ఇరకాటంలో అధికార గణం

76

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అధికార యంత్రాంగం ఇరకాటంలో పడుతోంది. కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం  ఇస్తున్న జీవోలపై అధికారులు హైకోర్టుకు సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నారు. తాజాగా విజిలెన్స్ కమిషనర్, కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జిఓ విడుదల కావడంపై హైకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాజధాని పరిధిలోని ప్రభుత్వ  కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఇదివరకే స్టే విధించిన సంగతి  తెలిసిందే. అయితే  చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకొని గత శుక్రవారం రాత్రి జీవో వో నెంబర్ 37 విడుదల చేస్తూ కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలించేందుకు వీలుగా భవనాలను చూడాలని ఆదేశించింది. దీనిపై పలువురు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేస్తూ అధికారులపై తీవ్ర ఆగ్రహం హైకోర్టు వ్యక్తం చేసింది.

కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జీవోలను ఎందుకు ఇస్తున్నారని నిలదీసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం మొండిగా ముందుకు పోతుండడంతో అధికారులు హైకోర్టుకు వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. రాజధాని మార్పుపై దాఖలైన పిటీషన్లు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

తమ అనుమతి లేనిదే కార్యాలయాలను తరలిస్తే అందుకు అయ్యే ఖర్చును ఆయా అధికారుల నుంచి వసూలు చేస్తామని హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో విచారణ ముగిసి తీర్పు వెలువడేంతవరకైనా ప్రభుత్వం సంయమనం పాటించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Facebook Comments