కరోనా పై జగన్ ప్రభుత్వం అలెర్ట్

80

కరోనా వైరస్ వ్యాప్తి పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ సోకిన రోగుల కోసం అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో ఒక వ్యక్తి కి కరోనా పాజిటివ్ రావడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ విషయమై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సమీక్ష చేశారు. హైదరాబాదు నుంచి మన రాష్ట్రానికి రాకపోకలు అధికంగా ఉంటున్న కారణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జగన్ స్పష్టం చేశారు.
వ్యాధి లక్షణాల పై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా వ్యాధి లక్షణాలు ప్రచారం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి వైద్యులను సంప్రదిస్తారు. ముందు జాగ్రత్తగా అవసరమైన మందులతో పాటు బాడీ మాస్క్, మౌత్ మాస్క్ లను సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ప్రధాన ఆసుపత్రులలో ప్రత్యేక వార్డు లను ఏర్పాటుచేసి, రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఎప్పటికప్పుడు తగిన చర్యలను యుద్ధప్రాతిపదికన తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. దీనిపై వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లకు, వైద్య అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

Facebook Comments