న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు త‌థ్యం!

41

అమ‌రావ‌తి ప్రాంతాన్ని జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం రాజ‌ధానిగా గుర్తించ‌డం లేదు. దాదాపు 55 వేల ఎక‌రాల‌ను పాత ప్ర‌భుత్వం చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో సేక‌రిస్తే.. ఆ ప్రాంతాన్ని రాజ‌ధానిగా కాద‌నుకొని విశాఖ‌కు త‌ర‌లించడానికి వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆ ప్ర‌య‌త్నాలు ఎలా సాగుతున్న‌ప్ప‌టికీ వాటికి సంబంధించిన న్యాయప‌ర‌మైన చిక్కులు ఎలా వ‌స్తున్న‌ప్ప‌టికీ.. రైతులు ఇచ్చిన స్థ‌లంలో సుమారు 1250 ఎక‌రాల్ని ఇవాళ పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించ‌డానికి ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేసింది. అయితే ఈ జీవోకు కూడా న్యాయ‌ప‌రంగా ముందుముందు చాలా చిక్కులు ఎదుర‌య్యే అవ‌కాశముంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.
అమ‌రావ‌తి ప్రాంతంలో రాజ‌ధాని ఉంటుంది అనే ఉద్దేశంతోనే.. రాజ‌ధాని నిర్మిస్తార‌నే ఆలోచ‌న‌తోనే అక్క‌డి రైతులంతా త‌మ భూముల‌ను ప్ర‌భుత్వానికి అప్ప‌గించారు. అక్క‌డ రాజ‌ధాని ఉండ‌క‌పోగా ఆ స్థ‌లాల‌ను ప్ర‌భుత్వం త‌మ సొంత స్థ‌లాల్లాగా తిరిగి పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల కోసం కేటాయించ‌డ‌మ‌నేది వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఒక‌వైపు దీనిమీద‌ న్యాయ ప‌రంగా పోరాడుతామంటూ ఇప్ప‌టికే హెచ్చ‌రిస్తున్నారు. ఈ విష‌యంలో దేవివేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అధికారికంగా ప్ర‌క‌ట‌న కూడా చేశారు. తెలుగుదేశం ద‌ళాల త‌ర‌పున కీల‌కంగా న్యాయ‌వాదుల‌ను సంప్ర‌దిస్తున్న‌ట్టు కూడా తెలుస్తోంది. నేడో రేపో పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల కేటాయింపుపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.
పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వ‌డానికి పూనుకుంటే తెలుగుదేశం పార్టీ కుట్ర‌లు చేసి చిక్కులు సృష్టించి అడ్డుకుంటున్న‌ది అని బుర‌ద జ‌ల్ల‌డానికి త‌ప్ప ఈ జీవో మ‌రొకందుకు ప‌నికొచ్చే అవ‌కాశం లేదు. ఎందుకంటే ఈ జీవోలో CRDA చ‌ట్టాన్ని ఆధారం చేసుకొని అందులో ఉండే 53D అనే నిబంధ‌న ఆధారం చేసుకొని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కారు పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయిస్తూ.. ఆదేశాలు ఇచ్చింది. అందులో ఉన్న‌దేంటంటే.. CRDA సేక‌రించిన భూమిలో 5 శాతం భూమిని పేద‌ల‌కి అందుబాటులో ఉండే త‌క్కువ ధ‌ర‌కి ఇళ్ల స్థ‌లాల కోసం కేటాయించ‌వ‌చ్చు అనే అంశం ఉంది. ఆ అంశాన్ని వాడుకుంటూ పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇస్తున్న‌ట్లుగా జీవో చేశారు. నిజానికి CRDA ఏదైతే చేయాలో అదేమీ చేయ‌కుండానే 5 శాతం భూముల్ని పేద‌ల‌కు ఇచ్చే నిబంధ‌న ఉంది గ‌నుక ఈ భూముల్ని పేద‌ల‌కు ఇచ్చేస్తాం అనేది న్యాయ‌ప‌రంగా కోర్టు ఎదుట నిల‌బ‌డే అవ‌కాశం లేదు. దీనికి సంబంధించిన లీగ‌ల్ మార్గాల‌ను తెలుగుదేశం పార్టీ అన్వేషిస్తోంది. పేద‌ల‌కు ఇళ్ల‌స్థ‌లాలు ఇవ్వ‌డ‌మ‌నేది సుమారు 55 వేల మంది పేద‌ల‌కు ఈ జీవో ద్వారా జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి స‌ర్కారు ఇళ్ల స్థ‌లాలుగా కేటాయించింది. ఒకొక్క‌రికి కేవ‌లం ఒక్కో సెంటు మాత్ర‌మే ఇస్తూ.. కేటాయింపులు చేశారు. అయితే ఈ జీవోతో వాళ్ల‌కు ఇళ్లు వ‌చ్చిన‌ట్లు అనుకోవడానికి వీల్లేదు. ఇది క‌చ్చితంగా న్యాయ‌ప‌రంగా కోర్టులో ఇబ్బంది ప‌డే అవ‌కాశ‌ముంది. కోర్టు ఏ సంగ‌తి తెలిస్తే త‌ప్ప జీవో తాలూకు ఫ‌లితాలు పేద‌ల‌కు అందే అవ‌కాశం లేద‌ని చాలా మంది భావిస్తున్నారు.

Facebook Comments