కాపులను బీసీలుగా గుర్తించడం ఒక్కటే జీవిత లక్ష్యంగా, దానిని సాధించడం కోసమే జీవిస్తున్నట్టుగా వ్యవహరించిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. వివిధ పార్టీలతో అనుబంధం కలిగిఉండి, అన్నింటినీ వదిలేసుకుని కేవలం కాపుల కోసం ఆయన ఇటీవలి కాలంలో తన పోరాటాలను పరిమితంచేసుకున్నారు. అలాంటి ముద్రగడ పద్మనాభానికి కాపు వర్గాల్లో గౌరవం దక్కడం విశేషం కాదు. కానీ ఇప్పుడు ఆయన ఒక పార్టీ పంచన చేరుతున్నారు. తద్వారా క్రెడిబిలిటీని కోల్పోయే ప్రమాదం ఉంది.
ముద్రగడ పద్మనాభం.. ఇన్నాళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకోవడమే సరైన నిర్ణయంగా అనిపించదు. ఒక ఉద్యమంతో తనను ముడిపెట్టుకున్న వ్యక్తి.. ఆ ఉద్యమ లక్ష్యానికి ఎలాంటి భరోసా ఇవ్వని పార్టీతో ఎలా కలుస్తారు? ఉద్యమనేతగా ఆయనను నమ్మిన వారికి ఏం సమాధానం చెబుతారు? ఇవన్నీ కూడా ప్రశ్నలే.
కానీ ముద్రగడ పద్మనాభం ఇప్పుడు కాపు జాతి గురించి, కాపులను బీసీల్లో చేర్చాలనే ఆయన పరమలక్ష్యం గురించి ఆలోచిస్తున్నట్టుగా లేదు. పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని మాత్రమే కాంక్షిస్తున్నట్లున్నారు. అందుకే ఆయన జగన్ ను మళ్లీ గెలిపించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. వేలమంది కాపులతో తాడేపల్లికి తరలి వెళ్తే జగన్ కు భద్రత పరంగా ఇబ్బంది అవుతుందనే భయంతో తన వెయ్యి కార్ల ర్యాలీని కూడా రద్దుచేసుకుని, ఒంటరిగా వెళ్లి చేరాలనే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇది కూడా ఆయన దృష్టిలో మారుతున్న ప్రాధాన్యాలను నిరూపించేలా ఉంది.
జగన్ మళ్లీ గెలిచిన తర్వాత.. తనకు ఏ పదవి ఇస్తే అది తీసుకుంటానని ఆయన చేరక ముందే చెప్పేశారు. తద్వారా తనకు పదవి మీద కాంక్ష ఉన్నదని కూడా స్పష్టం చేశారు. ఒక పదవి కోసం జగన్ ను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఆయన తనను నమ్మిన కాపులందరికీ ఏం సమాధానం చెప్పగలరు? వారి నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోగలరు.
ఎంతో సీనియర్ అయిన ముద్రగడ పద్మనాభానికి అందుకు తగిన మార్గాలు తెలియకుండా ఉండవు. కాపు వర్గం ఇన్నాళ్లు అభిమానించింది గనుకనే, నమ్మింది గనుకనే ఆయనను ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ ఆహ్వానించి తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఆయన ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే.. ఆ పార్టీలో ఆయనకు ఏమాత్రం విలువ ఉండదని తెలుసుకోవాలి.
Discussion about this post