శెభాష్ దిశ! 8 నిమిషాల్లోనే…

  60

  ఎన్ని దురాగతాలు వెలుగులోకి వస్తున్నా.. ఎన్ని కొత్త చట్టాలు తయారవుతున్నా మహిళలకు వేధింపులు మాత్రం తప్పడం లేదు. కాకపోతే కొత్తగా వస్తున్న చట్టాలకు సాంకేతికత కూడా తోడు అవుతుండడం వల్ల.. సత్వర పోలీసు స్పందన సాధ్యమవుతోంది. వేధింపులకు గురవుతున్న ఒక మహిళ దిశ యాప్ ద్వారా కంప్లయింటు చేసేసరికి.. కేవలం 8 నిమిషాల్లోనే పోలీసులు జర్నీలో ఉన్న బస్సును దొరకబుచ్చుకుని.. సదరు ఆకతాయి మీద కేసు నమోదు చేయడం అనేది విశేషం. దిశ చట్టాన్ని, పోలీసుల్ని బహుధా ప్రశంసించాల్సిన విషయం ఇది!
  ఎక్సయిజు డిపార్టుమెంటులో పనిచేసే ఓమహిళ విశాఖ నుంచి విజయవాడకు ప్రెవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కింది. వెనుకసీటులో ఆంధ్రా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బసవయ్య నాయక్ ఉన్నాడు. ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు.
  సదరు మహిళ తన మొబైల్ లోని దిశ యాప్ ద్వారా పోలీసులకు కంప్లయింటు చేసింది. కంట్రోల్ రూంలో విషయం తెలుసుకుని, ఆమె ప్రయాణిస్తున్న బస్సు వివరాలు పోలీసులు తెలుసుకున్నారు. బస్సు ఏలూరు వద్ద టోల్ గేటు చేరేలోగా.. పోలీసులు ప్రత్యక్షమయ్యారు. వేధిస్తున్న వ్యక్తిని గుర్తించి కేసు నమోదు చేశారు. ఇదంతా కేవలం 8 నిమిషాల్లో జరిగిపోయింది. యాప్ లో ఎమర్జన్సీ (ఎస్ఓఎస్) బటన్ నొక్కడం.. పోలీసులు కూడా అంతే వేగంగా స్పందించడం జరిగింది.
  చట్టాల అమలులో ప్రధానంగా దిశ వంటి నేరాల విషయంలో.. యాప్ ల ద్వారా ఇలాంటి సాంకేతిక వెసులుబాటు.. నిజంగానే ఆకతాయిలకు బుద్ధి చెప్పడమే కాదు.. ఎలాంటి నేరాలకు తెగించాలన్నా కాస్త వెనకాడేలా చేస్తే అంతకంటె కావాల్సింది ఏముంది.

  Facebook Comments