వైకాపా సభ మరీ ఇంత ఫెయిల్యూరా?

25

సాధారణంగా అధికార పార్టీ సభలు ఫెయిల్ కావు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే వర్గాల నుంచి.. పెద్దసంఖ్యలో సభికుల్ని తరలిస్తారు గనుక.. వారికి తృణమో పణమో ముట్టజెబుతారు గనుక.. అవి ఫెయిలయ్యే అవకాశం చాలా తక్కువ. కానీ.. తాజాగా ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి మరొక మంత్రి కూడా పాల్గొన్న సభ.. సభికులు లేక వెలతెల పోయింది. ఖాళీ సభనుద్దేశించి మంత్రులు అరివీర భయంకర ప్రసంగాలు చేయాల్సి వచ్చింది. ఇలాంటి దుస్థితి నారావారిపల్లెలో లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఏర్పాటుచేసిన సభ లో వాటిల్లింది.

నారావారిపల్లె అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామం. ప్రత్యర్థుల కోటలో తమ పట్టు నిరూపించుకోవాలనే తాపత్రయం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అధికారంలోకి అనన్యమైన మెజారిటీతో వచ్చిన తర్వాత.. అలాంటి ఉబలాటం వైఎస్సార్ కాంగ్రెస్ కు పుష్కలంగా ఉండడంలో తప్పేమీ లేదు. అందుకే చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అక్కడ సభ ఏర్పాటుచేశారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి కురసాల కన్నబాబు అందులో పాల్గొన్నారు. కానీ.. ఆరంభ ప్రసంగాలు ముగిసి, అసలు ప్రసంగాలు- మంత్రుల ప్రసంగాలు మొదలయ్యేసరికి సభలో ఒక్కరు లేరు. ఎవరినైతే తోలించారో  వారంతా జారుకున్నారు. కార్యకర్తలు మాత్రం మిగిలిన ఖాళీ సభలోనే మంత్రులు మాట్లాడి ముగించారు.

సభలో మాట్లాడిన ప్రసంగాలు ముఖ్యం కాదు. అధికార పార్టీ సభకు జనం లేకపోవడమే తమాషా. చంద్రబాబునాయుడు జనాన్ని తోలించడంలో, మంది పరంగా సక్సెస్ చేయడంలో ఎన్నో ప్రమాణాలు సెట్ చేశారు. కొత్త ఆలోచనల్ని అమల్లో పెట్టారు. అవి ఫాలో అయినా.. సభకు జనం పుష్కలంగా ఉండేది. కానీ.. అందులోనూ లోకల్ లీడర్లు ఫెయిలైనట్లు ఉంది. అలాగని.. వీరు స్వచ్ఛందంగా వచ్చే సభికుల కోసం నిరీక్షించారనడానికి వీల్లేదు.

వేంకటేశ్వర, పద్మావతి యూనివర్సిటీలనుంచి మొత్తం 12 బస్సుల్లో విద్యార్థుల్ని తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి. అదొక వివాదం రేగింది. అయినా సరే.. సభలో మాత్రం జనం లేరు. సభకు తరలించేదాకా.. తప్పదు గనుక ఆగి.. ఆ తర్వాత నెమ్మదిగా పారిపోయే కేటగిరీ వారిని కాకుండా.. మళ్లీ తిరిగి బస్సుల్లో ఎక్కించి తీసుకువెళ్లే వరకు చచ్చినట్టు సభలో ఉండేవారిని మాత్రమే నమ్ముకుని ఉంటే.. చెవిరెడ్డి, తన ప్రతిష్టకోసం ఏర్పాటుచేసిన ఈ సభ ఇలా నవ్వులపాలయ్యేది కాదు.

Facebook Comments