తెలంగాణ తేనెతుట్టె కదిలించిన మోడీ!

34


ప్రధాని నరేంద్రమోడీ నోరు జారారు. కాంగ్రెస్ పార్టీని దెప్పిపొడవడానికి ఆయన అనేక అంశాలను ప్రస్తావిస్తూ తన రాజ్యసభ ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా.. తలుపులు ఎలా సభ నిర్వహించారో దేశానికంతా తెలుసు.. అని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు పెద్ద దుమారంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయకులు పలువురు.. మోడీని దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు. మోడీ అజ్ఞానానికి నిదర్శనం అని వారు తిప్పికొడుతున్నారు.
సీఏఏ బిల్లుపై ప్రతిపక్షాల ఆందోళనలు, విమర్శల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో కీలక ప్రసంగం చేశారు. విపక్షాలు దేశాన్ని మోసపూరిత ప్రకటనలతో వంచిస్తున్నాయని ఆయన నిందించారు. విపక్షాల ఆందోళనలను, ఆరోపణలను ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి లోక్ సభ తలుపులు మూసివేసి బిల్లును ఆమోదింపజేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అంటూ ఎద్దేవా చేశారు.
మోడీ ఉద్దేశ్యం… కేవలం కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడం మాత్రమే కావొచ్చు గానీ.. తెలంగాణ ఏర్పాటు బిల్లు, అనుచితమైన మార్గంలో ఆమోదం పొందిందని అర్థం వచ్చేలా ఆయన మాటలు ఉండడంతో.. తెలంగాణ నాయకులంతా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మోడీ మీద నిప్పులు కురిపిస్తున్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చింది తప్ప.. మోడీ అనుకుంటున్నట్లుగా కాదంటూ తిట్టిపోస్తున్నారు.
విభజన తర్వాత ఏపీ ఎన్నికల ప్రచారంలో.. తల్లిని చంపి, బిడ్డను కాపాడినట్లుగా తెలంగాణ ఏర్పడిందని మోడీ చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలయ్యాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో తెలంగాణ సెంటిమెంటును అవమానించే విధంగా ఆ మాటలు ఉండడంతో ఆయన మళ్లీ తేనెతుట్టెను కదిలించినట్లు అయింది.

Facebook Comments