పెట్టుబడులు వస్తేనే ఈ త్యాగానికి ఫలితం!

92

వైఎస్ జగన్మోహన రెడ్డి త్యాగం చేసేశారని ఇప్పుడు ఆ పార్టీ వాళ్లంతా చెప్పుకుంటున్నారు. నిజమే కావొచ్చు… రాజ్యసభ ఎంపీ టికెట్లకు పార్టీకోసం పనిచేసిన సీనియర్లు, తెరవెనుక రాజకీయాలు నడిపే ప్రముఖులు, ప్రజల్లోంచి నేరుగా గెలవలేకపోయినా.. పార్టీకోసం అహరహమూ శ్రమిస్తూ ఉండే వారి నుంచి చాలా పోటీ ఉంటుంది. ప్రతి పార్టీకి కూడా అలాంటి వారు అనేకులు ఉంటారు. అలాంటి వారి సేవలకు పార్టీ అందించగల అత్యున్నత పదవి.. రాజ్యసభ ఎంపీ పదవి మాత్రమే. అలాంటి నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీ.. తమ పార్టీకి వచ్చే నాలుగు ఎంపీ సీట్లలో  ఒక దానిని.. తమ పార్టీతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తికి కేటాయించడం అంటే ఒక రకంగా త్యాగమేనని ఒప్పుకోవచ్చు. కానీ.. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ముఖేష్ అంబానీ సన్నిహితుడిగా గుర్తించి.. రిలయన్స్ వంటి అతిపెద్ద వ్యాపారసామ్రాజ్య ప్రతినిధిగా గుర్తించి.. పరిమల్ నత్వానీకి ఎంపీ పదవి కట్టబెట్టినందుకు రాష్ట్రానికి పెట్టుబడులు పుష్కలంగా వచ్చినప్పుడు మాత్రమే… ప్రజలు దానిని త్యాగంగా పరిగణించాలి. ఆ విషయాన్ని జగన్ గానీ, ఆయన అభిమాన గణం గానీ గమనంలో ఉంచుకోవాలి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రాజ్యసభలో ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పుష్కలంగా సీట్లు దక్కడంతో.. ఈసారి రాష్ట్రానికి దక్కిన నాలుగు ఎంపీ స్థానాలూ వారి వశమే అయ్యాయి. 2014 ఎన్నికలకు పూర్వంనుంచి ఆర్థికంగా పార్టీకి అండదండగా ఉంటూ వస్తున్న, 2014 ఎన్నికల్లో  నరసరావు పేట నుంచి పోటీచేసి ఓడిపోయిన, 2019 ఎన్నికల్లో కీలక ఆర్థిక వనరుగా, వ్యూహకర్తగా పార్టీకి తోడ్పాటు అందించిన రాంకీ గ్రూపు అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కి తొలి టికెట్ ను జగన్ కేటాయించారు.

తను సబబేనని నమ్మిన విషయాల్లో, ఇక పునరాలోచనకు, సమీకరణాలకు అవకాశం ఇవ్వకుండా సూటిగా వెళ్లిపోయే జగన్.. ఈసారి కూడా రాజ్యసభ ఎంపీల ఎంపిక విషయంలో సమీకరణలను పట్టించుకోలేదు. ఒకటి అయోధ్య రామిరెడ్డికి ఇచ్చిన తర్వాత.. మండలి రద్దు నిర్ణయం వలన మంత్రిపదవులు కోల్పోయే తన కేబినెట్ సహచరులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు అవకాశం ఇచ్చారు.

తన తండ్రి ధీరూభాయ్ అంబానీ కలలను సాకారం చేసుకోవడం నుంచి తమతో కలిసి ప్రస్థానం సాగిస్తున్న పరిమల్ నత్వానీ, ముఖేష్ అంబానీకి అత్యంత ఆప్తుల్లో ఒకరు. ఆయన ఇప్పటికే రెండు పర్యాయాలు జార్ఖండ్ నుంచి ఇండిపెండెంట్ గా రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఆయనను ఈసారి మూడోసారి ఎంపీ చేయడానికి అంబానీ స్వయంగా వచ్చి జగన్ ను అడిగారు. జగన్ కూడా అందుకు అంగీకరించారు. వైకాపా తరఫున నాలుగో ఎంపీగా నత్వానీ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల పరంగా రిలయన్స్ బారీగా చేయూత అందిస్తుందనే ఆశలు బలపడుతున్నాయి. జగన్ కు కృతజ్ఞతలు చెప్పిన నత్వానీ కూడా అదే హామీ ఇచ్చారు. జగన్ ఒక ఎంపీ సీటును వదులుకున్న త్యాగాన్ని గుర్తించిన ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఆశలు పెంచుకుంటున్నారు. వారు అనుకుంటున్నట్లుగా కొత్తగా నత్వానీ ప్రభావంతో.. రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తేనే.. జగన్ ఒక ఎంపీ సీటును త్యాగం చేసినందుకు ఫలం దక్కినట్లుగా మనం అనుకోవాలి.

 

Facebook Comments