సాధారణంగా అడవిలో నివసించే పులి, సింహం, తోడేలు లాంటి కౄరమృగాలను చూసి సాటి సాధుజంతువులు భయపడడం సహజం. అలాంటి కౄరమృగాలు జనసంచారం ఉండే ప్రదేశాలలోకి అకస్మాత్తుగా వచ్చేసినప్పుడు మనుషులమైన మనం భయభ్రాంతులకు గురికావడం కూడా అతి సహజం.
కానీ, సాటి మనుషులే కౄరమృగాలై, కామోన్మాదులై కలియుగ కీచకులై వికటాట్టహాసం చేస్తూ సంచరిస్తుంటే మన ఆడబిడ్డలు ఎక్కడ తలదాల్చుకోవాలో తెలియక, ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయంతో బతుకులీడుస్తున్న రోజులు దాపురించడం మాత్రం మన దౌర్భాగ్యం.
ఆనాడు ద్వాపరయుగంలో కౌరవ నిండుసభలో మహాసాధ్వి ద్రౌపదిని వివస్త్రను చేయడానికి దుష్ట చతుష్టయాలు ప్రయత్నించినప్పుడు ఆ మహాతల్లి ఆర్తనాదాలు విని శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఆమె మానాన్ని కాపాడాడు. కానీ, నేటి కలియుగంలో మహిళలకు అలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు రక్షించడానికి సాటి మనుషులు కూడా ఎవరూ ముందుకు రాకపోవడం దురదృష్టకరం.
గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రబిందువని కీర్తింపబడిన భరతఖండంలో యావత్తు మానవజాతి సిగ్గుపడాల్సిన అమానవీయ సంఘటన చోటుచేసుకోవడం నీచాతినీచం, శోచనీయం. ఇటీవల మణిపూరులో మహిళలపై జరిగిన దురాగతం మానవత్వంపై ఎప్పటికీ చెరిగిపోని మాయని మచ్చ.
మణిపూరులో ప్రధానంగా రెండుతెగలమధ్య ఎప్పటినుంచో అంతర్యుద్ధం కొనసాగుతోంది. వాళ్ళ మధ్య వివాదాలకు అనేక కారణాలు ఉండొచ్చు. కారణాలు ఏమైనప్పటికీ మహిళలపై దుర్మార్గంగా వ్యవహరించడం మాత్రం సహించలేని విషయం.
అసలు మనుషుల్లో ఇలాంటి వికృతచేష్టలకు మూలాలు ఎక్కడ నుంచి సంక్రమించాయో అని ఆలోచిస్తే యుగధర్మమేనని నాకు అనిపిస్తోంది.
కృతయుగంలో ధర్మాం నాలుగు పాదాలపై నడిచి ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లారు. కానీ, హిరణ్యాక్షుడు భూమాతను ఎత్తుకుని గిరగిర తిప్పి సముద్రంలో వేయడానికి ప్రయత్నించినప్పుడు మహా విష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమాతను రక్షించి ఆ రాక్షసుడిని సంహరించాడు.
త్రేతాయుగం వచ్చేటప్పటికి ధర్మం మూడు పాదాలలో నడవడంవల్ల లంకాధీశుడు అయిన రావణాసురుడు శ్రీరామచంద్రమూర్తి సతీమణి సీతాదేవిని అపహరించుకుని వెళ్ళడం వల్ల ఆ మహాసాధ్విని సంరక్షించుకోవడం కోసం అవతారపురుషుడైన శ్రీరాముడే యుద్ధం చేయవలసి వచ్చింది.
ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై నడవడంవల్ల కౌరవసభలో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు రక్షించడానికి కృష్ణ పరమాత్ముడు వచ్చాడు.
మరి కలియుగంలో ధర్మం ఒక పాదంపై నడవలేక దీనావస్థలో ఉన్నప్పుడు అధర్మం పెట్రేగిపోయి మనిషి తన విజ్ఞతను, విచక్షణను కోల్పోయి వికృతచేష్టలకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళని శిక్షించడానికి ఎవరో ఒక అవతార పురుషుడు ఎప్పుడు అవతరిస్తాడో ఏమో?
కలియుగంలో కల్కి అనే అవతార పురుషుడు అవతరిస్తాడని, దుష్ట శిక్షణ చేస్తాడని విన్నాం. మరి ఆ కల్కి భగవానుడు ఎప్పుడు ఎక్కడ అవతరిస్తాడో ఏమో మనకైతే తెలియదు. అప్పటివరకు ఈ రకమైన దుస్సంఘటనలు చూస్తూ నిస్సహాయులుగా ఉండవలసినదేనా? లేక మహిళాలోకంలో సహనం నశించి వాళ్ళల్లో కోపం ఉగ్రరూపమై అది మహోద్యమంగా మారి కామోన్మాదులను అంతమొందిచడమా? అనేది కాలమే నిర్ణయిస్తుంది.
ఈ జనారణ్యంలో మనిషిరూపంలో తిరుగాడే ఏ పులి ఎప్పుడు గాండ్రిస్తుందో, ఏ సింహం ఎప్పుడు గర్జిస్తుందో, ఏ తోడేలు ఎప్పుడు దాడిచేస్తుందో తెలియని పరిస్థితి. అందుకే మహిళలు నిత్యం అప్రమత్తమై జాగరూకతతో వ్యవహరిస్తూ అలాంటి మదమెక్కిన కౄరమృగాలను ఎదుర్కొవడానికి సంసిద్ధులై ఉండాలి.
ఓ మహిళా! ధైర్యంగా నిలబడు నరకాసురుడిపై బాణం సంధించిన సత్యభామలా, ఓ మహిళా! రాజసం ప్రదర్శించు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రాణీ రుద్రమదేవిలా, ఓ మహిళా! పోరాట పటిమను ప్రదర్శించు ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయ్ లా.
ఎందుకంటే…
ఇప్పుడు జనారణ్యంలో కౄరమృగాలు సంచరిస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
Discussion about this post