‘చాయ్‌వాలా’ లాంటిదే ‘ఉగ్రవాది’ బిరుదు!

48

కీలకమైన ఎన్నికల సమయంలో సొంత రాష్ట్రం గుజరాత్ లో మోడీ దళం ఒక విడత పోలింగులో కాస్త వెనుకబడింది. ఈలోగా.. మణిశంకర్ అయ్యర్ వారికి దేవుడిలా ఒక వరం ప్రసాదించాడు. ‘మోడీ ఎప్పటికీ ప్రధాని కాలేడు.. కావలిస్తే కాంగ్రెస్ సమావేశాల్లో చాయ్ అమ్ముకోవడానికి మేం అవకాశం ఇస్తాం’ అంటూ చాయ్‌వాలా మోడీని ఎద్దేవా చేశాడు. అంతే.. మోడీ ఆ మాటను చాలా బాగా అందిపుచ్చుకున్నారు. అవును నేను చాయ్‌వాలానే అంటూ ఆ తర్వాతి ప్రతి ఎన్నికల సభలోనూ అదే మాట మాట్లాడారు. ఆ మాటను తన ఇమేజి పెంచుకోవడానికి, తన మీద సానుభూతి పెంచుకోవడానికి ఆయన వాడుకున్నారు. అనన్య విజయం సాధించారు.

ఇప్పుడు అదే స్ట్రాటజీ రిపీట్ అవుతోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మోడీ దళంలోని ఒక ఎంపీ ‘ఉగ్రవాది’గా అభివర్ణించాడు. అతనిని మందలించితే సరిపోయేది. కాస్త నష్టనివారణ జరిగేది. మోడీ కేబినెట్‌లోని మంత్రి కూడా ఆ మాటలను సమర్థిస్తూ.. కేజ్రీవాల్ ను ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ  మాట తూలారు. ఇప్పుడు.. మరో మూడు రోజుల్లో ఢిల్లీ శాసనసభకు పోలింగ్ జరగబోతుండగా.. ఆ విమర్శను అరవింద్ కేజ్రీవాల్ తన ప్రచారంలో విచ్చలవిడిగా వాడుతున్నారు.

ఇప్పటికే ఆప్ కు జనాదరణ కనిపిస్తున్న తరుణంలో.. ఈ ‘ఉగ్రవాది’ వ్యాఖ్యలు.. గతంలో  మోడీకి ‘చాయ్‌వాలా’ ఉపయోగపడినట్లుగానే కేజ్రీకి ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.

నేను ఉగ్రవాదిని అయితే.. భాజపాకే ఓటు వేయండి అంటూ.. కేజ్రీవాల్ ఎన్నికల ప్రచార సభల్లో సవాళ్లు విసురుతున్నారు. ఆయన కూతురు కూడా.. తన తండ్రిని ఉగ్రవాదిగా అభివర్ణించడం చాలా బాధ కలిగిస్తోందంటూ చే సిన వ్యాఖ్య కూడా వైరల్ అవుతోంది. యూత్‌ను ఆమె వాదన ఆకట్టుకుంటోంది. మోడీ దళం ఏ ఉద్దేశంతో.. ఎంపీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుండా, ఉపేక్షించిందో గానీ, సదరు ‘ఉగ్రవాది’ కామెంటో ఈ ఎన్నికల్లో వారి పుట్టి ముంచిన ఆశ్చర్యం లేదు.

Facebook Comments