జన గణన తర్వాతే  నియోజకవర్గాల పెంపు

61

రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరుగుదల జనగణన తర్వాతే ఉంటుందని స్పష్టమవుతోంది. ఇందుకు కనీసం మరో మూడేళ్లు వ్యవధి పట్టే ఆకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ  నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. అయితే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ గత ఆరేళ్లుగా ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది.

ఈ విషయమై తెలుగు రాష్ట్రాల లోని అన్ని రాజకీయ పార్టీలు వివిధ సందర్భాలలో నియోజకవర్గాల పెంపు పై కేంద్రాన్ని కోరుతూ వచ్చాయి. అయితే  నియోజక వర్గాల పెంపు అంశాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఇటీవల ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఈ విషయమై తీసుకు వెళ్లినట్లు తెలియవచ్చింది. దీంతో నియోజకవర్గాల సంఖ్య పెంపుపై న్యాయశాఖ దృష్టి పెట్టింది.

మరో రెండు నెలల్లో జనగణన మొదలు కానుంది. ఈ ప్రక్రియ దాదాపు ఏడాది పాటు రెండు విడతలుగా జరుగుతుంది. అంటే 2021చివరి నాటికి జనాభా లెక్కలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించి వాటి సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకో నున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా 225కు, తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా 175 కు పెరుగుతాయి.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి వీటి సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే 2026 లో లోక్ సభ  నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న వాదన లేకపోలేదు.

Facebook Comments