ఇదంతా భక్తేనా విజయసాయీ?

126

భక్తి కూడా ఒక అవసరం. అవసరం ఉన్నప్పుడు భక్తి పుట్టుకొస్తుంది.. అవసరం లేనప్పుడు, తీరిపోయిన తర్వాత.. అదే భక్తి హఠాత్తుగా మాయం అయిపోతుంది. భక్తి వెల్లువెత్తినప్పుడు మాత్రం.. పాద నమస్కారాలు, పొర్లుదండాలు, సాష్టాంగ నమస్కారాలు… ఇలాంటివి అనేకానేకం వచ్చేస్తుంటాయి. చేతులెత్తి నమస్కారం పెడితే సరిపోయేదానికి పాదనమస్కారాలు వచ్చేసినప్పుడు.. అది భక్తేనా? లేదా, ఆ మోతాదులోని అవసరమా? అనే అనుమానం ప్రజలకు కలగక మానదు. జగన్- కేసీఆర్ తో భేటీ సందర్భంగా ప్రజలకు ఇలాంటి సందేహమే వచ్చింది.

అయన పేరు వింటే ఆంధ్రప్రదేశ్ సీఎంఓ కార్యాలయం అంతా హడలిపోతుంది. సీఎం తరువాత సీఎం అని పిలుస్తారు అతన్ని. అలాంటి వ్యక్తి పొరుగు రాష్టం సీఎం కాళ్ళు మొక్కాడు. అసలు ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది. ఎలా వచ్చింది. రాజకీయాల్లో గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం తెలుసు. ఇప్పుడు ఇది కాస్త కాళ్ళు మొక్కే వరకు వెళ్ళింది.

తెలంగాణ సీఎం కెసిఆర్ శైలి వేరు. ఎదుటివారిని మాటలతో, తన చేతలతో ఇట్టే ఆకర్షిస్తాడు. ఢిల్లీ నుండి రాష్ట్రపతి వస్తే వంగి మరీ నమస్కారం చేస్తారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ హైద్రాబాద్ వచ్చినప్పుడు సీఎం కెసిఆర్ ఆలా నమస్కారం చేసి వార్తల్లో నిలిచాడు. అలాంటి సన్నివేశమే ఇప్పుడు ఇరు రాష్ట్రల సీఎంల భేటీలో జరిగింది.

హైద్రాబాద్‌లో ఇవాళ జరిగిన సీఎంల భేటీ సందర్భంగా ఏపి సీఎం జగన్ వెంట వచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డి సీఎం కెసిఆర్ కాళ్ళు మొక్కాడు. భేటీకి వచ్చిన సీఎం జగన్ ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించడానికి వెళ్లిన కెసిఆర్ జగన్ కి శాలువా కప్పి, పూలబొకే ఇచ్చి లోపలి రండి అంటూ ఆహ్వానించారు. అయితే జగన్ వెనకాల ఉన్న విజయసాయి రెడ్డిని కెసిఆర్ గమనించలేదేమో… ప్రగతి భవన్ లోపలి వెళ్ళాక జగన్ తో మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూడగానే విజయసాయి రెడ్డి కెసిఆర్ కి నమస్కారం చేసారు అంతలోనే కెసిఆర్ పాదాలకి నమస్కారం చేస్తూ ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఇలాంటి సన్నివేశం ఏపీలో ఎక్కడ చూడలేదు అంటూ ప్రజలు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ పాదాభివందనం ఎందుకు చేసారు? విజయసాయి కి మాత్రమే తెలిసిన మతలబు అయిఉండొచ్చు.

విజయసాయి ఇలా కేసీఆర్ కాళ్లు మొక్కుతోంటే.. జగన్మోహన రెడ్డి చిరునవ్వులు చిందిస్తూ చూస్తుండడమే విశేషం.

Facebook Comments