మసీదుకు ఇప్పటికే స్థలం ఇచ్చి ఉండాల్సింది!

45

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మూడునెలల గడువు ఇచ్చింది. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగుస్తుంది. ఆ నేపథ్యంలో 15 మందితో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. 67 ఎకరాల స్థలాన్ని ఆ ట్రస్టుకు లాంఛనంగా అప్పగించడం కూడా పూర్తయింది.  కానీ ఈ దేశంలో లౌకికరాజ్యం నడుస్తున్న అభిప్రాయం ప్రజల్లో సజీవంగా ఉండాలంటే గనుక.. ఈ తంతు జరగడానికి ముందే.. మసీదుకోసం సుప్రీం కోర్టు ఇవ్వమని సూచించిన ఐదు ఎకరాల స్థలాన్ని వారికి ఇచ్చేసి ఉండాల్సింది.

రామమందిరం అనేది ఎప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకు అంశమే. వారికి ఓటు బ్యాంకు గనుక.. అది జరగకుండా ఉండాలని కోరుకోవడం కూడా సబబు కాదు. మంచో చెడో ఏది ఏమైనప్పటికీ.. ఈ విషయంలో సుప్రీం కోర్టు ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పును మెజారిటీ ముస్లిం సమాజం కూడా స్వీకరించింది. ఎలాంటి అల్లరి లేకుండా ఆ తర్వాతి ప్రక్రియకు మార్గం సుగమం అయింది.

అయితే రామమందిరంపై ఉన్న ఉత్సాహాన్ని, ముస్లింలు నిర్మించుకోవాల్సిన మసీదుపై ప్రభుత్వం చూపడం లేదేమో అనే అభిప్రాయం కలుగుతోంది. మసీదు కోసం ఐదు ఎకరాల స్థలం వారికి ఇవ్వాలనేది కోర్టు తీర్పు. తీర్పులో ఒక భాగం ప్రకారం.. ఆలయ నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటుచేసిన మోడీ సర్కారు… లేదా వారి పార్టీ ఆధ్వర్యంలోనే నడుస్తున్న యూపీ సర్కారు ముస్లింలకోసం ఈ మూడునెలల కాలంలో ఐదుఎకరాల స్థలం ఇవ్వడానికి రెండు మూడు జాగాలను ఎంపిక చేయలేకపోయారా? అనేది ప్రజల్లో ఉన్న సందేహం.

సున్నీ వక్ఫ్ బోర్డు వారు తమకు స్థలం దానంగా అవసరం లేదని తీర్పు సందర్భంలో అన్నారు. అంతమాత్రాన ప్రభుత్వం ఆ సాకుతో తమ బాధ్యత మరువకూడదు. వీలైనంత త్వరగా సరైన స్థలాలను ఎంపిక చేసి వాటిలో ఒకటి ఎంచుకోవాల్సిందిగా వారికి ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది. నిజానికి బుధవారం నాడు సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదికూడా జిల్లా కేంద్రానికి 18 కిమీ దూరంలోని ధనీపూర్ గ్రామంలో! అలా ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా, రెండు మూడుస్థలాలు చూపించి, వారిని ఎంచుకోమని ఉంటే.. కాస్త గౌరవంగా ఉండేది. రామాలయం కోసం ట్రస్ట్ ఏర్పడిన నాడు.. కేటాయింపు కాకుండా, ఇదే సమయానికి వారికి స్థలం అందజేయడం పూర్తయి ఉండేలా.. ముందే ప్రక్రియ మొదలుపెట్టి ఉండాల్సింది.

ఇప్పటికే ఈ దేశంలో ముస్లింలకు భద్రత లేకుండా పోతున్నదన్న భయాలు వ్యాపిస్తున్నాయి. కనీసం ఇలాంటి విషయాల్లో వారి మీద ప్రత్యేక ప్రేమ చూపించకపోయినా. .కోర్టు తీర్పును పద్ధతిగా అనుసరిస్తే.. వారిలో ప్రజాస్వామ్యం పట్ల, లౌకికత్వం పట్ల కొంత నమ్మకం ఏర్పడుతుంది.

Facebook Comments