ఖజానాకు లాభం:: బోణీ కొట్టిన జగన్!

47

జగన్ మోహన రెడ్డి పరిపాలన ప్రారంభం అయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు భారం పెరుగుతుందా? లాభం జరుగుతుందా? అనే మీమాంస పలువురిలో ఉంది. జగన్మోహనరెడ్డి ఎడా పెడా ఇచ్చేసిన సంక్షేమ వాగ్దానాలను అమలు చేసేందుకు భారం పెరగడం అనేది ఎటూ తప్పదు. ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే.. కాంట్రాక్టుల రద్దు, రివర్స్ టెండరింగ్ పద్ధతిలో మళ్లీ టెండర్లు పిలవడం ఇలాంటి చర్యల రూపేణా.. తాను తీసుకుంటున్న చర్యలు రాష్ట్రానికి వందల కోట్ల రూపాయల లాభం చేకూరుస్తాయని జగన్ చెబుతూ వచ్చారు.

అయితే ఇది కొత్త పద్ధతి కావడంతో ఆయన మాటలు నిజమో.. కాదో ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో.. పోలవరం ఎడమ కాలువను ప్రధాన డ్యామ్ తో అనుసంధానించే పనులకు పిలిచిన రీటెండర్లలో.. రివర్స్ టెండరింగ్ పద్ధతి సత్ఫలితాలను ఇచ్చింది. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో జగన్ సర్కారు పూర్తిచేసిన మొదటి పని ఇదే! సుమారు 300 కోట్ల రూపాయల విలువైన పని విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఏకంగా 58 కోట్లకు పైగా లాభం చేకూరింది.

రివర్స్ టెండరింగ్ పద్ధతి మనకు కొత్త కావడంతో ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుత పనుల రూపేణా ఒక టెండరు పూర్తికావడంతో అలాంటి అనుమానాలు పటాపంచలైపోయాయి. ప్రభుత్వానికి ఒనగూరే లాభం కూడా స్పష్టంగా కనిపించింది.

సాధారణంగా టెండర్లలో లోయెస్ట్ బిడ్ చేసిన వారికి పని దక్కుతుంది. కానీ రివర్స్ టెండర్లలో.. లోయెస్ట్ ఎవరో తేలిన తర్వాత.. ఆ కోట్ ను బయటపెట్టి… అంతకంటె తక్కువకు చేయడానికి మరెవరైనా సిద్ధమేనా..? అని మళ్లీ ఆన్ లైన్ లో టెండరు పాట సాగిస్తారు. ఆ రకంగా సాధ్యమైనంత తక్కువ కోట్ కు పని కేటాయించే వరకు పాట వెళుతుంది. తద్వారా ప్రభుత్వానికి లాభం జరుగుతుంది.

శుక్రవారం నాడు టెండర్లలోనూ అదే జరిగింది. టెండర్లు తెరచినప్పుడు ఒక సంస్థ 276 కోట్ల అంచనా పనికి 4.16 శాతం తక్కువకు కోట్ చేయగా.. రివర్స్ టెండర్లను పిలిచినప్పుడు.. మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థ ఏకంగా 15 శాతం తక్కువకు పనులు దక్కించుకుంది. దీని ప్రభావం ప్రభుత్వానికి 58 కోట్ల లాభం వచ్చినట్లు తేలింది. ఇదే తరహాలోనే.. పెద్ద పెద్ద పనులన్నీ రివర్స్ టెండర్లకు వెళితే గనుక.. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల లాభం చేకూరినా ఆశ్చర్యం లేదు.

Facebook Comments