జీవీఎల్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు

116

బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎదురులేని ప్రజామోదం తో ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇటీవల జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అడిగితే చంద్రబాబు కు పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పడుతుందని జీవీఎల్ హెచ్చరించడం దేనికి నిదర్శనం. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పలువురు నేతల వల్ల రాష్ట్రంలో బిజెపి బలం పుంజుకోలేక పోతోంది.
దీనికితోడు జీవీఎల్ నరసింహారావు గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీతో సంబంధం లేకుండా ఇష్టానుసారం ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పలు సందర్భాల్లో జీవీఎల్ ప్రకటనలపై రాష్ట్ర బిజెపి నేతలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా ప్రత్యేక హోదా విషయమై స్పందిస్తూ అది ముగిసిన అధ్యాయం అని జీవీఎల్ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ప్రత్యేక హోదా అడిగితే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించడం గమనార్హం.
కేంద్రం గతంలో ఇచ్చిన హామీ ప్రత్యేక హోదాను అడిగితే తాము ఏమైనా చేస్తామని జీవీఎల్ బెదిరింపు ధోరణిలో అనడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అంటే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాటం చేసినందుకు రాజకీయంగా దెబ్బ తీశామని జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వం, బిజెపి తరఫున అంగీకరిస్తున్నారా అన్నది స్పష్టం చేయాల్సి ఉంది.
అదే నిజమైతే కేంద్రంలోని బీజేపీని ఇచ్చిన హామీల గురించి ఎవరు అడిగినా రాజకీయంగా దెబ్బ తీస్తామని ఒప్పుకున్నట్లే. బిజెపి అధికార ప్రతినిధి అయిన జీవీఎల్ నరసింహారావుకు రాష్ట్రంలో ప్రజాబలం ఏపాటిదో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి తిరుగులేని ఆధిక్యతతో ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి ఆ విధంగా వ్యాఖ్యానించడం రాష్ట్ర ప్రజలను అవమానపరచడమే. అంతేకాక ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఇలాంటి ప్రకటనల వల్ల బిజెపి పరిస్థితి నానాటికీ తీసికట్టు అవుతుంది. ఇకనైనా బీజేపీ పెద్దలు నరసింహారావు కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Facebook Comments