తెలుగు మీడియం ముష్టి వేస్తున్నారా?

96

రాష్ట్రంలో కేవలం ఇంగ్లిషు మీడియం మాత్రమే ఉండాలనే నిర్ణయం కోర్టుకెక్కింది. ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా చేస్తున్నారనే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానికి ప్రభుత్వం సంజాయిషీ చెప్పవలసి వచ్చింది. పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ హైకోర్టులో ప్రభుత్వం వివరణ ఇచ్చారు. ఒక మెట్టు దిగిన ప్రభుత్వం.. చాలా నర్మగర్భంగా తెలుగు మీడియం పాఠశాలలు కావాలని కోరితే మండలానికి ఒక పాఠశాల ఏర్పాటుచేస్తాం అని తెలిపింది. అదే సమయంలో ఉర్దూతో సహా, తమిళ, కన్నడ, ఒడియా మీడియం పాఠశాలలను ఇప్పుడున్నట్లే యథాతథంగా కొనసాగిస్తాం అనికూడా ప్రకటించారు.

మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాల అంటే.. మరీ ముష్టి వేస్తున్నట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం 676 తెలుగు మీడియం పాఠశాలలు ఏర్పాటవుతాయన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఉర్దూ మీడియంలో 701 ప్రాథమిక, 48 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం వారు తెలుగు మీడియం కోరుకునే వారికోసం దయపెడుతున్న ప్రకారం.. ఏర్పాటయ్యే పాఠశాలలు ఉర్దూ మీడియంకంటె తక్కువ సంఖ్యలోనే ఉంటాయన్నమాట. ఇదెక్కడి చోద్యం!

మనం తెలుగు రాష్ట్రంలో ఉంటున్నాం. కానీ.. మైనారిటీ భాషల కంటె దిగువకు, మరింత మైనారిటీ స్థాయికి మన భాషలో విద్య దిగజారిపోయే వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాం. ఇంగ్లిషు  మీడియం విద్యని వద్దని ఎవరూ అనడం లేదు. కానీ.. తెలుగు మీడియంను పూర్తిగా కాలరాయకుండా.. కొనసాగించడం విజ్ఞత అనిపించుకుంటుంది. తెలుగు మీడియంలో చదవాలని అనుకున్న పాపానికి… ఒక పసివాడు ఇరవై ముప్పయి కిలోమీటర్లు ప్రయాణించి మండలంలోని ఏకైక పాఠశాలకు వెళ్లే పరిస్థితి సృష్టించడం అంటే.. పిల్లలకు పూర్తిగా తెలుగు పట్ల అసహ్యం, విముఖత పెంచే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.

ఇలాంటి అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజల మేలు కోరుతున్నాం అనే మిషతో తమ నిర్ణయాలను బలవంతంగా రుద్దకూడదు.  తెలుగుమీడియంలో చదవాలా? ఇంగ్లిషు మీడియంలో చదవాలా? అనే ఎంపిక ఆప్షన్ ప్రజలకు ఉండే సామరస్య వాతావరణం ఏర్పాటుచేస్తే.. జగన్ సర్కారు ఎవ్వరూ వేలెత్తిచూపలేనంత ఘనమైన నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది.

Facebook Comments