తన కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి?

103

గుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లు గా ఉంది. గుంటూరు వాడే అయినందుకు అక్కడి నుంచి రాజధాని తరలిపోవడానికి ఆయన ఇష్టపడడం లేదు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న రాజకీయ పార్టీకి, రాష్ట్రస్థాయి అధ్యక్షుడు తానే అయినప్పటికీ గట్టిగా తన మనోగతాన్ని బయట పెట్టే అవకాశం లేదు, ధైర్యం లేదు. ఏదో ఉబుసుపోక, రాజధాని తరలింపును తమ పార్టీ తరఫున అడ్డుకుంటాం అని మాటలు చెబుతూనే ఉన్నారు గానీ… ఆయన చేతుల్లో ఏమీ లేకుండా పోతోంది. అందుకే ఆయన మింగలేక కక్కలేక అన్నట్లు సతమతమవుతున్నారు.
అమరావతి నుంచి రాజధాని తరలి పోవడం పట్ల, గుంటూరు వాళ్ళకి మాత్రమే వ్యతిరేకత ఉంది. పార్టీ ఏదైనా సరే గుంటూరు నాయకులు అధికార వికేంద్రీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ లో మాత్రమే సానుకూలత ఉంది. సహజంగానే గుంటూరు నేత అయిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కూడా వ్యతిరేకత ఉంది. కానీ, దోచుకోవడానికే రాజధాని తరలింపు అంటూ ప్రకటనలు చేయడం మినహా ఏమీ చేయలేక పోతున్నారు. మా పార్టీ తరఫున రాజధాని తరలింపును అడ్డుకుంటామని ప్రకటిస్తున్నారు కానీ… వాస్తవంలో పార్టీ తరఫున పోరాటాలు నడిపేంత స్థాయి ఆయనకు లేదు అనిపిస్తోంది. చిట్టచివరికి పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజధాని తరలింపునకు అనుకూలంగా, రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వపు ఇష్టానుసారమే ఉంటుందని ఎడాపెడా మాట్లాడుతుంటే నియంత్రించడం కూడా ఈ రాష్ట్ర అధ్యక్షుడికి సాధ్యం కావడం లేదు.
మరో రకంగా చూసినప్పుడు… అమరావతి నుంచి రాజధాని తరలిపోవడం అనే అంశం మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఎలాంటి పట్టింపు లేదు. అది ఎలా పోయినా వారికి అవసరం లేదు. వారికి శ్రద్ధ లేదు. తదనుగుణంగానే వారు పట్టించుకోవడం లేదు.
భారతీయ జనతా పార్టీ తరఫున తాము పోరాడుతాం… అని కన్నా లక్ష్మీనారాయణ చెపుతున్న మాటలను ప్రజలు నమ్మాలంటే… ఆయన కేంద్ర నాయకత్వం లోని ప్రముఖుల నుంచి ఆ మేరకు కనీసం ఒక ప్రకటన అయినా చేయించగలగాలి. అలాంటిది జరగకపోవచ్చు.
కన్నా లక్ష్మీనారాయణ అలాంటి హామీ ఇవ్వలేరు గానీ… అమరావతి రైతులు ఇప్పటికీ అడపాదడపా ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రతిసారీ కూడా… రాజధాని తరలింపు అడ్డుకుంటాం… విశాఖను దోచుకోవడానికే తరలింపు ఆలోచన… అనే పడికట్టు పదాలనే కన్నా వల్లిస్తున్నారు. అంతకు మించి క్రియాశీలంగా ఏమీ చేయలేకపోతున్నారు. అవును మరి… అమరావతి రైతులు తమ కష్టాలను ఆయనతో చెప్పుకోగలరు… కానీ ఆయన తన కష్టాలను, పాపం ఎవరికి చెప్పుకుంటారు?

Facebook Comments