సంపాదకీయం : ఇదేనా విధాయకం!

111

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి అధికారంలోకి రావడం ఒక్కటే ఇప్పుడు జరిగిన పరిణామం కాదు. తెలుగుదేశం పార్టీ అనూహ్యమైన పతనానికి గురికావడం కూడా ఈ ఎన్నికల్లో జరిగింది. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు? అనే ప్రశ్నకు ఒక  శూన్యత సమాధానం కావచ్చుననే భావం చాలా మందిలో పొడసూపుతోంది. సహజంగానే… ఆ శూన్యత లోకి తాము రాగలం అని జనసేన, భారతీయ జనతా పార్టీలు రెండూ తలపోస్తున్నాయి. అయితే రాజకీయ మ్యూజికల్ ఛెయిర్స్‌లో తెలుగుదేశం సీటు ఇంకా ఖాళీ కాలేదు. ఓటమికి వెరవవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ ఒక సందర్భంలో అది ఎదురవుతుంది. కానీ, ఆ ఓటమినుంచి మళ్లీ నిలదొక్కుకునే చేవను కనబరుస్తున్నదా? లేదా? అనేదే మీమాంస!

తెలుగుదేశం పని అయిపోయినట్లేననే భ్రమను మరింతగా ప్రజల్లోకి వ్యాపింపజేయడానికి భాజపా చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. టీవీఛానెళ్లలో ఆ పార్టీ గళంగా ముద్రపడిన పలువురు నాయకులు ఇప్పుడు బయటకు వచ్చి కమలదళంలో చేరుతున్నారు. ప్రధానంగా వారిమీద ఫోకస్ పెట్టడం అనేది.. ప్రజలకు తెలిసిన మొహాలు వెళ్లిపోతోంటే (వారు ప్రజాబలం ఉన్నవారు కాకపోయినా సరే), పార్టీ మొత్తం వెళ్లిపోతున్నట్లుగా ప్రజలు భ్రమించే అవకాశం ఎక్కువ. ఆ రకంగా రాష్ట్రంలో తాము బలపడుతున్న సంకేతాలను ప్రజల్లోకి పంపడానికి భాజపా ప్రయత్నిస్తోంది. తెదేపా ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా తమ పార్టీలో చేర్చుకోవడానికి కూడా ఒక ప్రణాళిక నడుస్తుండగా, మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక తాత్సారం జరుగుతోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో మంతనాలు మాత్రం ముగించి.. ఈలోగా తతిమ్మా నాయకశ్రేణిని తమలో ఐక్యం చేసుకోవడానికి కృషి జరుగుతోంది.

ఇదంతా వారి రాజకీయ వ్యూహం. మంచిదే. ఆంధ్రప్రదేశ్‌లో ద్వితీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలని భాజపా సంకల్పిస్తే తప్పు పట్టలేం. కానీ.. అలాంటి కోరిక ఉన్నప్పుడు కేంద్రంలో రాజ్యం చేస్తున్న పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాస్తంత ఎక్కువ ప్రేమగా చూసుకోవాలి. ఎక్కువ కాదు కదా.. అర్హమైన ప్రేమను కూడా చూపించకుండా.. ఏదో పగబట్టినట్టుగా రాష్ట్ర ప్రయోజనాల పట్ల వ్యవహరిస్తూ.. అదే రాష్ట్ర ప్రజలు తమను నెత్తిన పెట్టుకుని ఆదరించాలని కోరుకునే వ్యూహం ఏమిటో అంతుచిక్కడం లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు అనే రెండు అవసరాల ముంగిట ఉంది. ఈ రెండింటి విషయంలో కేంద్రం సాయం చేయడం బాధ్యత. పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక ప్రతి పైసా వారు పెట్టాల్సిందే. రాజధానికి వారు ప్రకటించిన మొత్తంలో 1500 ఇచ్చేయగా, మరో 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా ఆ మొత్తాలను ఇచ్చి తీరాల్సిందే. అయితే ఆదర్శాలను, తమిళకన్నడ పద్యాలను ఆడంబరంగా ఉటంకిస్తూ సమర్పించిన బడ్జెట్‌లో కనీసం వాటిని ప్రస్తావించకపోవడం ఘోరం. ఏదో నాటికి ఇచ్చి తీరవలసిన మొత్తాన్ని కొంతైనా విదిలించకుండానే… ఈ రాష్ట్రంలో తాము బలపడిపోవాలని భాజపా ఎలా ఉబలాటపడుతున్నదో తెలియదు. ప్రజాబలం ఉన్న పార్టీ నాయకులు కూడా.. ప్రజల ముందుకు వెళ్లాలంటే, ఈ బడ్జెట్ పుణ్యమాని సంకోచించే దుస్థితి ఏర్పడుతోంది. పార్టీ మాత్రం ఇతర పార్టీలనుంచి నాయకులను చేర్చుకోవడం మీద మాత్రమే దృష్టి పెడుతోంది.

ప్రధాని మోడీ తాను సర్వం త్యజించిన సన్యాసిని అనే సంకేతాలు వెళ్లేలా వ్యవహరిస్తుంటారు. తనకెవ్వరూ లేరని, కనుక, తాను స్వచ్ఛమైన పాలన అందిస్తాననే సూచికలతో ప్రవర్తిస్తుంటారు. కానీ,

స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి

అని గీతా వాక్యం. ఎవడైతే దేనిమీదా ద్వేషం గానీ, దేనిమీదా కోరిక గానీ లేకుండా ఉంటాడో.. వాడే సన్యాసి అని ఈ గీతావాక్యం చెబుతుంది. ఆ పరిణతి నాయకుడైన మోడీలోగానీ, హిందూధర్మ ప్రతినిధులమని చెప్పుకునే భాజపాలో గానీ ఎక్కడుంది. ఆంధ్రప్రదేశ్‌ను ద్వేషిస్తున్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ, ఇక్కడ బలపడడం గురించి కాంక్షలు పెంచుకుంటూ ఎందుకు వారు విరుద్ధ ద్వంద్వనీతిని అనుసరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గతిలేకుండా మిగిలిన నాయకులను  చేర్చుకోవడానికే తప్ప.. రేపు ఓట్లు వేసి గెలిపించాల్సిన ప్రజల మనసులను గెలుచుకోవడానికి వారెందుకు ప్రయత్నించడం లేదు.. అనేది బోధపడడం లేదు.

Facebook Comments