ప్రజల మనోభావానికే కేసీఆర్ సై?

83

దేశంలో సంచలనంగా మారిన ఉమ్మడి పౌరసత్వం బిల్లు, పౌరసత్వ సవరణ చట్టాలకు మద్దతు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజల మనోభావానికే సై అంటున్నారా అంటే.. అవుననే అనిపిస్తోంది. ఈ చట్టాలు బిల్లు రూపంలో ఉండగా సమ్మతి తెలిపిన కేసీఆర్ తీరా అవి చట్టరూపంలోకి వచ్చేసరికి తూచ్ అంటున్నట్లు కనిపిస్తోంది. దీనికి వ్యక్తిగతంగా కన్నా రాజకీయ కారణాలే మెండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, తెదేపా వంటి పార్టీలు పోటీదారులుగా ఉండగా ఎంఐఎం పార్టీ మాత్రం ప్రత్యక్షంగానే కాక పరోక్షంగానూ అండగా నిలుస్తోంది. దీంతో సహజంగానే కేసీఆర్ మైనార్టీలకు అండగా నిలుస్తున్నట్లు ఆయన వైఖరి ద్వారా అర్థమవుతోంది.
కారణాలు ఏవైనా.. ఎన్ఆర్‌సీ, సీఏఏ విషయంలో దేశం రెండు వర్గాలుగా విడిపోయింది. మెజారిటీ రాష్ట్రాలు.. అందులోను అధిక శాతం ప్రజలు సమ్మతి తెలుపుతుండగా.. మైనార్టీ వర్గాల వారు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాల లోతుపాతులు తెలియక, తెలుసుకోక గందరగోళంలో చిక్కుకునే వారు ఒక వర్గం కాగా.. గుడ్డిగా అనుసరించేవారు మరో వర్గంగా కనిపిస్తోంది. దీనికి ఆయా వర్గాల, పార్టీల నేతలే ప్రధాన కారణమవుతున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో.. దేశంలో మైనార్టీలు.. ఇక్కడ మెజార్టీ వర్గం వారు ఎన్ఆర్‌సీ, సీఏఏలకు బహిరంగంగానే వ్యతిరేకత తెలుపుతున్నారు. బహిరంగ సభలు, ఆందోళనల ద్వారా తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. అదిప్పుడు తారస్థాయికి చేరింది. అసమ్మతిని సూటిగా వ్యక్తపరుస్తూ.. our doors are closed for CAA and NRC (‘మా తలుపులు ఎన్ఆర్‌సీ, సీఏఏ సమాచార సేకరణకు తెరవబడవు’) అనే వాక్యాలు తమ గుమ్మాలకు ముద్రించుకున్నారు. ఇది లోగడ గ్రామాల్లో ప్రచారం అయిన ‘ఓస్త్రీ రేపురా’ ఉదంతాన్ని గుర్తుకు తెస్తోంది.
ఇదిలా ఉడగా.. మారుతున్న పరిస్థితులు, రాజకీయ సమీకరణల కారణంగా ఎన్ఆర్‌సీ, సీఏఏ చట్టాలకు రాజకీయ నేతల మద్దతు మారిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే.. గతంలో గళం విప్పని పవన్ కళ్యాణ్ నేడు బాహాటంగా మద్దతు తెలుపుతుండగా.. తొలుత సమ్మతి తెలిపిన కేసీఆర్ మైనారిటీల అండ కోసం.. ఎన్ఆర్‌సీ, సీఏఏ చట్టాలకు పరోక్షంగా నిలుస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Facebook Comments