టైం ట్రావెల్ ప్రధానాంశంగా గతంలో కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆదిత్య 369, ఇటీవల వచ్చిన బింబిసార సినిమాలు అందులో ముఖ్యమైనవి. ‘ఒకే ఒక జీవితం’ కూడా ఆ తరహా సినిమానే!
కథ విషయానికి వస్తే
హీరో ఆది (శర్వానంద్) సంగీతంలో కృషి చేస్తున్నా అనుకున్నంత పేరు రాదు. తల్లి లేని లోటు బాధపెడుతూ వుంటుంది. బాల్యమిత్రులు చైతన్య, శ్రీను కూడా జీవితం లో స్ట్రగుల్ అవుతుంటారు.
వీరికి పాల్ అనే క్వాంటమ్ ఫిజిసిస్ట్ పరిచయం అవుతాడు. పాల్, అతని మిత్రుడు టైంమెషీన్‌ను డెవలప్ చేస్తారు. దాని సాయంతో అది అతని మిత్రులు బాల్యంలో కి వెళతారు. టైం ట్రావెల్ ను రెండురకాలుగా వాడుకుంటూ రాసుకున్న కథ. ఇప్పటి నుంచి ఇరవై ఏళ్ళు వెనక్కి ఆది వాళ్ళు వెళితే, ఆ పిల్లలు ఇరవై ఏళ్లు ముందుకు వస్తారు. ఆ తర్వాత ఏమి అయింది అనేది ఆసక్తిగా సాగుతుంది.
సాంకేతికంగా..
ప్రధమ భాగం, ద్వితీయ భాగం లో చాలా వరకు ఈ సినిమాను ఓపికగా చూడాలి. లాజిక్ గా అనిపించకపోవడం కూడా దీనికి కొంత కారణం. అయితే ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రాణం పోసింది.
దర్శకుడు శ్రీ కార్తిక్ ప్రేక్షకులకు మంచి పే ఆఫ్ ఇచ్చాడు.
“గతాన్ని మార్చలేం- గతం తాలూకు చెడ్డ ప్రభావాన్ని నుంచి బయట పడవచ్చు” అనే సందేశం ఈ సినిమాలో చక్కగా చెప్పాడు దర్శకుడు. కథ బాగా రాసుకున్నాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు బావున్నాయి. బిజోయ్ నేపథ్య సంగీతం బావుంది. పాటలు పరవాలేదు. సారంగ్ ఫోటోగ్రఫీ గొప్పగా ఉంది. అన్ని విభాగాలు బాగా పనిచేసాయి. అమ్మా, నాన్న, తమిళ అమ్మాయి సినిమా లాగే ఈ సినిమాకు క్లైమాక్స్ కీలకం. మనని మంచి అనుభూతికి లోను చేశాడు.
ఆదిగా శర్వానంద్ నటన గొప్పగా ఉంది. అలాగే అమల కూడా. వెన్నెల కిషోర్, దర్శి, నాజర్, రీతు వర్మ, బాల నటులు బాగా నటించారు.
..రాజేంద్రప్రసాద్ రెడ్డి
Discussion about this post