శ్రీకాళహస్తిలో పోలీసులు స్వేచ్చకు సమాధి కడుతున్నారు. కనీస హక్కులను కాలరాస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పాల్గొనకుండా రక్షక భటులే అడ్డుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఎలా తొత్తులుగా వ్యవహరించారో.. పాలసరఫరా సంఘం ఎన్నికల్లో సైతం అదే తరహాలో చేశారు. పోలీసుల తీరు చూస్తుంటే.. శ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం వ్యక్తమవుతోంది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ది కాళహస్తి కో-ఆపరేటివ్ పాల సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల కలెక్టరు వెంకట్రమణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి మధు నోటిషికేషన్ విడుదల చేశారు.
ఈ సొసైటీకీ అధ్యక్షునితో పాటు డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంది. మొత్తం 9మంది సభ్యులకు కాను రెండు స్థానాలు మహిళలు (జనరల్ )కు కేటాయించారు. గతంలో ఈ సొసైటీని తెలుగుదేశం కైవసం చేసుకుంది. పాలసరఫరా సంఘం అధ్యక్షులుగా రావిళ్ల మునిరాజ నాయుడు ఉండేవారు. ఇటీవలను ఆయన పదవీ కాలం ముగియండంతో.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టరు నిర్ణయించారు.
ఈ సొసైటీ ఎన్నికలకు శనివారం నామినేషన్ల ప్రక్రియ జరగాలి. మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఆదివారం నామినేషన్ల పరిశీలన…2న ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థులకు ఎన్నికల గుర్తు కేటాయింపు జరగాలి. 5వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఎన్నికలు నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు.
సొసైటీలో సభ్యత్వం ఉన్న పాడి రైతులు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం రంగం సిద్ధం చేసుకుంది. పాడి రైతుల నుంచి వీరికి బాగా మద్దతు ఉండటంతో ఈ ఎన్నికల బరిలో నిలవాలని వీరు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మండలం మన్నవరం కు చెందిన టీడీపీ నేత, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు రంగినేని చెంచయ్యనాయుడును ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి.. ఆ పార్టీ తరపున నామినేషన్లు వేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా పాల సొసైటీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలని అధికార పార్టీ వ్యూహం రచించింది. ఛైర్మన్ అభ్యర్థులతో పాటు.. డైరెక్టర్లను ఖరారు చేశారు. తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తే.. ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం చేసుకోవడానికి అధికార పార్టీ నేతలు పోలీసులను రంగంలోకి దించారు.
నామినేషపన్ దాఖలు చేయడానికి వస్తున్న రంగినేని చెంచయ్యనాయుడుతో సహా వేముల కృష్ణమనాయుడు, రేవిళ్ల రమేష్, ఎన్.మనోహర్, జి.వెంకటేశ్వర్లు, వెంకటముని తదితరులను శ్రీకాళహస్తి మండలంలోని ఈండ్రపల్లె వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ నుంచి వారిని శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నామినేషన్ వేయడానికి వస్తున్న టీడీపీ నేతలను అకారణంగా అరెస్టు చేసి.. స్టేషన్ కు తరలించడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేయాలని నిర్ణయించాయి.
ఇది తెలుసుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా శ్రీకాళహస్తిలో గృహ నిర్బంధం చేశారు. అదేవిధంగా పలువురి నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యలను పలువురు ఖండించారు. అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ చర్యను ప్రజాస్వామ్య వాదులు ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. వైసీపీ నేతలు ఇలాగే దౌర్జన్యాలు చేస్తుంటే.. రాబోయే కాలంలో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
Discussion about this post