజలు ఆయనను కలిసి విలపించారు. ఆయన పట్ల ప ్రజల్లో అంత ప్రేమ ఉండగా.. కుప్పంలో కూడా మెజారిటీ ఎలా తగ్గిపోయింది చెప్మా!

ప్రజాపోరాటాలకు యింకా

కాలేదోయ్ ఆయత్తం

ఐనా జనంలో నిత్యం

కనిపించే ప్రయత్నం!

విమర్శనాస్త్రాల తోడ

విరుచుకు పడు వైనం

ఏ చాన్సూ వదలకుండ

చెలరేగుతోంది ‘పవనం’

ప్రభుత్వానికి కొంత వ్యవధి ఇచ్చి చూస్తాం అంటూనే.. విమర్శనాస్త్రాలతో చెలరేగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు లాగా ప్రభుత్వ పాలనపై వేచిచూస్తాం అని అన్నారు. కానీ అంతలోనే తాళలేకపోతున్నారు. ఎడాపెడా తన అమ్ములపొదిలోంచి బాణాలు బయటకు తీస్తున్నారు.

భావి ప్రధాని గారికి

ముదిరెనేల వైరాగ్యం!

పరాజయం భారానికి

కుంగెనేమొ ఆరోగ్యం!

సారధి పగ్గం వదిలేస్తే

యానం సాగడ మెలాగ?

విన్నపాలు వినలేదే

పార్టీ ఆగం అయిపోగా..!

ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్. రాహుల వ్యవహారం చూస్తే.. తొలినుంచి పార్టీ సారథ్యాన్ని ముళ్ల కిరీటంలాగా భావించినట్లే కనిపిస్తోంది. ఓటమి అనే సాకు దొరగ్గానే ఆ ముళ్ల కిరీటాన్ని పక్కన పారేసి పలాయనం చిత్తగించడానికి ఉత్సాహపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

Facebook Comments