అదేమిటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అంటే.. కొమ్ములు తిరిగిన మొనగాడు నటులకు తప్ప మామూలు గొప్ప నటులకు కూడా రాదు కదా! ఎవరో ఈ నటి అలేఖ్యకు ఎలా వచ్చిందా? అని ఆశ్చర్యపోతున్నారా? మీ ఆశ్చర్యంలో అర్థముంది. కానీ.. ఆ ఫాల్కే అవార్డు మీరు అనుకుంటున్న అవార్డు కాదు. అలాగే.. సినీ రంగంలో నటనా పటిమకు ఇచ్చింది కూడా కాదు. ఏదో ఆ పేరుతో.. జనాల్ని కన్ఫ్యూజన్ లో పెట్టడానికి ఇచ్చిన అవార్డులాగా కనిపిస్తోంది.
కానీ.. ఆమె సాధించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు పరవశించిపోయి.. తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రత్యేకంగా ఆమెను ఇంటికి పిలిపించుకుని సత్కరించిందంటే ఏం అనుకోవాలి? ఏమో ఈ మేరకు విడుదల అయిన ప్రెస్ నోట్ గమనిస్తే మాత్రం అలేఖ్య అవార్డు సాధించినందుకు ఆనందంతో పాటు, అనేక సందేహాలు కూడా కలుగుతాయి.
ప్రెస్ నోట్ ఇదీ :
కరోనా కారణంగా గతేడాది దేశమంతటా విధించిన లాక్ డౌన్ పథ్యంలో ఎంతో మంది ముందుకొచ్చి నిరుపేదలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు. ముఖ్యంగా సినిమా వారు నిరుపేదలకు సాయపడ్డారు. అందులో భాగంగా దాదాపు నలభై వేల మందికి పైగా నిరుపేదలకు నిత్యవసరాలు పంపిణీ చేసిన నటి అలేఖ్యను కేంద్రప్రభుత్వం వారు కరోనా హీరోగా గుర్తించి `దాదాసాహెబ్ ఫాల్కె` అవార్డుతో సత్కరించారు. ఈ పురస్కారం సౌత్ ఇండియా తరపున నటి అలేఖ్య అందుకోగా, నార్త్ ఇండియాలో నటులు సోనూసూద్, అక్షయ్ కుమార్, నటి దీపికా పడుకొనే అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలేఖ్యను వారి ఇంటికి పిలిపించుకొని సన్మానించి..“ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేసి.. అందరికీ ఆదర్శంగా నిలిచారంటూ“ ప్రశంసించారు. నటి అలేఖ్య మాట్లాడుతూ…“కవిత ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఇలా ప్రశంసించడంతో మరెన్నో మంచి పనులు చేయాలన్న ఉత్సాహం కలిగింది“ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఫిలించాంబర్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ…“ లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి సాయపడిన అలేఖ్యను, దాదాపు 15 వేల మందకికి నిత్యావసరాలు పంపిణీ చేసిన మా తెలంగాణ ఫిలించాంబర్ ను అభినందిస్తూ మరెన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలనీ, మీకుమా ప్రభుత్వం తరపున ఎటువంటి సాయమైనా అందించడానికి సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. కవిత ఇచ్చిన కాంప్లిమెంట్స్ తో భవిష్యత్ లో ఇలాంటివి మరెన్నో చేయాలన్న ఆసక్తి పెరిగింది“ అన్నారు.
.
Discussion about this post