అరశతాబ్దం దాటిన ప్రస్థానం..
నైతిక, పాత్రికేయ విలువలకు దర్పణం.. ‘ఆదర్శిని’
చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు. సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం. ఈ వెబ్‌సైట్లోని విశ్లేషణల ద్వారా ప్రతిపాదించే ప్రతి అభిప్రాయమూ సార్వజనీనమైనది కాకపోవచ్చు. కానీ.. ఆ దృష్టిలో కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉన్నదే అయిఉంటుంది.
ఆదర్శిని వెబ్ సైట్ లో వ్యాసకర్తలు/ రచయితలు/ కాలమిస్టులు వెలువరించే అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతం. ఆ అభిప్రాయాలను ఆదర్శిని వెబ్‌సైట్ భావజాలంగా పరిగణించడానికి వీల్లేదు.
వర్తమానంలో.. మీడియా సంస్థలు పార్టీలకు కులాలకు ముడిపడి వార్తలను చూసే దృష్టిని సంకుచితం చేసేశాయి. ఇలాంటి సందర్భంలో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా.. సమకాలీన విషయాల మీద సీనియర్ పాత్రికేయుల దృక్కోణానికి ‘ఏది అనిపిస్తే’ అది.. స్వచ్ఛంగా నిజాయితీగా పాఠకులకు తెలియజెప్పడం మా లక్ష్యం.
అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు adarsini.com తన వంతు ప్రయత్నిస్తుంది. ఆదర్శిని వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది.
ఎవరైనా వ్యాసాలను.. editor.adarsini@gmail.com చిరునామాకు పంపవచ్చు. తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న, విద్వేషాల వ్యాప్తి లక్ష్యం కానటువంటి ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.
నిష్పాక్షికంగా ఉన్నంత వరకు.. అలాంటి విశ్లేషణలను కోరుకునే పాఠకలోకానికి చేరువ కాగలం అనేది నమ్మకం. ప్రోత్సహించండి. ఈ వెబ్‌సైట్ లోని వార్తలు, కథనాలు మీకు నచ్చితే.. వార్త లింక్ ను మీ పరిచయస్తులకు కూడా ఫార్వర్డ్ చేయండి. తెలియజెప్పండి. సోషల్ మీడియా ద్వారా వార్తాకథనాలు పదిమందికీ తెలిసేందుకు సహకరించండి.
ఆదర్శిని వారపత్రిక 1970 లో రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇండియా వారి ధ్రువీకరణ పొందిన చిన్నపత్రిక. (RNI No. 20927/1970) సుమారు యాభయ్యేళ్లపాటు నిరంతరంగా ప్రచురణ సాగింది. ఆధునిక సాంకేతికతను కూడా అందిపుచ్చుకునే నేపథ్యంలో వారపత్రికగా ప్రచురణతో పాటు, 2005 లో adarsini.com వెబ్ సైట్ ఆవిర్భవించింది. నిర్వహణలో తలెత్తిన సాంకేతిక ఇబ్బందుల కారణంగా, 2018లో రీరిజిస్టర్ అయిన adarsini.com అప్పటినుంచి నిరంతరాయంగా నడుస్తోంది. కరోనా అనంతర పరిణామాల్లో ముద్రణ మాధ్యమంలో వారపత్రికగా వెలువడడం పూర్తిగా ఆగి, వెబ్ సైట్ మాత్రమే పబ్లిష్ అవుతోంది.
ప్రస్తుతం ఉన్న వెబ్ సైట్ లలో పారదర్శకతకు పెద్దపీట వేస్తుంది ఆదర్శిని. నిరాధార చవకబారు కథనాలతో పాఠకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయదు. Contact Us పేజీలో.. రెండు తెలుగు రాష్ట్రాలలోని కార్యాలయాల చిరునామాలను గూగుల్ మ్యాప్స్ తో సహా ఇస్తున్న వెబ్ సైట్ ఇదొక్కటే కావడం గమనార్హం.
ఎల్లయ్య మానసపుత్రిక…
పూర్వ చిత్తూరు జిల్లా కోవనూరు గ్రామానికి చెందిన ఆరంబాకం ఎల్లయ్య.. జర్నలిజం మీద ఉన్న అనల్పమైన ఆసక్తితో 1970లో స్థాపించినదే ‘ఆదర్శిని’ వారపత్రిక. తన తుదిశ్వాస వరకు ప్రతిబుధవారం పత్రిక వెలువరించడాన్ని అసిధారా వ్రతంలాగా కొనసాగించిన విలువలున్న పాత్రికేయుడు ఎల్లయ్య. తాను స్థాపించిన పత్రికనే తన అస్తిత్వంగా మార్చుకుని, ‘ఆదర్శిని ఎల్లయ్య’గా గుర్తింపు పొందారు. 2000 జనవరి 23న ఎల్లయ్య హఠాన్మరణం తర్వాత.. ఆయన భార్య భారతమ్మ పత్రిక నిర్వహణను చూశారు. ప్రస్తుతం ఆదర్శిని వెబ్ రూపంలో (adarsini.com) వస్తోంది. ఆయన కుమారుడు మునిసురేష్ పిళ్లె సంపాదకుడిగా బాధ్యతలు చూస్తున్నారు.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు
.