చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఈ నెల 16వ తేదీన కొవిడ్ నిబంధనల మధ్య కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు తెలిపారు.
ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి యేటా కైలాసగిరి ప్రదక్షిణ (కొండచుట్టు) ఉత్సవం జరపడం ఆనవాయితీ.
అందులో భాగంగా ఈ ఏడాది కూడా గిరిప్రదక్షిణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొవిడ్ ఉధృతి చాలా పెరుగుతుండటంతో… కొన్ని నిబంధనలు విధించారు.
స్వామి, అమ్మవార్లు ముక్కంటి ఆలయంలో బయలు దేరిన రామాపురం రిజర్వాయరు సమీపంలోని అంజూరువారి మండపం వద్ద మాత్రమే దించుతారు.
అక్కడ నుంచి బయలుదేరితే శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని ఎదురు సేవా మండపంలో దించుతారు.
ఈ రెండు ప్రదేశాల్లో తప్పితే… స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఎక్కడా దించరు. ఉభయదారుల ఉభయాలకు కూడా అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు.
భక్తులకు దేవస్థానం తరపున జరిపే అన్నదానం, ప్రసాద వితరణ కార్యక్రమాలు రద్దు చేశారు.
కొవిడ్ కారణంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని.. భక్తులు ఇందుకు సహకరించాలని పెద్ధిరాజు విజ్ఞప్తి చేశారు. భక్తులు కూడా ఇందుకు సహకరించాల్సి ఉంది.
.