వాయిదా : ఎపిసోడ్ డైరక్షన్ ఫ్రం ఢిల్లీ!

60

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఈ నిర్ణయం వలన ఎవరికి లాభం.. ఎవరికి నష్టం… కేవలం వాయిదా వలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఉండే విజయావకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోతాయా? అనేదంతా చాలా పెద్ద చర్చ. పైగా ఎవ్వరూ ఏమీ నిందించలేని రీతిలో కరోనా వైరస్ మీద నెపం నెట్టేసి ఈసీ ఈ ఎన్నికలను వాయిదా వేశారు. సామాజిక వర్గం ఒకటే గనుక.. ఇదంతా చంద్రబాబునాయుడు డైరక్షన్ ప్రకారం నడిచిన ఎపిసోడ్ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. కానీ అమరావతి వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఈ ఎపిసోడ్ డైరక్షన్ మొత్తం ఢిల్లీ నుంచే నడిచినదని తెలుస్తోంది.

తన మీద పడుతున్న నిందలకు కౌంటర్ ఇవ్వడంలో భాగంగా చంద్రబాబునాయుడు… చాలా పాట్లు పడ్డారు. కులాన్ని కాదనలేరు గనుక.. సామాజికవర్గాన్ని దాచిపెట్టలేరు గనుక..  నిమ్మగడ్డ తన వర్గం కాదని ఆయన చాటుకున్నారు. తను వేరే ప్రతిపాదించినా కూడా.. అప్పటి గవర్నరు నిమ్మగడ్డను నియమించినట్లు చెప్పుకున్నారు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి  ఇటీవలి ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని, ప్రస్తుతం ఆ పార్టీనుంచి నాయకులు జారిపోతున్న పరిణామాల్ని.. గమనిస్తూ.. చంద్రబాబు అందివ్వగల భరోసాను చూసి.. ఏ అధికారి అయినా సాహసోపేత నిర్ణయం తీసుకుంటారని అనుకోవడం భ్రమ. చంద్రబాబుకే భవిష్యత్తు ఉంటుందో లేదో అని అంతా అనుమానిస్తున్న తరుణంలో అధికార్లు.. ఆయన చెప్పారు గనుక.. దూకుడుగా ఎన్నికల వాయిదా వంటి నిర్ణయాలు తీసుకుంటారని అనుకోవడం సరైంది కాదనే విశ్లేషణ వినిపిస్తోంది.

ఆ కోణంలోంచి చూసినప్పుడు భాజపా ఎంపీలు లేఖలు రాయడం తర్వాత.. ఇలాంటి నిర్ణయం వచ్చిన నేపథ్యంలో.. వాయిదాకు సంబంధించిన ఎపిసోడ్ డైరక్షన్ ఢిల్లీ పెద్దలనుంచే జరిగినదా అనే సందేహాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి.

సుమారు అయిదు వేల కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంనుంచి పొందవలసిన నిధులను కోల్పోతుంది. ఇది మరీ భయపెట్టే అంశం కాకపోవచ్చు. ఎందుకంటే.. ఎన్నికల ప్రక్రియ మొత్తం మొదలైంది గనుక.. కేవలం కరోనా వల్ల మాత్రమే వాయిదా పడింది గనుక.. నిధులను వెనక్కు తీసుకోవద్దని కేంద్రాన్ని వేడుకుని ఆ నిధులను తెచ్చుకోగలిగే అవకాశం ఉంది. అయితే.. ఈసీ ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆగ్రహం తెప్పించే, పైగా నష్టం చేయలేని నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక ఉన్న పెద్దలెవ్వరనేదే చర్చనీయాంశంగా ఉంది.

Facebook Comments