మోడీ వైరాగ్యం.. నిషేధ సంకేతం!!

145

దేశంలో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు ఫేస్బుక్, టిక్టాక్ వంటి సామాజిక మాధ్యమాలపై సుప్రీం కోర్టులో కేసు వేశారు. సామాజిక మాధ్యమాల కారణంగా ప్రజల్లో వైషమ్యాలు పెరగడంతోపాటు నేరాల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ కేసులు వేసారు. సమాజంలో అశాంతిని సృష్టిస్తున్న సామాజిక మాధ్యమాలను నిషేధించాలని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై కేంద్రంతో సహా పలువురికి నోటీసులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే ఆదివారం నుంచి సామాజిక మాధ్యమాలను వీడనున్నట్లు  ట్విట్టర్ లో  పేర్కొన్నారు.

ప్రస్తుతానికి నరేంద్రమోడీ.. ప్రతి ఆదివారం మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా.. ఆయన మరో ట్వీట్ కూడా చేశారు. అంటే మిగిలిన ఆరు రోజులూ యథాతథంగా సోషల్ వేదికల మీద చెలరేగుతూనే ఉంటారన్నమాట. అయినప్పటికీ కూడా ఆయన ఈ ప్రయత్నం సోషల్ మీడియా పై నిషేధం లేదా నియంత్రణకు దేశాన్ని సిద్ధం చేస్తున్న ప్రయత్నమే అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

ప్రధాని మోదీ నుంచి ఈ ట్వీట్ రాగానే రాహుల్ గాంధీ స్పందిస్తూ విద్వేషాన్ని వీడాలని, సామాజిక మాధ్యమాలను కాదంటూ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీ శశి ధరూర్ మాత్రం అంతే సంచలన ట్వీట్ చేశారు. త్వరలో సామాజిక మాధ్యమాలను నిషేధించే అవకాశం ఉందని, అందుకే ప్రధాని మోదీ ముందుగానే సామాజిక మాధ్యమాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. ప్రపంచంలో ట్విట్టర్ లో ఐదు కోట్ల మంది ఫాలోవర్లు కలిగిన మూడో నేత నరేంద్ర మోడీ. ఆయనను ట్విట్టర్లో 5.33 కోట్ల మంది, ఫేస్ బుక్ లో 4.41 కోట్ల మంది, ఇంస్టాగ్రామ్ లో 3.52 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. సుప్రీంలో కేసు ఏమవుతుందో, ఏమోగానీ ప్రధాని నిర్ణయంతో సామాజిక మాధ్యమాలపై నిషేధం రాబోతున్నట్టు ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

కేవలం థరూర్ విమర్శ చేసినందుకే అనలేం గానీ.. మోడీ ప్రభుత్వం ఇటీలి కాలంలో అనుసరిస్తున్న ధోరణలను గమనిస్తే.. ఇలాగే అనిపిస్తోంది.

Facebook Comments