‘శ్రీవారి వడ’ సామాన్యుడికి తెలియాలి!

183

తిరుమల తిరుపతి దేవస్థానాల వారు తాజాగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారి కల్యాణోత్సవం లడ్డూ ను కూడా బహిరంగంగా భక్తులకు విక్రయించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా కల్యాణోత్సవం చేయించిన భక్తులకు సిఫారసు ఉత్తరాలకు మాత్రమే దొరికే అవకాశం ఉన్న ‘పెద్దలడ్డూ’ ఇక మీదట లడ్డూ కౌంటర్లలో అందరికీ దొరుకుతుంది. దీనికి 200 రూపాయల ధర నిర్ణయించారు. ఇది ప్రశంసార్హమైన నిర్ణయమే. అయితే.. ఇలాంటి సంస్కరణలు మరిన్ని రావాల్సి ఉంది. ఇదే తరహా కేటగిరీలో సిఫారసు ఉత్తరాలకు మాత్రమే దొరికే అవకాశం ఉన్న ‘శ్రీవారి వడ’ సామాన్యులకు తెలియాల్సి ఉంది.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరు వేంకటగిరినాధుని ప్రసాదం అంటే.. లడ్డూ అనేది మాత్రమే అందరికీ తెలిసిన సంగతి. ఈ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు భగవదనుగ్రహంగానే భావిస్తారు. వందల వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన భక్తుడు ఒక్క లడ్డూను తన సొంత ఊరికి తీసుకువెళ్లినా.. ఆప్తులందరికీ తలా ఒక ముక్క పంచిపెట్టి.. భగవంతుని కృపను పంచినట్లుగానే భావిస్తాడు.

ఈ లడ్డూను స్వామిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఒకటి వంతున టీటీడీ ఉచితంగా అందిస్తోంది. ఆ మేరకు మంచి పని చేస్తోంది. అదనంగా లడ్డూలు కావాలంటే.. గతంలో సిఫారసు ఉత్తరాల ప్రమేయం ఉండేది. ఇప్పుడు వాటన్నింటికీ కోత పెట్టి.. యాభైరూపాయల ధర నిర్ణయించి.. అదనంగా కోరుకునే లడ్డూలు ఎన్ని కావలిస్తే అన్ని దొరికే ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవం లడ్డూ (పెద్దలడ్డూలు) మాత్రం నిన్నటిదాకా సిఫారసు ఉత్తరాలకే దొరికేవి. ఆటోమేటిగ్గా.. వాటిని పొందడానికి పైరవీకార్లను ఆశ్రయించాల్సి వచ్చేది. దండిగా దందాలు నడిచేవి. ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ.. పెద్దలడ్డూలు కూడా కౌంటర్ల ద్వారా అమ్మేస్తున్నారు.

తిరుమలేశునికి ఆగమ శాస్త్రోక్తంగా ప్రతినిత్యం కైంకర్యం చేసే ప్రసాదాల్లో లడ్డూతో పాటూ ఇంకా చాలా ఉంటాయి. అన్న ప్రసాదాలు, గురువారం మాత్రం ప్రత్యేకంగా చేసే జిలేబి వంటివి.. సదరు ప్రత్యేక ఆర్జితసేవలు చేయించే వారికి, మిరాశీ హక్కుదార్లకు మాత్రమే దక్కుతాయి. అయితే ఇప్పటికీ సిఫారసు ఉత్తరాలకు మాత్రమే వాటిలో వడ కూడా ఉంది. శ్రీవారి ప్రసాదాల్లో వడకూడా ఉంటుందని, దొరుకుతుందని దాదాపు 70-80 శాతం మంది భక్తులకు తెలియదు. దాని రూపురేఖలు, రుచి విశేషాలు ఎలా ఉంటాయో ఎరిగిన వారు తక్కువ. ఇప్పటికీ అవి సిఫారసు ఉత్తరాలకే దొరుకుతున్నాయి.

నిర్దిష్ట ఆర్జితసేవలకు మాత్రమే పరిమితమైనది కానందున వడ  ను కూడా కౌంటర్ల ద్వారా విక్రయించే ఏర్పాటు చేసినట్లయితే.. చాలా బాగుంటుంది. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత.. తెస్తున్న వరుస సంస్కరణల్లో  భాగంగా.. ఇది కూడా మరొక మంచి పని అవుతుంది.

Facebook Comments