మీరు తలచుకుంటే ఆగుతుంది..

96

రాజధాని తరలింపు వ్యవహారాన్ని జగన్మోహనరెడ్డి.. ఇప్పుడు మోడీ కోర్టులోకి నెట్టారు. పూర్తిగా కాకపోయినా.. కొన్ని అంశాల్లో జగన్ అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే.. మోడీ పచ్చజెండా ఊపడం తప్పనిసరి. ఇలాంటి నేపథ్యంలో… జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వారు… అటునుంచి నరుక్కు రావడానికి తమ వంతు కృషి ప్రారంభిస్తున్నారు. ఏతావతా.. రాష్ట్రంలోని భాజపా నాయకులపై ఒత్తిడి పెరుగుతోంది.
రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలవడం, తన ఉద్దేశాలను మరోమారు విన్నవించడం తెలిసిందే. ప్రభుత్వ అజెండాలో భాగమైన మూడు రాజధానుల అంశం, ప్రధాన న్యాయమూర్తితో కూడిన హైకోర్టును కర్నూలులో ఏర్పాటు, శాసన మండలి రద్దు తదితర అంశాలను ప్రధాని ముందు ఏకరవు పెట్టారు. దానికి మోదీ నుంచి ప్రతికూల ప్రకటన, స్పందన రాకపోవడంతో వైసీపీ వర్గాలు ఆనందంలో మునిగిపోగా, ప్రతిపక్షాలైన తెదేపా, భాజపా డీలా పడిపోయాయి. అంతేకాక తమ పోరును మరింత పెంచేందుకు కసరత్తు ప్రారంభించాయి.
వాస్తవానికి జగన్ పాలనను ఆది నుంచే తెదేపాతో పాటు రాష్ట్ర భాజపా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇసుక కొరత, ఆంగ్ల మాధ్యమం, రాజధాని తరలింపు, మండలి రద్దు వంటి అంశాలపై రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. అయితే తన పంతం నెగ్గించుకునేందుకు దూకుడుగా వెళ్తున్న జగన్‌ని నిలువరించడం రాష్ట్ర నేతలకు శక్తికి మించిన పనే అవుతోంది. దీంతో జాతీయ నేతలకు విన్నవిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా గత ఏడాది బీజేపీలో చేరిన తమ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ద్వారా రాయబారాలు నెరపుతున్నారు. వారంతా తెలుగుదేశం మూలాలు కలిగిఉన్నవారే. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా ఇప్పుడు భాజపాలో ఉన్నారు. అలాంటి వారిద్వారా భాజపా కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి.. చక్రం అడ్డేయాలనేది… అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న వారి తాజా వ్యూహం.
వారంతా బీజేపీ జాతీయ అగ్ర నేతలను కలిసి ఏపీలో ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోదం లభించరాదని, ఎక్కడికక్కడ అనుమతులు దక్కకుండా చేయాలని సూచిస్తున్నట్లు సమాచారం. అమరావతి రైతులు, తెలుగుదేశం నేతలు చేస్తున్న ఒత్తిడికి రాష్ట్ర భాజపా నాయకులు తలొగ్గుతారా.. వీరు అడిగినంత మాత్రాన కేంద్ర భాజపా నాయకత్వం పట్టించుకుంటుందా.. అనేది వేచిచూడాలి.

Facebook Comments