హస్తినలో రహస్యాలున్నాయా?

98

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన అనంతరం వ్యవహరించిన తీరు తనంత తానుగా.. రాజకీయ ప్రత్యర్థులు ప్రజల్లో సందేహాలు రేకెత్తించేందుకు అవకాశమిస్తోంది. మోదీతో భేటీ సందర్భంగా చర్చించిన అంశాలను మీడియాకు వెల్లడించకపోవడం ద్వారా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడానికి ఆయన వీలు కల్పించారు. మోడీ- జగన్ మధ్య కుదిరిన రహస్య ఒప్పదాలు ఏమిటో వెల్లడించాలంటూ.. అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ రెండూ పార్టీలూ డిమాండు చేస్తున్నాయి.

జగన్ తన హస్తిన యాత్రలో… ప్రధాని నివాసంలో జగన్ గంటా 43 నిమిషాలు గడిపారు. ఆయన వెంట ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా జగన్ ప్రధానికి 11 వినతిపత్రాలు సమర్పించినట్లు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అవి వేటికి సంబంధించినవో చెబుతున్నారు గానీ.. వాటిపట్ల, ఎన్నిటికి ఎలాంటి స్పందన లభించిందనే విషయంలో స్పష్టత లేదు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ నేత సాకే శైలజానాథ్, తెదేపా నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు. సదరు రహస్య ఒప్పందాలను బయటపెట్టాలంటున్నారు. ఇలాంటి మాటల ద్వారా.. జగన్ మీద ప్రజల్లో అనేక అనుమానాలు పుట్టించడం మినహా.. వారికి వేరే లబ్ధి ఉండకపోవచ్చు.

జగన్ ఢిల్లీలో భేటీ తర్వాత.. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉంటే.. ఇలాంటి సందేహాలు అప్పుడే ప్రశ్నల రూపంలో వచ్చి ఉండేవి. ఆయన సమర్థంగా తిప్పికొట్టి ఉంటే ఇవాళ రాజకీయ ప్రత్యర్థులకు మాట్లాడే  చాన్సుండేది కాదు. ముఖ్యమంత్రికి ప్రెస్‌మీట్ పెట్టేందుకు సమయం లేకపోయినా కనీసం విమానాశ్రయంలో అయినా పది నిమిషాలు ప్రెస్‌తో చిట్‌చాట్ కార్యక్రమం ఏర్పాటుచేసి- భేటీ గురించిన వివరాలు వెల్లడించి ఉంటే.. ఇలాంటి విమర్శలకు అవకాశం ఉండేది కాదు.

ఢిల్లీ స్థాయి పర్యటనలప్పుడు సీఎం కానీ, మరో నేత కానీ పాత్రికేయులతో ముచ్చటించడం పరిపాటి. అంతేకాక తమ పర్యటన వివరాలను పంచుకోవడం ద్వారా పారదర్శకతను చాటుకున్నట్లు అవుతుంది. అలాంటివేవీ లేకుండా కేవలం పత్రికా ప్రకటన ఇవ్వడం ద్వారా సామాన్య జనం సైతం ఆలోచించుకునేలా చేస్తోంది.

Facebook Comments