ఎప్పటిలాగానే హైద్రాబాదు నగరంలోని బాలాపూర్ గణేష్ మరొక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం నాడు నిమజ్జనం సందర్భంగా వేలానికి పెట్టిన బాలాపూర్ గణేష్ లడ్డు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా 18.9 లక్షల రూపాయల ధరకు అమ్ముడైంది.
ఒకవైపు కరోనా కారణంగా.. వినాయక నిమజ్జనం ఉత్సవాల మీద, ఆ సందర్భంగా జరిగే అట్టహాసం, ఆర్భాటం మీద బోలెడు ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఎంతో ప్రతిష్టాత్మకమైన బాాలాపూర్ లడ్డూ వేలం మాత్రం అన్ని జాగ్రత్తల మధ్య జరిగింది. మర్రి శశాంక్ రెడ్డి అనే భక్తుడు వేలంలో ఈ లడ్డూను దక్కించుకున్నాడు.
గణేష్ ఉత్సవాలకు ఎంతో ప్రసిద్ధి గాంచిన జంటనగరాల్లోనే బాలాపూర్ లడ్డూ వేలానికి ఎంతో విలువ ఉంది. ప్రతి ఏటా లడ్డూ వేలం సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది వేలంలో మొత్తం 19 మంది భక్తులు పాల్గొన్నారు. 1116 రూపాయలతో వేలం ప్రారంభించారు. చివరికి మర్రి శశాంక్ రెడ్డి 18.9 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు.
బాలాపూర్ లడ్డూ వేలం అనేది 24 ఏళ్ల కిందట ప్రారంభం అయింది. తొలిసారి లడ్డూను వేలం వేసినప్పుడు.. అత్యధికంగా 450 రూపాయలకు పాడుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా చాలా ప్రతిష్టాత్మకంగా లడ్డూ వేలం నిర్వహిస్తుంటారు.
ఏటా ఈ లడ్డూ వేలం అనేది లక్షల రూపాయలలోకి చేరుకుంది. గత ఏడాది కరోనా కారణంగా.. వినాయక ఉత్సవాలే చాలా సింపుల్ గా జరిగాయి. బాలాపూర్ గణేశ్ లడ్డూకు కూడా వేలం నిర్వహించలేదు. అయితే 17లక్షల కంటె ఎక్కువ మొత్తానికి ఒక భక్తుడు కొనుగోలు చేశారు. వేలం జరిగినా కూడా ఇంచుమించుగా అంతే మొత్తం వచ్చేది. అలాంటిది ఈసారి జరిగిన వేలంలో.. శశాంక్ రెడ్డి.. 18.9 లక్షలకు పాట పాడి, 19 మంది పాటదారుల్లో తాను లడ్డూను దక్కించుకున్నాడు.
గణేశ్ లడ్డూను వేలంలో దక్కించుకోవడం అనేది అందరూ ఎంతో శుభకరంగా భావిస్తారు. లడ్డూ తమ ఇంటికి రావడం అనేది.. అన్ని శుభాలను కలగజేస్తుందని, వ్యక్తిగత వ్యాపార జీవితాల్లో మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. లడ్డూ పాట పాడిన వారు… సాధారణంగా ఆ ప్రసాదానికి ప్రత్యేకపూజలు నిర్వహించి.. గణేశుడి భక్తులందరికీ పంచిపెడతారు.
.